Nov 05,2023 20:22

కరపత్రాలను పంపిణీ చేస్తున్న సిపిఎం నాయకులు శంకరరావు

ప్రజాశక్తి- బొబ్బిలి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 15న జరగనున్న ఛలో విజయవాడను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 15న విజయవాడలో నిర్వహించనున్న ప్రజా రక్షణ భేరిను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు పని చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ప్రజలపై భారాలు వేసేందుకు చట్టాలను చేస్తున్నారని, కేంద్రం తీసుకోస్తున్న చట్టాలను రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలతో నిత్యావసర ధరలు, డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరగనున్న ప్రజా రక్షణ భేరిను జయప్రదం చేయాలని కోరారు.