Nov 16,2023 08:21
  • శాన్‌ఫ్రాన్సిస్కో చేరుకున్న జిన్‌పింగ్‌ 

శాన్‌ఫ్రాన్సిస్కో : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. ఈ వారంలో జరగనున్న అపెక్‌ ఆర్థిక నేతల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ముఖాముఖి చర్చలు జరపనున్నారు. ఈ చర్చల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరపడేందుకు అవకాశం వుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి కొత్త ఊపును ఇవ్వడానికి వీలు వుంటుందని ఆశిస్తున్నారు. చైనా నేతకు స్వాగతం పలికిన వారిలో అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌లు వున్నారు. వీధుల్లో విద్యార్ధులు, పౌరులు ఇరు దేశాల పతాకాలు చేబూని జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. ఈ పర్యటన వల్ల ఇరు దేశాలకు సమాన లబ్ది జరుగుతుందని ఆశిస్తున్నట్లు మీడియా వార్తలు పేర్కొంటున్నాయి. అమెరికాలోనే అతిపెద్ద దైన శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనా టౌన్‌కు, అలాగే ఉత్తర అమెరికాలోని అత్యంత పాతదైన చైనా టౌన్‌కు జిన్‌పింగ్‌ను ఆహ్వానించేందుకు సర్వం సన్నద్దమయ్యాయి. ఇక్కడ గల చైనీయులకు ఇది చాలా ఆనందకరమైన అంశమని చైనీయులు వ్యాఖ్యానించారు. ఇరు దేశాలు లబ్ధి పొందేలా నేతలిరువురు కూర్చుని సమగ్రంగా, కూలంకషంగా చర్చలు జరపాలని వారు కోరుకుంటున్నారు.