అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌లతో కూడిన చతుర్ముఖ కూటమి (క్వాడ్) మంత్రుల స్థాయి సమావేశం అక్టోబరు 6న టోక్యోలో జరిగింది. క్వాడ్ అని పిలిచే ఈ నాలుగు దేశాల గుంపు చైనాను లక్ష్యంగా చేసుకుని సైనిక కూటమిగా వేగంగా రూపుదిద్దుకుంటున్నది. భారత్ ఈ కూటమిలో భాగం కాబోదని విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ సెప్టెంబరులో పేర్కొన్నారు. క్వాడ్‌కు సంబంధించిన పరిణామాలు ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయి. అమెరికాతో వ్యూహాత్మక పొత్తు కుదుర్చుకునే దిశగా సాగుతున్న మోడీ ప్రభుత్వం ఈ విధమైన మభ్యపుచ్చే ప్రకటనలు చేస్తూ, రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నది. క్వాడ్‌లో భాగస్వామిగా చేరేందుకు భారత్ ఉత్సుకత చూపడానికి కారణం లడఖ్‌లో చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనే అని కొందరు వ్యాఖ్యాతలు చెబుతున్నారు. కానీ ఇది నిజం కాదు. లడఖ్‌లో ప్రస్తుత ప్రతిష్టంభన తలెత్తడానికి చాలా రోజుల ముందు భారత్ ఈ చతుర్ముఖ కూటమిలో చేరాలని నిశ్చయించుకుంది.
క్వాడ్‌కు కొంత చరిత్ర ఉంది. 2007లో జపాన్ ప్రధాని షింజో అబే మొట్టమొదట దీనికి చొరవ చూపారు. చైనా వెంటనే దీనిపై తన అసమ్మతిని తెలియజేసింది. భారత్, ఇతర భాగస్వామ్య దేశాలను హెచ్చరించింది. కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆస్ట్రేలియా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాని నుంచి వెనక్కి తగ్గాయి. దీంతో అది ఆగిపోయింది.
2017 నవంబరులో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగా నాలుగు దేశాలు సమావేశమై క్వాడ్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. ఈసారి నాలుగు దేశాల్లోనూ మితవాద ప్రభుత్వాలే అధికారంలో ఉండడంతో చైనాను వ్యతిరేకించే విషయంలో వాటి మధ్య సైద్ధాంతికంగా ఎలాంటి విభేదాలు లేవు. తరువాత జరిగిన క్వాడ్ సమావేశంలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు. అమెరికా ఒత్తిడితో క్వాడ్ వేదికను మంత్రుల స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. ఆ తరువాత మొదటి మంత్రుల స్థాయి సమావేశాన్ని 2019 సెప్టెంబరులో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో నిర్వహించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెరుగుతున్న చైనా పలుకుబడిని తగ్గించడమే ఈ కూటమి ధ్యేయమన్నది స్పష్టం. చైనాతో వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక రంగాల్లో ఘర్షణ వైఖరిని ట్రంప్ తీసుకున్న నేపథ్యంలో క్వాడ్ ఏర్పాటుపై అమెరికా ఒత్తిడి పెంచింది. సెప్టెంబరు 25న మంత్రుల సమావేశానికి ముందు నాలుగు దేశాల విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో నమ్మకమైన అమ్మకందారులను ముఖ్యంగా అయిదో తరం (5జి) నెట్‌వర్క్సులో ప్రోత్సహించడం ఎలా అన్నదానిపై చర్చించారు. ఇది ఫక్తు అమెరికా ఎజెండా. చైనాకు చెందిన హువావే కంపెనీ 5జి టెక్నాలజీ ఎగుమతులను అడ్డుకోవడానికి అమెరికా పన్నిన కుతంత్రమిది. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ఇతర అంశాల్లో ఉగ్రవాద నిరోధక చర్యలు, సైబర్, నావికాయాన భద్రత, నాణ్యమైన మౌలిక సదుపాయాలు వంటివి ఉన్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పూర్తి స్థాయి భద్రతా కూటమిగా క్వాడ్ ఆవిర్భవింపజేయడంలో భారత్‌ను తన వైపు లాక్కునేందుకు ట్రంప్ యత్నించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతం పేరును ఇండో- పసిఫిక్ ప్రాంతం అని, ఆసియా పసిఫిక్ కమాండ్‌ను ఇండో-పసిఫిక్ కమాండ్ అని మార్చారు. ఈ కార్యక్రమానికి భారత్ తన సీనియర్ మిలిటరీ అధికారిని పంపింది. సైనిక కూటమి ఏర్పాటుకు అవసరమైన నిర్మాణం కూడా పూర్తి కావస్తున్నది. 2016లో భారత్ అమెరికాతో కలసి లాజిస్టిక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా యుద్ధ విమానాలు భారత్‌లో దిగేందుకు, వాటికి అవసరమైన మరమ్మతులు ఇక్కడ చేపట్టడానికి, ఇంధనం నింపుకునేందుకు, ఇరు దేశాల సాయుధ బలగాలు పరస్పరం సేవలు అందించుకునేందుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. క్వాడ్‌లో భారత్ పూర్తి స్థాయి భాగస్వామిగా మారితే చతుర్ముఖ కూటమి లోని మిగతా దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడా లాజిస్టిక్ ఒప్పందాలను భారత్ కుదుర్చుకోవాల్సిన అవసరమేర్పడింది.
