ప్రజాశక్తి-విజయవాడ : ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, పని ప్రాంతాలలో మౌలిక సదుపా యాలు కల్పించాలని, అధిక ధరల అరికట్టాలని కోరుతూ వచ్చే నెల 5వ తేదీన నిర్వహిస్తున్న ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముఠా కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ముఠా కార్మికుల సమస్యల పరిష్కారానికై ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం గవర్నర్‌పేటలోని ఆలీబేగ్ స్ట్రీట్ వద్ద ముఠా కార్మికులతో గ్రూప్ మీటింగ్ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... ముఠా కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని అన్నారు. కేంద్రంలో మోడీ- బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మిక చట్టాలలో మార్పులు తీసుకువస్తూ కార్మికులకు పోరాడే హక్కు లేకుండా చేస్తున్నారని తెలిపారు. వివిధ దేశాలు రాష్ట్రాల నుండి వచ్చే సరుకులను లోడింగ్, అన్లోడింగ్ చేసే ముఖ్యమైన కార్మికులు ముఠా కార్మికులు పనులు చేసే సందర్భంలో ఎటువంటి ప్రమాదం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి యజమానుల ద్వారా గాని ఎటువంటి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ముఠా కార్మికులకు ప్రమాద జీవిత బీమా వర్తింప చేయాలని,ఇతర సమస్యల పరిష్కారం కోరుతు నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఠా వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం. సీతారాములు,ఎం. బ్రహ్మయ్య సి.హెచ్ నరసింహులు, పెద్దిరాజు గురవయ్య తదితరులు పాల్గొన్నారు.










