
గరుగుబిల్లి: ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అనవసరమైన విషయాలకు తగాదాలు పడొద్దని, కోర్టుల చుట్టూ తిరిగి ప్రజలు తమ సమయాన్ని వృథా చేసుకోవద్దని పార్వతీపురం సీనియర్ సివిల్ జడ్జి జి.యజ్ఞనారాయణ అన్నారు. గరుగుబిల్లిలో పార్వతీపురం మండల లీగల్ సర్వీస్ కమిటీ అధ్యక్షతన న్యాయ సేవ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ తగాదాలు కేసులు పెండింగ్లో ఉన్నట్టయితే మండల లీగల్ సర్వీస్ అథారిటీ వారిని సంప్రదించినట్లయితే రాజీ చేయడం జరుగుతుందన్నారు. ఒకప్పుడు పల్లెలు తమతర బేధం లేకుండా ఉండేవని, నేడు సమాజం విచ్ఛిన్నమై అనవసరమైన తగాదాలకు దారితీయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని అవగాహన కలిగి మంచి చెడులను ఆలోచించి, ఒకరు కష్టనష్టాల్లో మరొకరు పాలుపంచుకుని చక్కనైన సమాజంగా మెలగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై బంధాలను మరిచి విచిత్రంగా వ్యవహరి స్తున్నారని అన్నారు. ప్రజలు కొనుగోలు విషయం లోనూ ఎలాంటి సమస్యలైనా ఉన్నట్టయితే వినియో గదారుల ఫోరం ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా చట్టాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది టి.జోగారావు, న్యాయవాదులు ఎం.వెంకటరమణ, బి.పరుశురాం, తహశీల్దార్ జివి జనార్ధన్, ఎంపిడిఒ జి.పైడితల్లి, ఎస్సై ఎం.రాజేష్, సర్పంచ్ ఇందుమతి గ్రామస్తులు పాల్గొన్నారు.
కురుపాం : న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని మండల లీగల్ సర్వీస్ కమిటీ కురుపాం మండల ప్యానెల్ అడ్వకేట్ కె.అశోక్ కుమార్ అన్నారు. గురువారం జాతీయ న్యాయ వ్యవస్థ దినోత్సవం సందర్భంగా స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలో గల పూతికవలసలో గిరిజన హక్కులు, చట్టాలు, చైల్డ్ రైట్స్ యాక్ట్, మ్యారేజ్ యాక్ట్ లీగల్ సర్వీస్ యాక్ట్ లపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాది కె.హరిబాబు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
బాధితులు ఉచిత న్యాయ సహాయం పొందండి
సాలూరు : భర్తల చేత గానీ, ఇంకెవరి చేతనైనా పీడించబడుతున్న మహిళలు, వ్యక్తులు ప్రభుత్వం ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చునని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ మీరా జాస్పిన్ చెప్పారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని స్వయం సహాయక సంఘాల కార్యాలయంలో స్పూర్తి మహిళా సంఘం ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు. పీడిత మహిళలు ఎవరైనా ఉచిత న్యాయ సహాయ కేంద్రం ద్వారా సంప్రదిస్తే ఉచితంగా న్యాయ సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి మీరా జాస్పిన్ కోరారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తాడ్డి తిరుపతిరావు, న్యాయవాది శ్రీనివాసరావు, మెప్మా సిఎంఎం ఎ.పుష్ప, స్పూర్తి మహిళా సంఘం డైరెక్టర్ బి.రాధ పాల్గొన్నారు.