ఈ చర్చలు ఈ ఏడాది మే నెలలో లడఖ్‌లో ఘర్షణ తలెత్తడానికి ముందే జరిగాయి. జూన్‌లో ఆస్ట్రేలియాతో భారత్ లాజిస్టిక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సెప్టెంబరు 9న జపాన్‌తో కూడా భారత్ ఇటువంటి ఒప్పందాన్నే కుదుర్చుకుంది. దీంతోబాటు ఈ చతుర్ముఖ కూటమి లోని మిగతా ముగ్గురు భాగస్వాములతో లాజిస్టిక్స్ సహకారం, నిర్వహణకు వీలు కల్పించే కీలక మిలిటరీ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది.
ఇంత జరిగిన తరువాత కూడా భారత్ ఏ సైనిక కూటమిలో కానీ, కూటమి లాంటి వ్యవస్థలో కానీ భాగం కాబోదని అంటే నమ్మేసేంత వెర్రిబాగులు కాదు ప్రజలు. 2020 ఫిబ్రవరి చివరిలో ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు విడుదలజేసిన సంయుక్త ప్రకటనలో నాలుగు దేశాల కూటమి పటిష్టత గురించి ప్రస్తావించారు.
ఆగస్టు31న జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి స్టీఫెన్ బీగన్ క్వాడ్‌ను ఆసియా నాటోగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. 'ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పటిష్టవంతమైన బహుళపక్ష వ్యవస్థల్లాంటివేవీ లేవు. నాటో వంటి సాహసోపేత కూటములు లేవు. ఆసియాలో శక్తివంతమైన సంస్థలుగా చెప్పబడే వ్యవస్థలు కూడా ప్రస్తుత కాలానికి తగినట్లుగా లేవు. ఈ కూటమిలో ఇప్పుడున్న సంఖ్య చాలదు. ఇంకా కొందరిని కలుపుకోవాలి. నాటో కూడా ప్రారంభంలో ఇలాగే ఒక మోస్తరు ఆకాంక్షలతో ఏర్పడింది. దాని సభ్యత్వం విషయంలో చాలా దేశాలు (ప్రారంభంలో) ఊగిసలాట వైఖరిని అవలంభించాయి' అని బీగన్ చెప్పారు. 'నాటో ఏర్పాటు చేసేందుకు అమెరికా ఎటువంటి పట్టుదల ప్రదర్శించిందో అటువంటి పట్టుదలను ఈ ప్రాంత దేశాలు కనబరిస్తే పసిఫిక్ నాటో తరహా కూటమి రూపుదిద్దుకుంటుంది' అని బీగన్ చెప్పారు. ఈ సందర్భంగానే క్వాడ్ మంత్రుల స్థాయి సమావేశం వర్షాకాలంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తామని బీగన్ తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఎందుకో వెల్లడించలేదు. అక్టోబరులో ఢిల్లీలో క్వాడ్ మంత్రుల స్థాయి సమావేశం ఉంటుందని బీగన్ వెల్లడించిన తరువాత భారత విదేశాంగ శాఖ ప్రతినిధి దానిని ధ్రువీకరించక తప్పలేదు. ఆ తరువాత ఈ సమావేశం టోక్యోకి మారిందనుకోండి.
టోక్యోలో క్వాడ్ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రారంభోపన్యాసం చేస్తూ, 'క్వాడ్‌లో భాగస్వాములమైన మనం ఇదివరకటికెన్నటికన్నా మరింత చొరవతో వ్యవహరించాలి. చైనా కమ్యూనిస్టు పార్టీ దోపిడీ, అవినీతి, దౌర్జన్యాల నుంచి మన భాగస్వాములను, ప్రజలను కాపాడుకునేందుకు మనమంత కలసికట్టుగా వ్యవహరించాలి' అని చెప్పారు. మన విదేశాంగ మంత్రి జయశంకర్ బాహాటంగా చెప్పడానికి సంశయించినా, రక్షణ దళాల సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్ దీనిని స్పష్టంగానే తెలియజేశారు.
