శీతాకాలం వచ్చిందంటే చిక్కుడు కాయ కంటికి ఇంపుగా నోరూరిస్తూ కనిపిస్తుంటుంది. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వీటితో కూర, పప్పు చేసుకోవడం మనందరికీ తెలుసు. కానీ చిక్కుడుతో వెరైటీగా చెక్కలు, బిర్యానీ, వడలు, పచ్చడిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీటిని ఏదో ఒక రూపంలో మనం ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
చెక్కలు
కావాల్సిన పదార్థాలు : ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు - అరకప్పు, బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ - తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూను, ఉప్పు - తగినంత, సోడా - తగినంత, నెయ్యి - 2 స్పూన్లు, నువ్వులు, జీలకర్ర - కొంచెం, నూనె - వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం :
ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు చల్లారాక మిక్సీలో మెత్తగా వేసుకుని పక్కన పెట్టుకోవాలి.
గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, గ్రైండ్ చేసిన చిక్కుడుకాయముక్కలు, మిగతా పదార్థాలు (నూనె తప్ప) అన్నీ వేసి బాగా కలిపి నీళ్లు అద్దుకుంటూ చపాతీపిండిలా ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి.
అరగంట తరవాత ఆ పిండిని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
ప్లాస్టిక్ కవరుకు నూనె రాసి దానిమీద ఈ ఉండను పెట్టి వెడల్పుగా ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారురంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి.
చల్లారిన తరవాత డబ్బాలో పెట్టుకోవాలి. కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఇవి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి.
పచ్చడి
కావాల్సిన పదార్థాలు : చిక్కుడుకాయలు- అరకిలో, కారం- 75 గ్రా., ఉప్పు- తగినంత, నూనె- 200గ్రా., నిమ్మకాయలు- ఆరు, మసాలాపొడి -2 స్పూన్లు, అల్లంవెల్లుల్లి- 2 స్పూన్లు, పసుపు- అరస్పూను.
తయారుచేసే విధానం :
పాన్‌లో నూనె వేసి కాగాక ఈనెలు తీసిన చిక్కుళ్లను వేసి వేయించి తీయాలి.
తర్వాత వాటిని ఓ వెడల్పాటి గిన్నెలో వేయాలి. ఆ నూనెలోనే అల్లం వెల్లుల్లి వేసి, వేయించి దించి చల్లారనివ్వాలి.
చిక్కుడుకాయలు పూర్తిగా వేడి తగ్గాక వాటిమీద కారం, మసాలాపొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
తర్వాత నూనెతో సహా వేయించిన అల్లం వెల్లుల్లి కూడా వేసి కలపాలి.
చివరగా నిమ్మకాయలన్నీ రసం పిండి, ఆ రసాన్ని అందులో వేసి కలిపి ఆరాక సీసాలో పెట్టుకుంటే సరి.
వడలు
కావాల్సిన పదార్థాలు : శనగపప్పు- కప్పు, చిక్కుడుగింజలు- కప్పు, ఎండుమిర్చి- నాలుగు, అల్లం తురుము- స్పూను, జీలకర్ర- స్పూను, మెంతులు- స్పూను, ఉల్లిపాయ- ఒకటి, కొత్తిమీర తురుము- పావుకప్పు, కరివేపాకు తురుము- పావుకప్పు, ఉప్పు- సరిపడా, నూనె- వేయించడానికి తగినంత.
తయారుచేసే విధానం :
శనగపప్పుని నాలుగైదు గంటలు నాననివ్వాలి. అందులో ఒలిచిన చిక్కుడుగింజలు, ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.
తర్వాత కొత్తిమీర, కరివేపాకు తురుము, ఉప్పు, ఉల్లిముక్కలు వేసి కలిపి చిన్న చిన్న వడల్లా చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.
అంతే చిక్కుడు వడలు రెడీ..
బిర్యానీ
కావాల్సిన పదార్థాలు : బాస్మతిబియ్యం- పావుకిలో, చిక్కుడుకాయలు- పావుకిలో, నూనె- 100 మి.లీ., యాలకులు- నాలుగు, జీలకర్ర- స్పూను, దాల్చినచెక్క- చిన్నముక్క, కొబ్బరిపాలు- పావుకప్పు, అల్లంతురుము- స్పూను, వెల్లుల్లి తురుము- స్పూను, పసుపు- అరస్పూను, పలావు ఆకులు- రెండు, ఉప్పు- తగినంత, నిమ్మకాయ- ఒకటి, కొత్తిమీర తురుము- 2 స్పూన్లు, గరంమసాలా- స్పూను.
తయారుచేసే విధానం :
ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి ఉంచాలి.
ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి యాలకులు, జీలకర్ర, దాల్చినచెక్క వేసి వేయించాలి.
తర్వాత అల్లం, వెల్లుల్లి, బిర్యానీ ఆకులు వేసి వేగనివ్వాలి. ఇంకా పసుపు, చిక్కుడుకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
అందులోనే బియ్యం వేసి ఓసారి కలపాలి. తర్వాత కొబ్బరిపాలు, సుమారు గ్లాసున్నర నీళ్లు పోసి.. ఉప్పు వేసి కలపాలి.
తర్వాత గరంమసాలా వేసి మూతపెట్టి ఓ రెండు విజిల్స్ రానివ్వాలి.
చివరగా ఉప్పు సరిచూసి నిమ్మరసం పిండి కొత్తిమీర తురుము చల్లి వడ్డించాలి.