Aug 02,2021 13:00

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ సమావేశాల్లో బిల్లులను ఆమోదించేందుకు తొందరపడుతున్న కేంద్రంపై రాజ్యసభ ఎంపి, టిఎంసి నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ తీవ్రంగా మండిపడ్డారు. 'కేంద్రం చట్టాలను ఆమోదిస్తుందా లేదా పాప్రీ చాట్‌ (బెంగాల్‌ వంటకం) చేస్తుందా' అని వ్యంగ్య ధోరణిలో ప్రశ్నించారు. బిల్లుకు సగటున ఏడు నిమిషాల చొప్పున 12 బిల్లులు ఆమోదించడాన్ని ఆయన లేవనెత్తారు. 'గత పది రోజుల్లో మోడీ-షా హడావుడిగా, బిల్లుకు ఏడు నిమిషాల చొప్పున..12 బిల్లులు ఆమోదించారు. చట్టాన్ని ఆమోదిస్తున్నారా... లేదా పాప్రీ చాట్‌ చేస్తున్నారా' అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. బిల్లులు చర్చించకుండానే ఆమోదం పొందడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఒకటి తన ట్విట్టర్‌ ఖాతాకు జత చేశారు. అందులో కొబ్బరి అభివృద్ధి బోర్డు బిల్లును కేవలం ఒక్క నిమిషంలోనే ఆమోదం పొందడం షాక్‌గురి చేస్తోంది. ఎయిర్‌పోర్ట్స్‌ ఎకానమీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా బిల్లు ఆమోదం పొందేందుకు ఎక్కువ సమయం అంటే 14 నిమిషాలు తీసుకుంది.

చట్టాలు ఆమోదిస్తున్నారా..పాప్రీ చాట్‌ చేస్తున్నారా..? :