2008లో అమెరికాలో రక్షణ రంగంలో తొలి ఫ్రేమ్ వర్కు ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి అమెరికాతో సైనిక బంధం అనే ముడిని గట్టిపరచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తూ వస్తున్నది. ఇప్పుడు సాయుధ బలగాల్లోని ముఖ్యమైన విభాగాల్లో ఉన్నత స్థాయి నాయకత్వం దాకా దీనిని తీసుకెళ్తోంది. అమెరికా ఆధ్వర్యంలోని సైనిక కూటమిలో పూర్తి స్థాయిలో చేరేందుకు సిద్ధంగా ఉంది.
చైనాను కట్టడి చేసేందుకు పన్నిన వ్యూహాన్ని దీనిద్వారా నెరవేర్చుకోవాలని అమెరికా చూస్తున్నది. అటువంటి ఈ వ్యూహాత్మక కూటమిలో భారత్ భాగస్వామిగా చేరడం వల్ల దేశానికి వచ్చే ప్రయోజనమేమీ ఉండదు. దక్షిణ చైనా సముద్రంలో భారత దేశ కీలక ప్రయోజనాలేవీ ముడిపడి లేవు. అలాంటప్పుడు భారత నావికాదళం అమెరికా, జపాన్‌తో కలసి దక్షిణ చైనా సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించడమెందుకు? చైనాతో ప్రాదేశిక ఘర్షణ వచ్చినప్పుడు ఈ భాగస్వామ్య దేశాల్లో ఏ ఒక్కటీ భారత్‌కు సైనిక మద్దతు ఇవ్వడానికి సుముఖత చూపలేదు. దక్షిణ చైనా సముద్రంలో వివాదంతో సంబంధమున్న తీర ప్రాంత దేశాలు కానీ, ఈ ప్రాంతంలో ప్రధాన ప్రాంతీయ వేదిక అయిన ఆసియాన్ కానీ క్వాడ్‌లో చేరేందుకు సుముఖంగా లేవు. చైనా వ్యతిరేక గ్రూపులో చేరడం వల్ల తమ దేశ కీలక ప్రయోజనాలు ఏ విధంగాను నెరవేరవని భావించడం వల్లే ఇందులో చేరరాదని అవి భావించాయి. ఈ ప్రాంతంలో ప్రధాన దేశాల్లో ఒకటి అయిన ఇండొనేషియా దక్షిణ చైనా సముద్ర వివాదంలో ఉన్నప్పటికీ చైనా వ్యతిరేక వైఖరి తీసుకోలేదు. చైనాతో అమెరికా కోరి కయ్యం పెట్టుకుంటుంటే మోడీ ప్రభుత్వం అమెరికాకు బంటుగా చేరడం వల్ల లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి మరింత దిగజారడం తప్ప ఒరిగేదేమీ ఉండదు.
గత ఆరు మాసాలుగా భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు దీనినే తెలియజేస్తున్నాయి. జమ్ము కాశ్మీర్ ప్రతిపత్తిని మార్చుతూ భారత్ చర్యలు చేపట్టడం, అమెరికా-చైనా మధ్య వ్యూహాత్మక బంధం బలపడుతున్న కొద్దీ ఈ ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి. అమెరికా, దాని తైనాతీలతో కలసి చైనా వ్యతిరేక కూటముల్లో చేరేందుకు బదులు భారత్ నేరుగా చైనాతోనే చర్చలు జరిపి వివాదాలను పరిష్కరించుకోవడం దేశానికి అన్ని విధాలా ప్రయోజనకరం. అమెరికాకు బంటుగా మారకుండా చైనాతో సమర్థవంతంగా వ్యవహరించగల శక్తి సామర్థ్యాలు భారత్‌కు పుష్కలంగా ఉన్నాయి.
చైనా విషయానికొస్తే భారత్‌ను అమెరికా దగ్గరకు నెట్టే చర్యల వల్ల అది ఏ విధంగా తనకు మేలు చేకూర్చుతుందో అది పరిశీలించుకోవాలి. ఇరు దేశాలకు మధ్య తాత్కాలిక సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగడం ఈ అమెరికా ప్రయోజనాలు నెరవేరడానికి తప్ప ఆసియాలో ఈ రెండు అతి పెద్ద ఇరుగు పొరుగు దేశాల ప్రయోజనాలకు అది ఏవిధంగాను ఉపయోగపడదు. ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రధాన పాత్ర పోషించాలన్నా, ఈ భూగోళం, మానవాళి సురక్షితంగా ఉండాలన్నా ప్రపంచంలో మూడో వంతు జనాభా కలిగిన ఈ రెండు ఇరుగుపొరుగు దేశాల మధ్య సఖ్యత చాలా అవసరం.
- ప్రకాశ్ కరత్ 










