
అమరావతి : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేస్తున్న ఉద్యమం కృత్రిమమైనదని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసమే దీనిని నడిపిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులూ అభివృద్ధిని, ప్రజలను పూర్తిగా విస్మరిస్తూ కాలయాపన చేశారని, ఇప్పుడు ఉద్యమం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని తప్పుబట్టారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టినా చంద్రబాబును తిరస్కరించి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి ప్రజామోదం లభించిందని తెలిపారు. రియల్ ఏస్టేట్ ప్రయోజనాల కోసమే అమరావతి ఉద్యమాన్ని చంద్రబాబు నడుపుతున్నారని తెలుసుకొనే రాజధాని ప్రాంత ప్రజలు కూడా వైసిపికి మద్దతు ఇచ్చారని తెలిపారు.