Nov 15,2023 17:23

విజయవాడ :   రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులొస్తున్నాయి. ప్రభుత్వాలు ఏదో మేలు చేస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజల సమస్యలే ఎజెండాగా ప్రజారక్షణ భేరిని సిపిఎం నిర్వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు.  బుధవారం సింగ్‌నగర్‌లోని ఎంబీ స్టేడియంలో జరిగిన ప్రజారక్షణ భేరి బహిరంగసభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'' మనందరం చూస్తూనే వున్నాం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, పదవుల కోసం, కుర్చీల కోసం కొట్లాట తప్ప ప్రజల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. ప్రజల సమస్యలపై చర్చిస్తున్న పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో ప్రజల సమస్యలే ఎజెండాగా తీసుకొని, గత నెలరోజులుగా ప్రజారక్షణ భేరిని రాష్ట్రవ్యాప్తంగా మూలమూలలా తిరిగి, ప్రజలందరినీ కలుసుకొని వేలాది విజ్ఞప్తులు స్వీకరించాం. ప్రజల అసలైన సమస్యలను ప్రజా ప్రణాళిక ద్వారా ఈ సభలో ఆవిష్కరించాలని కూడా నిర్ణయించుకున్నాం. ఈ ప్రజా ప్రణాళికను రాబోయే రోజుల్లో విస్తృతంగా  ప్రజల్లోకి తీసుకెళ్లి, ఆ సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని, ప్రజలను ఐక్యం చేయాలని, ఈ రాష్ట్రం యొక్క భ్యవిష్యత్‌ రూపురేఖలను మార్చాలన్న లక్ష్యంతోనే ఈ ప్రజారక్షణ భేరి బహిరంగసభను నిర్వహిస్తున్నాం. సుందరయ్య ఇచ్చిన విశాలాంధ్రలో ప్రజారాజ్యం కల ఇంకా కలగానే మిగిలిపోయింది. దాన్ని కమ్యూనిస్టులు మాత్రమే పూర్తి చేయగలరని ఈ ప్రజా రక్షణ భేరి ద్వారా చెప్పదలచుకున్నాం. ఇక్కడికొచ్చిన రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు కవాతు చేయడానికి వచ్చినవారు కాదు... వారు నిరంతరం ప్రజలకు సేవ చేయడానికి కంకణం కట్టుకున్న యోధులు వాళ్లు అని, ప్రజలకు అండగా వుండే స్వచ్ఛంద సేవకులు వాళ్లు అని శ్రీనివాసరావు అన్నారు. నేడు అవినీతితో రాష్ట్రమంతా కంపుకొడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, విభజన హామీలు అమలు జరుగుతాయని ఎంతో ఆశతో ఎదురుచూశాం. ఈ రాష్ట్రాలను రెండు కళ్లగా కాపాడతానని ప్రధాని మోడీ చెప్పారు. కానీ మోడీ మాట తప్పారు. అటువంటి వ్యక్తికి ప్రధాని ప్రదవిలో కూర్చునే హక్కు వుందా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు.

వెన్నుపోటుదారులు అన్నదానికి సజీవ ఉదాహరణ ప్రధానమంత్రి మోడీ అని అన్నారు. అంతేకాదు... దేశంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ధరలు తగ్గిస్తాన్నారు... తగ్గించలేదు. ఉద్యోగాలిస్తానన్నారు... నిరుద్యోగాన్ని పెంచారు. వెనుకబాటు తనాన్ని పోగొడతానన్నారు... ఇంకా అంతరాలు పెంచారు. దేశంలో ఏ ఒక్క తరగతికిచ్చిన వాగ్దానాలనూ నెరవేర్చలేదు. పైగా, పోరాడుతున్న ప్రజల్లో చీలికలు తెచ్చి, మతోన్మాదాన్ని రుద్ది, మతాల వారీగా విభేదాలు పెట్టి, ఘర్షణలు సృష్టించి, విధ్వేషాలు పెంచి, ఈ దేశాన్ని బలహీనపరచి దేశ సమైక్యతకే చిచ్చుపెతోంది  మోడీ నాయకత్వంలోని బిజెపి. రాష్టానికిచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ద్రోహం చేసినా ఈ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వీటిని ప్రతిఘటించక పోగా, వారికి సాష్టాంగపడి, తెలుగు ప్రజల పౌరుషాన్ని ఢిల్లీ పాలకులకు తాకట్టు పెట్టారని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పార్టీలు ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకొని, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని కాపాడటానికి బిజెపితో తెగతెంపులు చేసుకొని, వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలా కాకుండా ఢిల్లీ పాలకులకు లొంగిపోయి ఇదేరకమైన సేవ చేస్తూ ఉంటే తెలుగు ప్రజలు క్షమించరని శ్రీనివాసరావు అన్నారు. మోడీ చెప్పిందే తడవుగా రాష్ట్రంలో అన్ని సంస్కరణలను జగన్మోహన్‌ రెడ్డి అమలు చేసేస్తున్నారు. ధరలు పెంచేస్తున్నారు. విద్యుత్‌ ఛార్జీలు మోయలేని భారంగా మారాయి. రాష్ట్రమంతా కరువుకాటకాలతో అల్లాడుతుంటే... ఎపీ నీడ్స్‌ జగన్‌ అంటూ ఒక వాణిజ్య ప్రకటనలా ప్రచారం చేస్తున్నారు. వాణిజ్య ప్రకటనలకు ప్రజలు మోసపోరని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద సిపిఎం నిరంతరం పోరాడుతుంది, ప్రజల తరఫున నిలబడి ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు.  పోరాటాలు, ధర్నాలు చేసే ప్రజలపై కూడా కేసులు పెట్టడం, వేధింపులకు దిగడం వంటి దుర్మార్గానికి రాష్ట్రప్రభుత్వం పాల్పడుతోంది. రాగ్యాంగం ఇచ్చిన ఆందోళన చేసే హక్కును కూడా లాక్కొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై నిర్బంధాన్ని విధిస్తున్నారు. ఈ పద్ధతులను సిపిఎం వ్యతిరేకిస్తోందని శ్రీనివాసరావు అన్నారు.

ప్రజాస్వామ్యం కోసం, పౌరహక్కుల పరిరక్షణ కోసం సిపిఎం నిలబడుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలను గొలికొదిలి బిజెపి చెంత చేరడానికి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పాలకపార్టీ, ప్రతిపక్షం కూడా పోటీలుపడి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.  ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పే పవన్‌ కళ్యాణ్‌... ప్రశ్నించకపోగా... మోడీ మూడోసారి ప్రధాని కావాలని చెబుతున్నాడు. ఈ రాష్ట్రానికి మోడీ ఏం చేశాడని మూడోసారి ప్రధాని కావాలంటున్నారో పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఇది తెలుగు ప్రజల అజెండా కాదు, ఇది కేవలం పవన్‌ కళ్యాణ్‌ సొంత అజెండా అని శ్రీనివాసరావు అన్నారు. ఇలాంటి అజెండాల చుట్టూ యువతరం పోకూడదు.'' అని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.