హిందూత్వ ప్రాజెక్టు వంద సంవత్సరాల నాటిది. తన వ్యతిరేకులను ఒక పథకం ప్రకారం బలహీనపరుస్తూ వస్తోంది. ఆ క్రమంలో రాజ్యాంగ పాలనను చాలా దెబ్బ తీసింది. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాల్సిన క్యాబినెట్ నుంచి న్యాయస్థానాలు, పార్లమెంటు తదితర సంస్థలతోబాటు రాజ్యాంగ విలువలను పరిరక్షించవలసిన మీడియాలో కూడా చొరబడి వాటిని దెబ్బ తీసింది.
నేటి భారతదేశంలో రాజ్యాంగ విరుద్ధంగా, అమానవీయంగా జారీ చేస్తున్న చట్టాలకు వ్యతిరేకంగా అందరినీ కూడగట్టడం చాలా అవసరం.
రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి, సాధారణ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు మౌలికంగానే తేడా ఉంది. ఏ తరహా ప్రజాస్వామ్యంలోనైనా, మెజారిటీ అభిప్రాయం ముఖ్యమైనదే. అయితే రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయం రాజ్యాంగం నిర్దేశించిన పరిధులకు లోబడి వుండాలి. సమాజంలో మెజారిటీగా ఉండే సమూహాల దాడి నుండి ఆయా జాతులను రక్షించడం ఆధునిక రాజ్యాంగాలకు ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఇది ఒక విధంగా మెజారిటీ సమూహాలపై రాజ్యాంగం విధించే నైతికమైన అదుపు. చట్టసభల్లో సాధారణంగా మెజారిటీ అభిప్రాయాలే ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా వ్యక్తం అవుతాయి. అవే చట్టాల రూపం దాలుస్తాయి. అయితే ఆ చట్టాలు రాజ్యాంగ బద్ధంగా ఉండాలి.
చట్టాల రాజకీయాలు
ఏదైనా చట్టం వెనుక ఒక సిద్ధాంతం, ఒక దృక్పథం, ఒక వైఖరి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో 1952 నుంచి 1984 మధ్య ప్రభుత్వాలు స్పష్టమైన మెజారిటీతో ఏర్పడినవే. ఈ కాలంలో చాలా చట్టాలు జారీ అయ్యాయి. వాటిలో బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి ప్రగతిశీల స్వభావం కల చట్టాలూ ఉన్నాయి. రాజకీయాలెప్పుడూ చురుకుగా మార్పు చెందుతూనే వుంటాయి. వాటితోబాటే రాజకీయ పార్టీల దృక్పథాలు, తాత్వికత కూడా మారుతూవుంటాయి. నెహ్రూ తరహా సోషలిజం అమలు చేస్తాం అన్న పేరుతో కొన్ని రాడికల్ సంస్కరణలను అమలు చేసే ప్రయత్నం చేసిన పార్టీయే ఆ తర్వాత పౌరుల వ్యక్తిగత, రాజకీయ స్వేచ్ఛను హరించే ఎమర్జెన్సీని విధించింది.
అదే పార్టీ ఇప్పుడు మళ్ళీ రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను గ్యారంటీ చేయాలని కోరుతోంది. ప్రస్తుతం పౌరస్వేచ్ఛను హరిస్తున్న అధికార పార్టీ బిజెపి పూర్వ రూపం జనసంఘం. ఆ జనసంఘం కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఒక ప్రధాన భాగస్వామిగా ఉండేది. ఆ జనతా పార్టీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎదిరించడానికి ఆవిర్భవించిన రాజకీయ కూటమి (అంటే ఒకప్పుడు నియంతృత్వాన్ని చెలాయించిన పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటోంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాడిన పార్టీ ఇప్పుడు నియంతృత్వాన్ని చెలాయిస్తోంది).
యుపిఎ ప్రభుత్వం హయాంలో (2004-2014) చట్టాల రూపకల్పనలో అనుసరించిన వైఖరిలో గుణాత్మకమైన మార్పులను చూడవచ్చు. 2005 లో ఉపాధి హామీ చట్టం, 2006 లో అటవీ హక్కుల చట్టం, 2009 లో విద్యా హక్కు చట్టం, 2013లో భూసేకరణ, పునరావాసం చట్టం, 2014లో వీధి వ్యాపారుల జీవనభృతి పరిరక్షణ చట్టం వంటి ప్రజానుకూల చట్టాలు యుపిఎ హయాంలో వచ్చాయి. ఆ కాలంలో కూడా కేంద్రం విమర్శకుల నోళ్ళు నొక్కడానికి, ప్రజాందోళనలను అణచివేయడానికి దుర్మార్గమైన చట్టాలను ప్రయోగించింది. అయినప్పటికీ, చట్టాల రూపకల్పనలో సమానత్వ సాధన ధోరణులు ఉన్నాయి. అంతేకాక, యుపిఎ హయాంలో నిరసనలు వ్యక్తం చేయడానికి, అధికారంలో ఉన్నవారి తప్పొప్పులపై చర్చించడానికి కొంత అవకాశం ఉండేది. ప్రస్తుత ప్రభుత్వంతో పోల్చితే యుపిఎ ప్రభుత్వ కాలంలో ప్రజాస్వామ్య చర్చలకు అవకాశం ఎక్కువగా ఉండేది.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చట్టాల రూపకల్పన విషయంలో చాలా స్పష్టంగా హిందూత్వ ఎజెండాను అమలు చేసే దిశగా, కార్పొరేట్ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఒక సైద్ధాంతిక మొగ్గు కనపడుతుంది. అందుకే ఆ చట్టాల్లో సమస్త అధికారాలనూ తమ గుప్పెట్లో కేంద్రీకరించుకునే ధోరణి, సమాజాన్ని ఛిద్రం చేసి విధ్వంసం దిశగా పడిపించే స్వభావం ఉంది.
