Sep 19,2023 22:09

సదస్సులో మాట్లాడుతున్న ఓ. నల్లప్ప

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : దళిత ఉద్యోగ కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడి దళిత చట్టాలను కాపాడుకోవాలని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప పిలుపునిచ్చారు. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టర్తిలో కెవిపిఎస్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితుల హక్కులు సామాజిక న్యాయంపై సదస్సును మంగళవారం నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు అన్నమయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం ఎం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ. నల్లప్ప మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కుల వివక్ష అనేక రూపాల్లో విలయతాండవం చేస్తోందన్నారు. దళితుల చట్టాలను నీరుగార్చే పద్ధతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. దళితులు, దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉద్యమించి దళిత చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ను అమలు చేయాలన్నారు. డప్పు కళాకారులకు చర్మకారులకు 5వేల రూపాయలు పింఛను ఇవ్వాలని, శ్మశానంలో పనిచేసే కాటికాపర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి డిమాండ్లతో ఈ నెల 29వ తేదీ విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి. రమణ నారాయణ, కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌, రామాంజనేయులు, దళిత సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు