
రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్ మంత్రి గురు రుద్రకుమార్ కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. ఈ ప్రమాదం నుండి మంత్రి తప్పించుకోగా, ఆయన సిబ్బందికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ ఘటనలో మంత్రి వాహనంతో పాటు కాన్వాయ్ లోని మరో వాహనం దెబ్బతిన్నాయని అన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని అహివారా ఎమ్మెల్యేగా ఉన్న గురు రుద్రకుమార్.. ఈసారి నవగఢ్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. నవగఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గురుదయాళ్ సింగ్ బంజారేకు టికెట్ తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్టానం .. రుద్రకుమార్‌ను అక్కడ బరిలో నిలిపింది. దీంతో నవగఢ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. కాన్వాయ్ ఝల్ గ్రామం వద్దకు చేరుకున్న ఆయన కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్దారు. ఈ ఘటనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బెమెతారా ఎస్ పి భావనా గుప్తా వెల్లడించారు.