1984 తర్వాత (ఆ ఏడాది ఎన్నికలలో ఇందిరాగాంధీ హత్యానంతరం సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది) 2014 లోనే మళ్ళీ ఏకపార్టీ ఆధిపత్యం కేంద్రంలో వచ్చింది. బిజెపి అధికారంలోకి రావడంతో సైద్ధాంతిక దృక్పథంలో మౌలికమైన మార్పు వచ్చింది. అంతకుముందు మూడు దశాబ్దాలలో సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో సర్దుబాటు ఉండే విధంగా, ఫెడరల్ స్వభావం ఉండేలా ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఆ తర్వాత వచ్చిన బిజెపికి మెజారిటీ ఉండడమే గాక ఆ పార్టీ సిద్ధాంతం దారుణమైన పర్యవసానాలకు దారితీసే స్వభావం కలిగివుంది. చట్టాలలో మార్పులకు ఇదే కారణం.
''కాంగ్రెస్, బిజెపి రెండూ అధికారాలను కేంద్రీకృతం చేసుకోడానికి ప్రయత్నించేవే. రెండు పార్టీలకూ ఫెడరలిజం పట్ల గౌరవం లేదు. ఆర్థికాభివృద్ధి పేరుతో, దేశ సమైక్యత పేరుతో, జాతీయ సమగ్రత పేరుతో అధికారాలను కేంద్రీకృతం చేయడాన్ని అవి రెండే సమర్ధించుకుంటాయి. అయితే బిజెపి అదనంగా మతం, సంస్కృతి, జాతి పేరుతో అదనంగా నియంతృత్వాన్ని చెలాయిస్తుంది'' అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు చెందిన కె.కె కైలాష్ అన్నారు. పైకి చూసినప్పుడు ఇది అంత పెద్ద తేడాగా అనిపించదు. కాని బిజెపి ప్రభుత్వానికి రాజ్యాంగం అన్నా, రాజ్యాంగ వ్యవస్థలన్నా ఎటువంటి గౌరవమూ లేదు. హిందూత్వ ప్రాజెక్టు వంద సంవత్సరాల నాటిది. తన వ్యతిరేకులను ఒక పథకం ప్రకారం బలహీనపరుస్తూ వస్తోంది. ఆ క్రమంలో రాజ్యాంగ పాలనను చాలా దెబ్బ తీసింది. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాల్సిన క్యాబినెట్ నుంచి న్యాయస్థానాలు, పార్లమెంటు తదితర సంస్థలతోబాటు రాజ్యాంగ విలువలను పరిరక్షించవలసిన మీడియాలో కూడా చొరబడి వాటిని దెబ్బ తీసింది. ఆ విధంగా జరిగిన నష్టాన్ని బహుశా ఇప్పుడిప్పుడే పూడ్చడం సాధ్యం కాదేమో.
ఈ దేశాన్ని ''రాజ్యాంగ రహితంగా'' చేసే దిశగా ఒక పథకం ప్రకారం ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నిరంతరం ప్రయత్నిస్తున్నదని ఆ ప్రభుత్వం చేసిన చట్టాలను పరిశీలిస్తే మనకు బోధపడుతుంది. ఎక్కువ చట్టాలు హిందూత్వ సిద్ధాంతం నుండి పుట్టిన మితవాద రాజకీయాలను, క్రోనీ కాపిటలిజాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 2019లో చేసిన ట్రిపుల్ తలాక్ చట్టం బాహాటంగానే ఒక మతంపై తన గురి పెట్టింది. ఆ చట్టం వొట్టి బూటకమనేది స్పష్టం. ఆ చట్టం ట్రిపుల్ తలాక్ చెల్లదని చెప్తుంది. నిజానికి ట్రిపుల్ తలాక్ చెల్లదని 2017 లోనే షాయరా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఒక చెల్లని పద్ధతిని ''నేరం'' గా పరిగణించడం ద్వారా ఆ చట్టం సాధించినదేమిటి? విడాకులిచ్చిన భర్తలను మూడేళ్ళ వరకూ జైలులో ఉంచడం వలన విడాకులు పొందిన మహిళకు ఆ భర్త నుండి భరణం రాకుండా పోతుంది. ఇక తెలివైన భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్టు సాక్ష్యం ఎక్క డా లేకుండా జాగ్రత్త పడగలిగితే చట్టం నుండి తప్పించుకోవచ్చు. ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు కనీసం ముస్లిం మహిళల ప్రయోజనాలనైనా కాపాడగలిగిందా అంటే అందుకు భిన్నమైన దిశగా ఆ చట్టం ఉంది. న్యాయపరంగా అది ఎందుకూ కొరగాని చట్టం. కాని దాని వెనుక ఒక పదునైన రాజకీయ ఎత్తుగడ ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీయడమే దాని లక్ష్యం. ఇక పౌరసత్వ చట్ట సవరణ విషయం చూస్తే అది ప్రజలను కులం, మతం పరంగా విభజించడానికే ఉద్దేశించినది. అందరూ సమానమే అన్న రాజ్యాంగం లోని సూత్రాలకు ఆ చట్టం పూర్తిగా విరుద్ధం. పౌరులందరికీ సమానమైన గౌరవాన్ని, అందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని రాజ్యాంగం ప్రవేశిక లోనే పేర్కొంది.
