
ప్రజాశక్తి - బాపట్ల
వచ్చే ఎన్నికల్లో మాదిగలకు 15అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను కేటాయించాలని ఎపీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ భవన్లో శనివారం జరిగిన ఎంఆర్‌పిఎస్ జిల్లా సమావేశంలో తీర్మానం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు సముచిత ప్రాధాన్యత దక్కేలా పోరాటం చేయాలని కోరారు. మాదిగల సత్తా ఏమిటో నిరూపించాలని అన్నారు. బలమైన నాయకత్వంతో మాదిగలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొని రావాలని కోరారు. మాదిగలకు మాట ఇచ్చి తప్పించుకునే ప్రభుత్వాలకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. మాదిగలను విస్మరిస్తే ఏ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవనే వాస్తవాన్ని నిరూపించాలని కోరారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా బలసాని రామకృష్ణను నియమించారు. జిల్లాలో మాదిగల పోరాటాలను బలోపేతం చేసే దిశగా నూతన కమిటీ పని చేయాలని కోరారు. పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భారత జాతీయ దళిత క్రైస్తవ అధ్యక్షుడు అట్లూరి విజయ్ కుమార్, ఎమ్మా ర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.