Apr 22,2021 07:31

ప్రజాస్వామ్య వ్యవస్థను వమ్ము చేయడమే


కాళీశ్వరమ్‌ రాజ్‌

(నిన్నటి సంచిక తరువాయి)

ప్రజలెన్నుకున్న ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్రం నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు అపార అధికారాలను కట్టబెడుతూ ఒక చట్టాన్ని కేంద్రం 2021 మార్చి 15న లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ఫెడరలిజాన్ని దెబ్బ తీసే చర్య ఇది. అంతేగాక ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి విలువ లేకుండా చేసే ప్రయత్నం కూడా. 2018 జూలై 4న సుప్రీం కోర్టు డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డిల్లీ ప్రభుత్వం సూచనలను, సలహాలను, నిర్ణయాలను అనుసరించి వ్యవహరించాలని చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. ఢిల్లీ ప్రభుత్వానికి రాష్ట్ర హోదా కల్పిస్తూ 1992లో చేసిన 69వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని సుప్రీం కోర్టు ఆ తీర్పు చెప్పింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వపు నిర్ణయాలు అమలు జరగాలే తప్ప కేంద్రం నియమించిన అధికారి నిర్ణయాలు కాదు అని ఆ రాజ్యాంగ సవరణ సారాంశం. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి గల అధికారాలు పరిమితం. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా చట్టం ఆ కొద్దిపాటి అధికారాలను కూడా లేకుండా అధికారమంతా తాము నియమించిన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చేతుల్లో ఉంచడానికి దారి తీస్తుంది. ఢిల్లీ రాష్ట్ర స్వయంప్రతిపత్తి హోదా నామమాత్రం అవుతుంది. డిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరపడంలో ఇక అర్ధం ఉండదు.

ఈ మధ్య అటు బెంగాల్‌ నుంచి ఇటు పాండిచ్చేరి దాకా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన గవర్నర్లు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాల రోజువారీ నిర్ణయాలలో అనుచిత జోక్యం కల్పించుకుంటున్నారు. పూర్తి రాష్ట్ర హోదా ఉన్న చోట్ల గవర్నర్ల పాత్ర అలంకార ప్రాయంగానే ఉండాలి. ''గవర్నర్లకు తమకు తాముగా నిర్వర్తించవలసిన కర్తవ్యాలేమీ ఉండవు. మంత్రి వర్గ నిర్ణయాలను ఆమోదించవలసిందే'' అని అంబేద్కర్‌ రాజ్యాంగ సభ చర్చల సందర్భంగా చెప్పారు. ఇప్పుడు డిల్లీ విషయంలో తీసుకువచ్చిన సవరణ తర్వాత గవర్నర్‌ ఒప్పుకుంటే తప్ప ఎన్నికైన ప్రభుత్వం చేయగలిగిందేమీ ఉండదు. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వ అధికారాల విషయంలో 2018లో, 2019లో ఇచ్చిన తీర్పులను ఈ చట్ట సవరణ కొరగాకుండా చేస్తోంది. కాని ఈ చట్ట సవరణను ప్రవేశ పెడుతూ ''సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎన్నికైన ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు నడుమ అధికారాల విషయంలో సరైన సమన్వయం కోసం'' ఈ చట్టాన్ని తెస్తున్నట్టు మోసపూరితంగా ప్రకటించింది బిజెపి ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తన నిరసనను ప్రకటిస్తూ ఆందోళనలకు దిగాడు. ప్రభుత్వం ప్రకటించిన ఉద్దేశం వొట్టి బూటకమని కేజ్రీవాల్‌ ప్రతిస్పందనే వెల్లడి చేస్తోంది.

సాధారణంగా చట్టసభలు చేసే చట్టాలు దురుద్దేశ్యంతో చేసినట్టు పరిగణించజాలమంటూ పలు తీర్పులు ఉన్నాయి. అయితే ఈ సాంప్రదాయబద్ధమైన సూత్రం మన దేశంలో మారిన రాజకీయ నేపథ్యంలో ఇప్పుడు వర్తించదనే భావించాలి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడానికి సిద్ధపడిన ప్రభుత్వాలు ఉన్నప్పుడే రాజ్యాంగ సూత్రాలు గౌరవింపబడతాయని మనం చెప్పగలం.

రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని తోసిరాజనే విధంగా జారీ అయిన చట్టాలు ఇంకా ఉన్నాయి. 2021 మార్చి 23వ తేదీన బీహార్‌ అసెంబ్లీలో స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ చట్టం ఆమోదించబడింది. ఎటువంటి వారెంట్‌ లేకుండానే సోదాలు చేసే అధికారం ఈ చట్టం ద్వారా బీహార్‌ మిలిటరీ పోలీసుకు సంక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆదేశాలకు లోబడి తన రాష్ట్రాన్ని పోలీస్‌ రాజ్యంగా మార్చడానికి దారితీసే చట్టాన్ని చేసింది.

ఇటువంటి ధోరణులు పెరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు ఆ చట్టాల రాజ్యాంగ బద్ధతను క్షుణ్ణంగా పరిశీలించి నిగ్గు తేల్చాలి. నిష్పాక్షికంగా వ్యవహరించి తీర్పులివ్వాలి. కాని ఇప్పుడు ఆ బాధ్యతను నిర్వహించడంలో కోర్టులు విఫలమౌతున్నాయి. దాంతో ప్రభుత్వం మరీ బరితెగిస్తోంది. వ్యవసాయ చట్టాలను కోర్టుల్లో సవాలు చేసుకోండంటూ ప్రభుత్వం రైతులకు చెప్పడం బట్టి ప్రభుత్వం కోర్టుల నుండి తనకెటువంటి ఇబ్బందీ రాదన్న ధీమాతో ఉన్నట్టు స్పష్టమౌతోంది.

అందుచేత ఇక చట్టాల నిగ్గు తేల్చవలసింది ప్రజలే. అమానవీయమైన, రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలకు వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన తక్షణ అవసరం నేడున్నది. ''అన్యాయం చట్టమైనప్పుడు ప్రతిఘటించడం మన ధర్మం'' అని థామస్‌ జెఫర్సన్‌ అన్న విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే వారిని మనం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. చట్టాలు చేసే పనిని చట్ట సభలకే వదిలిపెట్టలేం.

( రచయిత సుప్రీం కోర్టు న్యాయవాది )