ఈ చెట్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. ఎండల్లో ఏంచక్కని నీడనిస్తాయి. పూలు పూస్తే .. అక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తాయి. పెద్ద పెద్ద నిర్మాణాల ముందు చక్కని అలంకరణ వృక్షాలుగా అలరారతాయి. అంతే కాదు; అత్యద్భుత ఔషధ లక్షణాలనూ కలిగి ఉంటాయి.
- రేల మనుసు అదిరేలా గొలుసుకట్టులాంటి పూలగుత్తులను పూస్తూ నిండుగా గుబాళించే చెట్టు రేల. వాటి పూలు లేత, ముదురు, పసుపు రంగులో కాంతులీనుతాయి. రేల ఒక రకమైన కాసియా జాతికి చెందిన చెట్టు. దీనిని అరగ్వద అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా. ఆకులు మెరపుతో కూడిన ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు నలుపులో గాని, పూర్తి ముదురు గోధుమ రంగులో గాని సన్నగా గుండ్రంగా ఉండి 50 నుండి 60 సెంటీమీటర్లు పొడుగు ఉండి వేలాడుతూ ఉంటాయి. దీనిలో ఇటీవల తెలుపు రంగులో పూలు పూచే హైబ్రిడ్ మొక్కలు కూడా వచ్చాయి. రేల చెట్లు మంచి నీడనిస్తాయి. ఈ చెట్టు పూర్తిగా ఔషధాలే. ఇది సిసల్పినియేసి కుటుంబానికి చెందినది. అంటే చింత చెట్టు బంధువన్నమాట. మలబద్దకం, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు ఈ ఆకులు, పువ్వులను ఉపయోగిస్తారు.
- లెగస్ట్రోమియా
వేసవి రాగానే చెట్టంతా నిండుగా నీలిరంగు పువ్వులతో పరిసర వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చే అపురూపమైన చెట్టు లాగర్‌స్ట్రోమియా. లెగస్ట్రోమియా స్పెసియోసా శాస్త్రీయనామంతో పిలిచే ఈ చెట్టు 66 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఆరు రేఖలతో పువ్వులు గుత్తులు గుత్తులుగా చాలా అందంగా ఉంటాయి. మధ్యలో పసుపురంగు బొడ్డు ఎంతో అందంగా ఉంటుంది. మహారాష్ట్ర అధికార పుష్పం ఈ పువ్వు. దాదాపు రెండున్నర నెలల పాటు ఈ పువ్వులు పూస్తూ ఉంటాయి. ప్రైడ్ ఆఫ్ ఇండియా, క్వీన్ క్రెప్ మైర్టిల్, బనబ పేర్లతో పిలుస్తారు. బౌద్ధంలో కూడా ఈ చెట్టుకు విశిష్ట చరిత్ర ఉంది. కారోసోలిక్ యాసిడ్, ఫ్లోసిన్ బీ, రెజినిన్ ఏ వంటి రసాయన పదార్ధాలు ఈ చెట్టులో ఉండటంతో అనేక రకాల మందులు తయారీకి వాడతారు. వీటి కాయలు నల్లగా గుండ్రంగా గోళీలు మాదిరిగా ఉంటాయి. ఇవి మాదకద్రవ్య స్వభావాన్ని కలిగి ఉంటాయి. కొన్ని జాతుల పక్షులు ఈ కాయలను విపరీతంగా తింటాయి. ఫిలిప్ఫీన్స్, తైవాన్, జపాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో వీటి ఆకుల కషాయాన్ని తేనీటిలా తాగుతారు. వేసవి సీజన్ ముగియగానే ఆకుపచ్చని ఆకులతో చెట్టు కళకళలాడుతూ చక్కటి నీడనిస్తుంది.