లవ్ జిహాద్ పై వివిధ బిజెపి-పాలిత రాష్ట్రాలు చట్టాలు చేశాయి. కేవలం ఒక ఊహాజనితమైన విషయం ఈ లవ్ జిహాద్. మతాన్ని విస్తరింపజేయడానికిగాని, మత విద్వేషపూరిత లక్ష్యంతోగాని మత మార్పిడులను వివాహ సందర్భంగా ప్రోత్సహించే కుట్ర అంటూ వాస్తవానికి ఏదీ లేదు. కాని 2003లో గుజరాత్ అసెంబ్లీ మత స్వేచ్ఛ చట్టం పేరుతో లవ్ జిహాద్‌ను ఒక నేరంగా చేసింది. అందులో పేర్కొన్న నేరాలన్నీ బెయిల్ పొందడానికి వీలు లేనివిధంగా ఆ చట్టాన్ని రూపొందించారు. వివాహం పేరుతో గాని, ప్రలోభాలు పెట్టడం ద్వారా గాని బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహిస్తే మూడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు, రూ. 5 లక్షల వరకు జరిమానా విధింపు ఆ చట్టం నిర్దేశించిన శిక్షలు. ఇదేమాదిరిగా యు.పి, ఎం.పి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా చట్టాలు చేశాయి. ఎన్నో యువ జంటలు తమ అభీష్టాలకు అనుగుణంగా జీవిత భాగస్వామిని ఎంచుకోడానికి వీలు లేకుండా నిర్దయగా క్షోభ పెట్టిన సంఘటనలు అనేకం ఈ చట్టాల ముసుగులో చట్టబద్ధం అయ్యాయి. సమాజం మత ప్రాతిపదికన చీలికలను నిరంతరం కల్పించడం రాజకీయ పరంగా ఆ ప్రభుత్వాలకు అవసరం. అదే సమయంలో ఆ చట్టాలు వ్యక్తుల స్వవిషయాలలో జోక్యం కల్పించుకోడానికి, ఆ వ్యక్తుల నిర్ణయాలను అనుచితంగా ప్రభావితం చేయడానికి తోడ్పడతాయి. ఇటువంటి ధోరణి మన దేశ చట్టసభల చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేదు.
రాజ్యాంగం లోని 370 అధికరణాన్ని సవరించి కాశ్మీర్ కు గల ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు లో రద్దు చేశారు. మన రాజ్యాంగం కాశ్మీర్ ప్రత్యేక సమస్యను అర్ధం చేసుకుని అంగీకరించింది. దానికి పూర్తి విరుద్ధంగా చట్ట సవరణ ఉంది. ఇక 2020లో చేసిన మూడు వ్యవసాయ చట్టాలూ పూర్తిగా తర్కవిరుద్ధమైనవి. కేంద్రీకరణకు దారితీస్తాయి. అవి కార్పొరేట్లకు పూర్తిగా అనుకూలం. అవి రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తాయి. అంతే గాక దేశ ఆహార భద్రతను కూడా దెబ్బ తీస్తాయి. ఇక బొగ్గు గనుల నుంచి విమానాశ్రయాల దాకా ప్రజల ఆస్తులను గుండుగుత్తగా అమ్మేయడం కూడా తమకు మెజారిటీ ఉంది గనుక ఏదైనా చేయవచ్చుననే ధోరణినే సూచిస్తోంది. పార్లమెంటులో ఎటువంటి చర్చలకూ తావు ఇవ్వకపోవడమే కాదు, క్యాబినెట్‌లో కూడా ఎటువంటి చర్చలూ లేవు. కేంద్రీకృత అధికారానికి, ఏకపక్ష నిర్ణయాలకు తలవొగ్గడమే కనిపిస్తోంది.
( రచయిత సుప్రీంకోర్టు న్యాయవాది )
/ ముగింపు రేపు /
కాళీశ్వరమ్ రాజ్











