ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని ప్రాంతం వెంకటపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలను ఈనెల 26న సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన బహిరంగ సభ నిర్వహించనున్నారు. 20 ఎకరాల్లో సభ, గ్యాలరీ తదితర ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన పేదలకు స్థలం పంపిణీతో పాటు కొంతమంది టిడ్కో గృహ లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపుకు సంబంధించిన పట్టాలు ముఖ్యమంత్రి అందజేస్తారని అధికారులు చెబుతున్నారు. సభ ఏర్పాట్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, వైసిపి తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ మంగళవారం పరిశీలించారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంని, అందులో భాగంగానే 50 వేలమందికి ఇంటి పట్టాలను అందజేస్తోందని అన్నారు. ఇదిలా ఉండగా సభ గడువు సమీస్తున్నందున రాజధాని గ్రామాల్లోని ఆర్-5 జోన్, ఆర్-3 జోన్‌లో ప్లాట్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలి వస్తారని వైసిపి నాయకులు చెబుతున్నారు.