- తురాయి
100 అడుగుల ఎత్తు వరకూ పెరిగే నీడ మొక్క తురాయి. చాలా వేగంగా పెరుగుతుంది. మామూలు రోజుల్లో చెట్టు నిండా గుబురుగా ఆకుపచ్చని ఆకులు ఉంటాయి. ఒక్కో ఆకు పది నుంచి 20 అంగుళాల వరకూ ఉంటుంది. పెద్ద ఆకులకు శీర్షాల్లా ఉండి, ఇరువైపులా చిన్న చిన్న ఆకులు ఉంటాయి. పొడవాటి కాయలు ఎండాక విత్తనాలుగా మారతాయి. వేసవిలో ఎర్రటి పూలు పూస్తాయి. మూడు రేఖలు మాదిరి ఉండి, దాని కింద ఎర్రటి తొడుగులు వంటి పత్రాలు ఉంటాయి. మధ్యలో సన్నని పొడవాటి పుప్పోళ్ళు, కేసరాలు ఎంతో అందంగా ఉంటాయి. ఇలాంటి పువ్వులు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఒకానొక దశలో చెట్టుకు ఆకుల్లేకుండా పువ్వులే కనిపిస్తాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి వరకూ పువ్వులు రాలుతూ ఉంటాయి. వేసవిలో చెట్ల నుంచి ఎర్రటి పువ్వులు రాలుతూ ఉంటే ఆ దృశ్యం చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. ఈ చెట్టును ఆఫ్రికాలో ఐతే 'ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్' అని పిలుస్తారు. 'అరణ్య అగ్ని జ్వాల' అని కూడా మనం పిలుచుకుంటాం.
- నిద్రగన్నేరు
వాన చెట్టు, నిద్ర గన్నేరు, గులాబి శిరీశ అని పిలిచే దీన్ని ఇంగ్లీషులో Rain Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Samanea saman (Albizia saman)ఈ చెట్టు అందంగా, ఎత్తుగా, బాగా పెద్దదిగా విస్తరించి ఉంటుంది. ఎప్పుడూ పచ్చగా ఉండే చెట్టు ఇది. విప్పి ఉన్న గొడుగు ఆకారం గల దీనిని సులభంగా గుర్తించవచ్చు. జారుతున్న నీటి బిందువుల వంటి అతి చిన్న పత్రాలతో కూడిన పెద్ద ఆకులుంటాయి. ఇది దాదాపు 25 మీటర్ల ఎత్తు పెరిగి 40 మీటర్ల మేర అడ్డుకొలతతో విస్తరించి ఉంటుంది. ఈ చెట్టు ఆకులు పగలు విచ్చుకొని, రాత్రులు ముడుచుకొని ఉంటాయి. సన్నని కేసరాల్లా గులాబీ, తెలుపు రంగుల మిశ్రమంతో పువ్వులు అందంగా విచ్చుకుంటాయి. వీటి కాయలు చిక్కుడు కాయలు మాదిరిగా ఉండి 10 నుంచి 20 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి. వీటి విత్తనాలు, పువ్వుల్లో మకరందం చాలా తియ్యగా ఉంటుంది. ఇవి కూడా వేసవిలోనే పూస్తాయి.
- పసుపు పూలవర్ధిని
ఇవి 20 నుంచి 50 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద పెద్ద ఆకులకి చింతాకులు వంటి చిన్ని పత్రాలుంటాయి. వేసవి రాగానే పసుపురంగు పువ్వులు చెట్టు నిండుగా పూస్తాయి. పూల సీజన్లో నిరంతరం అక్షింతల్లా పువ్వులు రాలుస్తుంది. ఈ చెట్లున్న చోట నేలంతా పువ్వులతో పసుపు తివాచీలా పరుచుకుంటాయి. నీడనిచ్చే ఈ చెట్లు కూడా ఈదురు గాలులకు విరిగి పడిపోతాయి. పూల సీజన్లో చెట్టు దగ్గర నుంచి గమత్తైన వాసన వస్తుంది. దీనికి రాగి రంగు కాయలు కాస్తాయి. అవే విత్తనాలు. విరేచనాలు, దగ్గు తదితర వాటి నివారణకు ఈ చెట్టు భాగాలు వాడతారు. ఫిల్టోఫామ్ అని పిలుస్తారు. పసుపుపూలవర్ధిని అంటారు.
- చిలుకూరి శ్రీనివాసరావు