ప్రజాశక్తి-విఆర్ పురం : మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ రోడ్డు వద్ద స్థానిక ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు, రేఖపల్లి నుండి చింతూరు ప్రధాన రహదారి మీదుగా వచ్చిపోయే ప్రతి వాహనాలను ఆపి నిశితంగా తనిఖీలు చేపట్టారు. వాహన రికార్డులు పరిశీలించి రికార్డులు సక్రమంగా లేని పలువురు వాహనదారుల నుండి అపరాధ రుసుము వసూలు చేశారు. ఎస్సై దుర్గాప్రసాద్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఓవర్ లోడు, ఓవర్ స్పీడు ప్రమాదకరమని, వాహనాల్లో గంజాయి నాటు సారా వంటి అక్రమ రవాణాలకు పాల్పడరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధలు ఉల్లంఘిస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










