ప్రజాశక్తి-కాకినాడ రూరల్ సొంత మీడియా బలంతో ఇన్నాళ్లూ పెట్రేగిపోయిన చంద్రబాబు పాపం పండి ఇప్పుడు రాజమండ్రి జైలులో ఉండవలసిన పరిస్థితి వచ్చిందని కాకినాడ రూరల్ ఎంఎల్‌ఎ, వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ పేరిట అప్పటి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సబ్ జైలుకు తరలించారన్నారు. ఏ ఇనిస్టిట్యూట్ ట్రైనింగ్ ఏమీ లేకుండానే రూ.371 కోట్లు దోచుకున్నారన్నారు. చట్టం చంద్రబాబు చుట్టం కాదని డిల్లీ నుండి వచ్చిన లాయర్లు సరిపోలేదని ఇంకో వకీల్ సాబ్ వచ్చి రోడ్ మీద పడిపోయారన్నారు. చంద్రబాబుకు అన్యాయం జరిగిందని ప్రజలు ఎవరూ అనుకోవడం లేదన్నారు. కాకినాడలో బంద్ ప్రభావం ఎలా ఉందో అందరికీ తెలిసిందన్నారు. అచ్చెన్నాయుడు మంత్రిగా రూ.150 కోట్ల ఇఎస్‌ఐ కుంభకోణం బయటపడిందని ఎటువంటి టెండర్ లేకుండానే అచ్చెన్నాయుడు లెటర్‌తోనే ముందులు కొనుగోలు చేసారన్నారు. ఫైబర్ గ్రిడ్ పేరునా దోచేశారన్నారు. చంద్రన్న కానుకగా ఇచ్చిన బెల్లం, నెయ్యిలో కూడా పెద్దస్కామ్ చేసారన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఎండాకాలంలో పని చేసే నిరుపేద కూలీలకు ఇవ్వాల్సిన మజ్జిగను కూడా హెరిటేజ్ నుండే కొనుగోలు చేయాలని చెప్పిన ఘనుడు చంద్రబాబు అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుతో ఫెవికాల్ బంధం ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టుతో మధన పడిపోతున్నాడన్నారు.










