ప్రజాశక్తి-బాపట్లజిల్లా: చట్టసభల్లో అన్ని కులాల సమాన ప్రాతినిధ్యం కోసం, బీసీలకు రాజ్యాధికారం కోసం, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం బీసీలందరూ సమైక్యంగా పోరాట చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ కొనగళ్ల నారాయణ పిలుపునిచ్చారు. బీసీలకు ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహంపై తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ బిసి సెల్ ఆధ్వర్యంలో బిసి కులాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష పార్టీ బీసీ నేతలతో ''ఐక్య పోరాట'' (రౌండ్ టేబుల్) సమావేశం శనివారం బాపట్లలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. సమావేశంలో కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ అన్నారు. జిల్లాలో గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో పలు సమస్యలపై బీసీలు ఐక్యంగా పోరాటం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అవినీతిలో, అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టమని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మొత్తంగా బీసీలపై అనేక కేసుల అక్రమంగా పెట్టారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుపై కూడా కేసు నమోదు అయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతున్నట్టు చెబుతోందని, అయితే అది సక్రమంగా జరుగుతుందని నమ్మకం లేదన్నారు. టిడిపి కూడా కులాలకు అనుగుణంగా కేటాయింపులు జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్రంగా కులగణన చేపట్టి తదనగుణంగా చట్టసభల్లో అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు.
రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ బిసిలు 50 శాతం జనాభా ఉన్నా, రాజకీయంగా మనకు సరైన స్థానం లేదని అన్నారు. ప్రజా పరిపాలనలో మన భాగస్వామ్యం తగినంతగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఈ వైసిపి ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టి ప్రభుత్వాన్ని స్థాపించిందని, కానీ బీసీలకు చేసిన న్యాయం ఏమిటని ప్రశ్నించారు. న్యాయం మాట దేవుడెరుగు. అసలు ఈ రాష్ట్రంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని అన్నారు. 30కి పైగా సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం అందకుండా చేస్తోందని పేర్కొన్నారు. పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ తాను బీసీల పక్షపాతిని అని చెప్పుకుంటూ తిరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల్లో 10శాతం రిజర్వేషన్ ఎత్తేశారని ధ్వజమెత్తారు. తద్వారా 16,800 పదవులను బీసీలకు దూరం చేశారన్నారు. బీసీ కార్పొరేషన్ నిధులు పక్కదారులు పట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిసి సబ్ ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లు తినేశారన్నారు.
తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ దామాషా పద్ధతిలో చూసుకుంటే 50 శాతం ఉన్న బీసీలకు అసెంబ్లీలో ఎన్ని స్థానాలు కల్పించాల్సి ఉంది కానీ ఈ వైసిపి ప్రభుత్వం చేసిందా అని ప్రశ్నించారు. ఒక కులమే మొత్తం రాజ్యాధికారాన్ని అందుకున్నారు. మరి మన బీసీల పరిస్థితి ఏంటని అన్నారు. జనసేన పార్టీ కోఆర్డినేటర్ నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం బీసీల ఓట్లే ముద్దు, బీసీలు వద్దు అనే ఒంటెత్తుపోకడతో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పుడు మళ్లీ సామాజిక బస్సు యాత్రతో మరోసారి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. టిడిపి చీరాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య మాట్లాడుతూ బీసీ ఓట్ల కోసం ఈ ప్రభుత్వం ఇంకో కొత్త నాటకానికి తెరలేపిందని, ఓబీసీ కుల జన గణన చేస్తామని అంటోందన్నారు. ఓబీసీ కుల జనగణన వెంటనే చేసి జనాభా దామాషా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కేవలం టిడిపి, జనసేన సమన్వయ ప్రభుత్వంతోనే సాధ్యమని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బాపట్ల మాజీ ఎంపీపీ తాతా జయప్రకాష్ నారాయణ, తమ్మిశెట్టి రమాదేవి, పలు బిసి సంఘాలు, అఖిలపక్ష సంఘ నాయకులు పాల్గొన్నారు.