Jun 22,2023 23:49

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు విజరుకుమార్‌ తదితరులు

ప్రజాశక్తి - నరసరావుపేట : వివిధ ఛార్జీల పేరుతో ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న విద్యుత్‌ భారాలను రాష్ట్ర ప్రభుత్వం మోపుతోందని, నాలుగేళ్లలో ఐదుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ అన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌ అధ్యక్షత వహించారు. విజరుకుమార్‌ మాట్లాడుతూ 2014 నుండి విద్యుత్‌ వాడకంలో వచ్చిన లోటును పూడ్చుకునేందుకు ప్రజలపై భారాలు వేయటం తుగ్లక్‌ పాలనను తలపిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పుకుంటూనే భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీలు పెంపుదలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. 2000 సంవత్సరంలో నూతన ఆర్థిక విధానాల్లో అంతర్భాగంగా ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌ ఛార్జీలను పెంచడానికి ప్రయత్నం చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది పాటు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే టిడిపి పదేళ్లపాటు అధికారం కోల్పోయిందని అనానరు. వైసిపి ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకుంటే టిడిపికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలను ప్రజాసంఘాలను ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఉద్యమం చేస్తామని అన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, ప్రజల నుండి సంతకాలు సేకరిస్తామని అన్నారు. చెత్త పన్ను పేరుతో పేదలపై భారాలు వేశారని, పదేళ్లకోసారి నామమాత్రంగా పెంచాల్సిన ఆస్తి పన్నులను కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలొగ్గిన అద్దె ఆధారిత పన్నును విలువ ఆధారిత పన్నుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. దీనివల్ల ఏడాదికి 15 శాతం పన్నులు పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు. జీవనోపాధి, పిల్లల చదువుల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి వివిధ పట్టణానికి వచ్చే వారు ఈ భారాలకు బలవుతున్నాని, అద్దెలు పెరిగి వాటిని చెల్లించలేక గ్రామాలకు తిరిగెళ్తున్నారని అనానరు. వివిధ వ్యాపార సంస్థలు కూడా పెరిగిన ఆయా పన్నుల భారాలను వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా భారాలు మోపడమే వైసిపి దృష్టిలో సంక్షేమ పాలనా అని ప్రశ్నించారు.
కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ మోడీ మెప్పు కోసం రాష్ట్ర హక్కులను రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్న చట్టాల అమలుకూ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోందని అన్నారు. అనేక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యుత్‌ సవరణలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని విమర్శించారు. శ్రామిక సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి మాట్లాడుతూ పాత మీటర్లు సమర్థవంతంగా పని చేస్తుంటే ఆ స్థానంలో స్మార్ట్‌ మీటర్లు ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ తెచ్చిన విద్యుత్‌ సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సిఎం జగన్‌ వేగవంతంగా అడుగులు వేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియకు మొదలైతే విద్యుత్‌ చార్జీలు రెండింతలు పెరిగే అవకాశం ఉందన్నారు. సిఐటియు పట్టణ కార్యదర్శి ఈవూరి మస్తాన్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూనే వ్యవసాయ బోర్లకు మోటార్లు పెడుతున్నారని అన్నారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పెర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడం,స్మార్ట్‌ మీటర్లు పెట్టి నగదు చెల్లించిన తర్వాతే విద్యుత్‌ వాడుకునే విధానాలు అమలైతే విద్యుత్‌ మరింత భారమవుతుందని అన్నారు. అనంతరం ఐద్వా నాయకులు ఫాతిమా మాట్లాడారు.
విద్యుత్‌ సంస్కరణలపై పోరాటం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలను ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే అమలు చేయడం లేదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వైసిపి తూచ తప్పకుండా అమలు చేస్తున్నారని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ విమర్శించారు. మోడీ విధానాలను అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై మోయలేని ఛార్జీల భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సిపిఎం పట్టణ కార్యదర్శి సిలార్‌ మసూద్‌ అధ్యక్షత వహించగా విజరు కుమార్‌ మాట్లాడుతూ గత నాలుగేళ్లలో ఏదోఒక పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నారని, 2014 నుండి ఇప్పటివరకు సర్దుబాటు ఛార్జీలు రూ.6 వేలకోట్ల భారాలు మోపేందుకు సిద్ధమయ్యారని అన్నారు. యూనిట్‌కు 60 పైసలు పెంచి జులై నుండి వసూలు చేస్తారన్నారు. కస్టమర్‌ ఛార్జీల పేరిట రూ.10ని బిల్లు ఆధారంగా నాలుగింతలు పెంచి వసూలు చేస్తున్నారన్నారు. అదాని కంపెనీకి స్మార్ట్‌ మీటర్ల బిగింపు ప్రక్రియను కాంట్రాక్టు ఇచ్చిన మోడీ ఒక్కోమీటర్‌కు విడతల వారీగా రూ.13 వేల వరకు వసూలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నాయని తెలిపారు. ఈ విధానాల నుండి ప్రభుత్వం వెనుక్కు తగ్గాలని, ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజల్ని కదిలించి పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఏపూరి గోపాలరావు, ఎ.లక్ష్మీశ్వరరెడ్డి, నాయకులు డి.శివకుమారి, కె.హనుమంతరెడ్డి, నాగమ్మభారు, కె.రామారావు, జి.పిచ్చారావు, టి.శ్రీను, ఎం.హరిపోతురాజు, ఎం.ఆంజనేయులు, సాంబశివరావు, రాజకుమార్‌ పాల్గొన్నారు.