May 28,2023 22:28

కిలో రూ.300కు చేరిక
ప్రజాశక్తి - ముదినేపల్లి

బ్రాయిలర్‌ కోడి ధర కొండెక్కింది. దీంతో చికెన్‌ ధరలు చుక్కలనంటుతున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది చికెన్‌ ధర బాగా పెరిగింది. గత నెల కిలో రూ.160 ఉండగా ప్రస్తుతం రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్‌ లెస్‌ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. ఒకవైపు కోళ్ల దాణా ధరలు పెరిగిపోవడం, మరోవైపు మండుతున్న ఎండలతో బ్రాయిలర్‌ కోళ్ల ఉత్పత్తి తగ్గుతోంది. గత రెండేళ్లుగా వేసవి ఎండలకు ఎక్కువ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్ల రైతులు అర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ఉన్న ధర గత రెండేళ్లలో ఎప్పుడూ లేదు. గతనెల లైవ్‌ కోడి కిలో రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.150 వరకు పలుకుతోంది. చికెన్‌ డిమాండ్‌కు తగ్గట్టుగా కోళ్ల ఉత్పత్తి లేదు. దీంతో గుడ్లు ధర నిలకడగా ఉన్నా చికెన్‌ ధరలు మాత్రం చుక్కల్లో ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు ఒకో కోడి కిలోన్నరకు మించి బరువు పెరగడం లేదు. దీనికితోడు ఉత్పత్తి కూడ భారీగా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కోడి పిల్ల రేటు హేచరీల్లో రూ.20 వరకూ ఉంటే, ప్రస్తుతం పిల్ల ధర రూ.27కు చేరింది. పెరిగిన ధర మాంసం ప్రియులకు ఇబ్బందిగా మారినప్పటికీ కోళ్ల రైతులు మాత్రం పెరిగిన ధరతో ఆనందంగా ఉన్నారు.
పాలకొల్లు: మండుటెండతోపాటు పట్టణంలో చికెన్‌ ధర కొండెక్కింది. పది రోజుల క్రితం వరకూ కిలో రూ.200 నుంచి రూ.220 వరకూ ఉన్న చికెన్‌ ధర ఆదివారం రూ.270 నుంచి రూ.300 వరకూ ఎగబాకింది. దీంతో మాంసాహారులు పెరిగిన ధరలకు గగ్గోలు పెడుతున్నారు. ఎండల ప్రభావంతో ఈ వారం కిలో ధర రూ.300 దాటుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కోడి గుడ్డు ధర కూడా వారం రోజుల ముందు రూ.5 ఉండేది. అయితే ఎండకు కోళ్లు ఎక్కువగా చనిపోవడంతో కోడిగుడ్డు రేటు కూడా రూ.6కు పెరిగింది.