Sep 01,2023 00:23

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలపై సిపిఎం చేపట్టిన ప్రచార సమర భేరి కార్యక్రమం జిల్లాలోని పలుచోట్ల గురువారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. పోస్టర్లు ఆవిష్కరించారు. ప్రజలకు అవగాహన కల్పించారు.
కాకినాడ 37వ డివిజన్‌ పాత బస్టాండ్‌, వెంకటేశ్వర కాలనీ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలు పంచుతూ, సంతకాలు సేకరించారు. సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి, సిహెచ్‌.రమణి మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ నేడు రూ.1200కు చేరిందన్నారు. కాకినాడ సమీపంలో పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయన్నారు. గ్యాస్‌ను గుజరాత్‌ తరలించి కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు దోచిపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల జిమ్మిక్కులో భాగంగా గ్యాస్‌పై రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించారని, చిత్తశుద్ధి ఉంటే రూ.400కే గ్యాస్‌ సరఫరా చేయాలని సవాల్‌ విసిరారు. ఈ ప్రచారంలో సిపిఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలకా వెంకట రమణ, కె.నాగజ్యోతి, సి.వేణు, భూలక్ష్మి, కుమారి, సత్యనారాయణ, ఆదర్శ్‌ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ రూరల్‌ మండలం తూరంగి గ్రామంలో సిపిఎం సీనియర్‌ నాయకులు చింతపల్లి అజరు కుమార్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం అంటుతున్నాయన్నారు. ప్రజల ఆదాయాలు నేల మీదే ఉన్నాయన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని, తాను అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ 9 ఏళ్ల కాలంలో ఎన్ని కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.రాజా, దుర్గ, సతీష్‌, మంగ, వెంకయ్యమ్మ, వెంకటలక్ష్మి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా చేదువాడ వంతెన వద్ద సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, మండల కన్వీనర్‌ వల్లు రాజబాబు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో అడ్డూ అదుపూ లేకుండా ధరలు విపరీతంగా పెంచేసిందన్నారు. కేంద్రం ఆర్డర్‌ వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు పెంచుతోందన్నారు. ఈ కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. విద్యుత్‌ ఛార్జీలు రూ.400 అయితే మరో రూ.300 అదనపు ఛార్జీల పేరిట ప్రజల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్నారు. ఈ భారాలు తగ్గించాలని దేశవ్యాప్తంగా సిపిఎం ప్రచారం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కురుపూడి భూచక్రం, దంగేటి శ్రీనివాసులు, సందాల సూర్యనారాయణ, కురుపూడి రాంబాబు, గంజా అప్పారావు, మాజీ సర్పంచ్‌ పెంకే సూర్యనారాయణ, గెద్దాడ సత్తిబాబు, షాజహాన్‌, పెంకే శ్రీనివాసు పాల్గొన్నారు.