Sep 26,2023 00:00

'చుక్కలు' చూపిస్తున్న 'బిల్లులు'

'చుక్కలు' చూపిస్తున్న 'బిల్లులు'
విద్యుత్‌ ఛార్జీల భారంతో గగ్గోలు
ప్రజాశక్తి - బాలాయపల్లి
'విద్యుత్‌ బిల్లులు చుక్కలు చూపించడం ఏంటి? అని అనుకుంటున్నారా..?! ఔనండీ వాస్తవం.. విద్యుత్‌ బిల్లులు చూసి నిద్రపట్టక ఇళ్లల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపేసి ఆరుబయట మంచం వేసుకుని దోమలు కుడుతున్నా పట్టించుకోకుండా ముసుగుతన్ని పడుకునే రోజులు వచ్చేశాయి.. అదనపు ఛార్జీల పేరుతో భారం మోపుతుంటే కొంతమంది వినియోగదారులు విద్యుత్‌ అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. ఎవరో వాడిన బిల్లులకు తామెందుకు అదనపు ఛార్జీలు చెల్లించాలంటూ అద్దె ఇళ్ల వాళ్లు ఇళ్ల ఓనర్లపై మండిపడుతున్నారు.
ఛార్జీల పేరుతో ప్రభుత్వం కరెంట్‌ బిల్లులను మోతెక్కిస్తున్నాయి. వేలల్లో వస్తున్న బిల్లులను చూసి పేద, మధ్య తరగతి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఆ చార్జీలు ఏంటో.. ఎందుకు వేస్తున్నారో.. తెలియని అయోమయంలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. నెలంతా ఒక్క యూనిట్‌ విద్యుత్‌ వాడని వారికీ ఛార్జీల రూపేణా వందల్లో బిల్లులు వస్తుండడంతో లబోదిబోమంటున్నారు. వివిధ రకాల చార్జీలతో తమకొచ్చిన కరెంట్‌ బిల్లులు పట్టుకుని విద్యుత్‌శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది తమ బిల్లులను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతున్నారు. ఫిక్స్‌డ్‌, కస్టమర్‌, ట్రూఅప్‌ చార్జీలకు తోడు గతంలో ఎన్నడూ చూడని ఎఫ్‌పీపీసీఏ, ఎఫ్‌పీపీసీఏ-2, షార్ట్‌ఫాల్‌ చార్జీలంటూ వినియోగదారుడి దిమ్మతిరిగే స్థాయిలో బిల్లులు అంటగడుతున్నారు. ఏ ఇద్దరి మధ్య సంభాషణ విన్నా ఈ నెలలో మోతమోగిస్తున్న కరెంట్‌ బిల్లుల గురించే అంటే అతిశయోక్తి కాదు.
2014 నుంచి 2019 వరకు వినియోగదారుడు వాడుకున్న మొత్తం యూనిట్లను లెక్కించి ట్రూఅప్‌ చార్జీ పేరుతో ఒక్కో యూనిట్‌కు 7 పైసల చొప్పున భారం వేశారు. ఆ మొత్తం భారాన్ని 18 వాయిదా లుగా విభజించి ప్రతినెలా చెల్లించేలా బిల్లులో పొందుపరుస్తున్నట్టు విద్యుత్‌శాఖాధికారులు తెలిపారు. ఈ ట్రూఅప్‌ చార్జీ అనేది గతేడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చినట్టు చెప్తున్నారు.
ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజి కాస్ట్‌ అడ్జస్ట్‌ మెంట్‌(ఎఫ్‌పీపీసీఏ) కింద 2021-22 సంవత్సరం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో వాడుకున్న వినియోగాన్ని లెక్కించి ఒక్కో యూనిట్‌పై 19 పైసలు చార్జీ విధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి వినియోగించుకున్న యూనిట్లపై ఒక్కో యూనిట్‌కు 40పైసల చొప్పున ఎఫ్‌పీపీసీఏ2 చార్జీ కింద అదనంగా వసూలు చేస్తున్నారు. వినియోగ దారుడు ఒక కిలోవాట్‌ సామర్ధ్యం కలిగిన లోడ్‌ వేయించుకుని 2కిలోవాట్ల లోడ్‌ వాడితే షార్ట్‌ఫాల్‌ కింద అదనపు చార్జీ బాదుతున్నారు. గడువు తేదీ దాటిన తర్వాత కట్టే బిల్లుల విషయంలోను ఈ షార్ట్‌ఫాల్‌ చార్జీ వర్తిస్తుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వంపై పడిన విద్యుత్‌ భారాన్ని తగ్గించుకోవడానికి ఇలా రకరకాల చార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలతో సతమత మవుతున్న సగటు వినియోగదారుడు అదనపు చార్జీల పేరుతో వేస్తున్న భారాన్ని తట్టుకోలేక ఆర్థికంగా చితికిపోతున్నాడు. కరెంట్‌ వాడని ఇళ్లపై కూడా కనికరం లేకుండా చార్జీల మోత మోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యత్‌ వాడినా వాడకపోయిన కరెంట్‌ మోత
ఖాళీగా ఉన్న తన ఇంటికి ఈ స్థాయిలో బిల్లు రావడమేమిటని ఓ వినియోగదారుడు ప్రశ్నించారు. ఎఫ్‌పీపీ సీఏ చార్జీ కింద రూ.222, ఎఫ్‌పీపీసీఏ2 కింద రూ.357, షార్ట్‌ఫాల్‌ చార్జీ కింద రూ.100, ఇతర చార్జీల కింద రూ.61లను బిల్లులో చూపారని, ఈ అదనపు చార్జీలను భరించాల్సిందేనని సదరు అధికారి సెలవిచ్చినట్టు నిట్టూర్చారు. ఈ ఒక్క కేసే కాకుండా జిల్లాలో చాలామంది వినియోగదారులు భారీగా వచ్చిన విద్యుత్‌ బిల్లులను చూసి బావురుమంటున్నారు.