
చట్టాలను సక్రమంగా అమలు చేయాలి
- దళిత రక్షణ యాత్రలో కెవిపిఎస్, వ్యకాసం నేతలు
ప్రజాశక్తి - నంద్యాల
రాజ్యాంగం ప్రకారం దళితులకు ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షురాలు కె.రంగమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో బైటి పేట దళిత కాలనీలో కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళిత రక్షణ యాత్ర జీపు జాతాను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి లేని ప్రతి పేదలకు రెండు ఎకరాల భూమిని పంచాలన్నారు. సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీ కేసును నిర్వీర్యం కాకుండా సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌లో ఉన్న 26 రకాల పథకాలు అమలు చేయాలని, దళితులకు కరెంటు 200 ఉచిత యూనిట్లు నుండి 300 వరకు అందించాలన్నారు. ఈ నెల 29న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కరపత్రాల పంపిణీ ద్వారా ప్రజలను చైతన్యం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా జీపు జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు డేవిడ్, సుబ్బయ్య, సుబ్బరాయుడు, కెవిపిఎస్ జిల్లా నాయకులు జయమ్మ, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్ : రాష్ట్రంలో దళితులకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నాగేశ్వరావు, ఎం సుధాకర్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షురాలు కె.రంగమ్మ విమర్శించారు. దళిత రక్షణ యాత్ర జీపుజాతా సందర్భంగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ లో వ్యకాసం జిల్లా నాయకులు పి.పకీర్ సాహెబ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారులకు 45 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పించాలని, స్మశాన కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు సెంట్లు స్థలం, 2 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. గృహ నిర్మాణానికి రుణాలు రూ 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా నాయకులు ఎం.కర్ణ, సుబ్బయ్య, కెవిపిఎస్ నాయకురాలు ఆర్.జయ, సిఐటియు పట్టణ కార్యదర్శి టి గోపాలకృష్ణ, మహిళా సంఘం నాయకురాలు సోడా బిబి, వెంకటేశ్వర్లు, సీతారాం, పకీరయ్య, రాజు, డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.