కలెక్టరేట్ వద్ద వామపక్షాల ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీతారాం
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
పెంచిన విద్యుత్‌ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమం చేపడుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరైన సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చెప్పిన విధంగా విద్యుత్ సంస్కరణలను చేపడుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తుందన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు ఆదానీ కంపెనీ తయారు చేసిందని, స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చును వినియోగదారుల నుండే ప్రభుత్వం వసూలుచేయబోతుందన్నారు. 2014 నుండి ఇప్పటివరకూ విద్యుత్ సంస్థలకు వచ్చిన కరెంటు లోటును కూడా కరెంటు బిల్లులో కలిపి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. పూర్వం సాధారణ పేద కుటుంబాలకు రూ.200 కరెంట్ బిల్లు వచ్చేదని ఇప్పుడు రూ.వెయ్యి పైబడి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు భరించలేనంతగా కరెంటు ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి టిడిపి ప్రభుత్వం ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచితే వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యమాన్ని నడిపాయని గుర్తు చేశారు. ఆ ఉద్యమం దెబ్బకి 2004లో తెలుగుదేశం చిత్తుగా ఓడిపోయిందని, ఆ తరువాత రాష్ట్రంలో ఇప్పటి వరకూ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచలేదన్నారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం కేంద్రంలో బిజెపి షరతులకు తలవంచి కరెంటు ఛార్జీలు పెంచుతుందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, సిపిఐ జిల్లా కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కెవి.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ అదనపు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బి.సోమయ్య, కె.శ్రీనివాస్, పి.రామకృష్ణ, పి.ఆదిశేషు, నగర నాయకులు సాయిబాబు, జగన్నాధరావు, గోపి, సిపిఐ నాయకులు పి.కన్నబాబు, వరప్రసాద్, సుధారాణి, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు బద్దా వెంకట్రావు, వామపక్ష, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










