Feb 04,2023 00:25

బన్నూరుమత్‌ను సత్కరిస్తున్న లా వర్సిటీ విసి

ప్రజాశక్తి-సబ్బవరం
చట్టాన్ని అర్థం చేసుకోవడంలో సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందని, చట్టంలోని చిక్కులను అర్థం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సాహిత్య అవగాహన కల్గి ఉండాలని కర్ణాటక లా కమిషన్‌ చైర్మన్‌, కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఆర్‌.బన్నూరుమత్‌ అన్నారు. 'ది ఇంటర్‌ఫేస్‌ ఆఫ్‌ లా అండ్‌ లిటరేచర్‌' అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మండలంలోని దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైనది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బన్నూరుమత్‌ భాష ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. కనీసం వారానికి ఒక్కసారైనా సాహిత్యంలోని మెలకువలను తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. జస్టిస్‌ కృష్ణయ్యర్‌ నిర్ణయాలు, తీర్పులను పరిశీలిస్తే ఆయన భాషను ఉపయోగించడంలో నైపుణ్యత తెలుస్తుందన్నారు. మినర్వా మిల్స్‌ కేసులో కూడా ఇంగ్లీష్‌ భాష ఆవశ్యకత తెలుస్తుందని చెప్పారు. డిఎస్‌ఎన్‌ఎల్‌యు లా, లాంగ్వేజ్‌ అండ్‌ లీటరేచర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినందుఎకు వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య ఎస్‌.సూర్య ప్రకాష్‌ను ఆయన అభినఅందించారు. లా వర్సిటీ విసి ఆచార్య సూర్య ప్రకాష్‌ మాట్లాడుతూ చట్టం, సాహిత్యం మధ్య ఉన్న ఈ అంతర్గత సంబంధాన్ని బహిర్గతం చేయడానికి ఈ సమావేశం సహాయపడుతుందని చెప్పారు. ప్రొఫెసర్‌ ముఖేష్‌ శ్రీవాస్తవ, ప్రొఫెసర్‌ టి.విశ్వనాధరావు, ప్రొఫెసర్‌ కొట్టి రమేష్‌, ప్రొఫెసర్‌ ఎ.రామనాగ హనుమంతు, డాక్టర్‌ పరలికర్‌ ఊర్మిళ అతుల్‌ తదితరులు ముఖ్య వక్తలుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.మధుసూదనరావు, సెంటర్‌ ఫర్‌ లా, లాంగ్వేజ్‌, సాహిత్యం, ఫ్యాకల్టీ కన్వీనర్‌ డాక్టర్‌ నరసింగరావు భరణికాన, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.