ప్రజాశక్తి- గంట్యాడ : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి న్యాయబద్ధంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కె.నాగమణి అన్నారు. మండలంలోని నరవలో మంగళవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగినప్పుడే సమాజంలో సమస్యల వలయంలో చిక్కుకోకుండా కష్టాలు లేకుండా ఉండవచ్చునని అన్నారు. వృద్ధులు పడే ఇబ్బందులను వాటిని పరిష్కరించే మార్గాలను వివరించారు. వృద్ధులకు, పిల్లలకు, మహిళలకు న్యాయ సేవ అధికారి సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలను, లోక్ అదాలతో సేవలు గురించి వివరించారు. మహిళలు, ఆడపిల్లలు సంరక్షణకు సంబంధించిన చట్టాలను వివరించారు. దీని వల్ల సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ స్వర్ణ కుమార్, ఎంపిడిఒ వి బానుజీరావు, నందాం సర్పంచ్ బి.సత్యనారాయణ, ఎఎస్‌ఐ పి రాంబాబు, కోర్టు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










