ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : సిఆర్‌డిఎ పరిధిలోని ఆర్-5 జోన్‌తో పాటు గృహనిర్మాణాలకు కేటాయించిన ఎస్-3జోన్‌లో కూడా భూముల్లో పేదలకు ఇళ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. న్యాయపరంగా ప్రస్తుతానికి చిక్కులులేనందున ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాల కలెక్టర్లపై వత్తిడి పెంచారు. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఇళ్ల స్థలాల పంపిణీని తాము నిలుపుదల చేయలేమని రైతులు దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో అధికారులు తమప్రక్రియను వేగిరపర్చారు. ఈ నేపథ్యంలో అమరావతి మాస్టర్ ప్లాన్‌లో ఆర్-5 జోన్ టెక్నాలజీ సిటీకింద ఐటి పరిశ్రమల స్థాపనకు ఉపయోగించాల్సిన భూములను ప్రభుత్వం పేదలకు ఇవ్వడం సబబుకాదని రైతు నాయకులు ప్రకటించారు.
మంగళగిరి నియోజకవర్గంలో గెలవడం కోసం మంగళగిరి మండలంలోని భూములను తీసుకుంటున్నారని పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధానిలో ఎస్-3 జోన్‌లోనే ఇళ్లస్థలాలకు కేటాయించిన భూములను ఎందుకు తీసుకోవడంలేదని రైతు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం రైతు ప్రతినిధుల ప్రకటనను ఆసరాగా చేసుకుని తుళ్లూరు మండలంలో భూములను కూడా తీసుకునేందుకు గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాల కలెక్టర్లకు అనుమతి ఇచ్చింది. గుంటూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల కోసం మరో 268 ఎకరాలను మాస్టర్ ప్లాన్‌లోని ఎస్-3 జోన్‌లో పరిధిలోని బోరుపాలెం, పిచ్చుకల పాలెం, అనంతరం, నెక్కలు గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం ఎన్‌టిఆర్, గుంటూరు జిల్లా కలెక్టర్లు విజ్ఞప్తి మేరకు ఈ భూమిని కేటాయించారు. ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన 6,055 మంది లబ్ధిదారులకు 168 ఎకరాలు, గుంటూరు జిల్లాకు చెందిన 3417 మంది లబ్ధిదారులకు 100 ఎకరాల భూమిని కేటాయించారు.
మొత్తంగా ఎన్‌టిఆర్ జిల్లాలో మొత్తం 26,637 మందికి, గుంటూరు జిల్లాలో 23,235 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి దశలో ఆర్-5 జోన్‌లో 40 వేల మందికి అవకాశం ఇచ్చారు.రెండో దశలో ఎస్-3 జోన్‌లో మరో 9472 మందికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈగ్రామాల్లో కూడా లే అవుట్‌లకు రంగం సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే ఆర్-5 జోన్ పరిధిలో ఏడు గ్రామాల్లో మొత్తం 21 లే అవుట్‌లు సిద్ధం చేస్తున్నారు. మే 17 నాటికి ఇళ్ల పట్టాలకు లే అవుట్‌ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఎన్‌టిఆర్ జిల్లాకు చెందిన 569.46 ఎకరాల్లో లేఅవుట్లలో 20,684మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కురగల్లు, నిడమర్రు, మందడం తదితర గ్రామాల్లో 11 లే అవుట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన పేదలకు 550 ఎకరాల్లో 20 వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు 10 లేఅవుట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పెదకాకాని, తుళ్లురు మండలాలతో పాటు మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 20వేల మందికి ఇంటి స్థలాల పట్టాల ను సిద్దం చేస్తున్నారు. మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, ఐనవోలు గ్రామాల్లో 10 లేఅవుట్‌లలో. పెదకాకాని, తుళ్లురు, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు అవకాశం కల్పించనున్నారు.
కృష్ణాయపాలెంలోని లే అవుట్










