ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఛర్మకారుల బతుకు భద్రత కోసం ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ఛర్మకార వృత్తిదారుల సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్సులు కె.భాస్కర్, సుమాల ఆంథోని, కోశాధికారి సి.రాయప్ప, ఉపాధ్యక్షులు సుమాల రాజు తెలిపారు. గురువారం పట్టణంలోని శివసర్కిల్ ఎస్‌బిఐ ఎటిఎంపై ఉన్న కెవిపిఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 24న పట్టణంలో జరిగే ఛర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా ప్రథమ మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమాజంలో నాగరిక వ్యవస్థ వైపు అడుగులు ప్రారంభమైన తొలి నాళ్లలోనే ఛండాలురుగా ముద్రవేసి, మృతదేహాలను ఈడ్చి పడేసే అధమ స్థాయి వృత్తిలోకి దళితులు నెట్టి వేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రోడ్ల సర్కిళ్ల వద్ద వృత్తి నిర్వహిస్తున్న ఛర్మకారులు వృత్తి జరగక ఒకవైపు, మున్సిపల్, పోలీసు వేధింపులతో మరో వైపు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్మికుల్లో నైపుణ్యతను పెంచి, నిరంతర వృత్తిని కల్పించే లెదర్ పార్కును మూసేశారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ఛర్మకారుల సమస్యలపై చర్చించి, భవిష్యత్తు భరోసా కోసం ఉద్యమించేందుకు ఈనెల 24న పట్టణంలో ఛర్మకారుల జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మహాసభల జయప్రదానికి అందరూ సహకరించాలని కోరారు. నాయకులు కలుగొట్ల రాజా రమేష్, గుడికల్ ఆనంద్, ఈరన్న గౌడ్, రంగప్ప పాల్గొన్నారు.
జిల్లా మహాసభ కరపత్రాలను విడుదల చేస్తున్న నాయకులు










