1/70, కార్మిక చట్టాల పరిరక్షణ ఉద్యమం ఉధృతం
రైతు యాత్రలు విజయవంతం
రోడ్డెక్కిన 108, అంగన్‌వాడీలు
ప్రజా సమస్యలు పట్టని బిజెపి పెద్దల సమావేశం
మన నేతలు తరచూ చెప్పే మాట 'చట్టం తన పని తాను చేసుకుపోతుంది'. మరి ఆ చట్టాన్నే అమలు చేయాలని ఇప్పటి వరకూ ఆందోళనలు, పోరాటాలు సాగేవి. కేంద్రంలో బిజెపి పాలకుల తీరుతో ఆ చట్టాలను పరిరక్షించండి అంటూ వాటి రక్షణ కోసం సగటు జీవి పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే 44 కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలని దేశవ్యాప్తంగా కార్మికులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోకే వస్తుంది 1/70 చట్టం పరిరక్షణ ఉద్యమం. జిల్లాలో ఐదు ఏజెన్సీ మండలాలు పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు ఉన్నాయి. వీటిలో రాష్ట్ర విభజనకు ముందున్న పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1/70, పీసా చట్టాలు అమలు చేయాలని చాలాకాలంగా పోరాటాలు సాగుతున్నాయి. ఆ మూడు మండలాల పరిధిలోనే సుమారు 50 వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి గిరిజన శాఖా మంత్రి రెడ్యానాయక్ ప్రకటించడం, ఆ భూముల వెలికితీతకు చర్యలు తీసుకుంటామని నాడు ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడిచాయి. నేటికీ ఆ భూముల సంగతి అతీగతీ లేకపోయినా తాజాగా పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల పేరుతో అటవీ భూములను నిలువునా ముంచుతూ ఏజెన్సీ ధ్వంసం పెద్దఎత్తున సాగుతోంది. ఇదంతా చట్టవిరుద్ధంగా అధికారయంత్రాంగం, ప్రభుత్వ పెద్దల కన్నుసన్నలో సాగిస్తుండటం ఆందోళనకరం. అటవీహక్కుల చట్టాన్ని ఈ పాలకులు, అధికారులు అటకెక్కించిన సంగతి తెలిసిందే. చివరకు కోర్టుల తీర్పులను సైతం పక్కనపెట్టి గిరిజనుల భూముల్లో గిరిజనేతరులు పంట సాగు చేస్తుంటే అధికారులు వారికి రక్షణ కల్పిస్తుండటం గమనార్హం. పోలవరం నిర్వాసితులకు భూమికి భూమి కేటాయింపు అంశంలోనూ అధికారుల తీరు వివాదాస్పదమైంది. ఈ మొత్తం వివాదాలన్నింటినీ పరిశీలిస్తే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకపోవడమే కారణమని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన పాలకులు ఆ చట్టానికి తూట్లు పొడిచి దాని మనుగడకే చేటు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఆ చట్టం గూర్చి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు కావడమే దీనికి నిదర్శనం. ఇప్పటికైనా పాలకులు వట్టిమాటలు కట్టిపెట్టి గిరిపుత్రుల గుండెకాయ వంటి 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అంతా కోరుతున్నారు.
వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగిన రైతాంగ ఉద్యమం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం రైతులు మళ్లీ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రోడ్డెక్కాల్సి వచ్చింది. గణతంత్ర దినోత్సవం నాడు జిల్లాలో ఏలూరు, చింతలపూడి, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించి గళమెత్తారు. పంటలకు మద్దతు ధర చట్టంతోపాటు మద్దతు ధరల అమలుకు గ్యారెంటీ చట్టం తీసుకురావాలనేది రైతుల ప్రధాన డిమాండ్. జిల్లాలో గత దాళ్వా, సార్వా సీజన్లలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. గతంలో ఎన్నడూ లేనంతగా పంట అమ్ముకోవడానికే రోడ్డెక్కాల్సి రావడం రైతులను ఆలోచింపజేసింది. ఫలితంగా రైతు ర్యాలీలు విజయవంతమయ్యాయని చెప్పొచ్చు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ హామీల అమలుకు కార్యాచరణ ప్రకటిస్తుందా లేక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి ప్రధాన అంశంలో చేసిన మోసాన్నే దేశవ్యాప్తంగా రైతుల విషయంలోనూ కొనసాగిస్తుందా లేక తీరు మార్చుకుని ఇచ్చిన హామీ అమలు చేస్తుందా అనేది వేచిచూడాలి.
ఇక అంగన్వాడీలు ఫేస్‌యాప్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని అంగన్వాడీలు, తమ సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 108 సిబ్బంది ఇటీవల ఆందోళనబాట పట్టారు. ఇవేమీ వారు కొత్తగా పెట్టిన డిమాండ్లేమీ కాదు. గత ఎన్నికల సందర్భంగా నాడు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇచ్చిన హామీలే. ఆ హామీలను అమలు చేయాలని కోరుతున్నా పాలకపక్షంలో చలనం లేదు. ఈ నేపథ్యంలో వారంతా రానున్న రోజుల్లో తమ ఆందోళనను రెండు జిల్లాల్లోనూ ఉధృతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
రాజకీయ వైఖరిపైనా అస్పష్టత.. ప్రజా సమస్యల ఊసే కరువు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో అట్టహాసంగా జరిగింది. ఆ పార్టీ ముఖ్యనేతలుగా చెబుతున్న పురంధరేశ్వరి, సుజనాచౌదరి వంటి వారు గైర్హాజరవ్వగా అసమ్మతి నేత కన్నా లక్ష్మీనారాయణ దూరంగానే ఉన్నారు. ఇక కేంద్రం పథకాలనే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు తమవి చెప్పుకుంటూ అవినీతికి పాల్పడుతున్నాయంటూ గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని తీర్మానం కూడా చేశారు. అయితే రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై చర్చే లేదు. కనీసం సమావేశాల వేదికైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావాసులకు గతంలో తామిచ్చిన కొల్లేరు సమస్య పరిష్కారం, ఆక్వారంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, నరసాపురం వద్ద వశిష్టగోదావరిపై వంతెన నిర్మాణం, కోటిపల్లి-నరసాపురం, కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ వంటి అంశాల గురించి ప్రస్తావనే లేదు. అంటే బిజెపి నేతలు ఏయే అంశాలపై దృష్టి సారిస్తారో.. ప్రజా సమస్యలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో ఈ సమావేశాలు చెప్పకనే చెప్పాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర, జిల్లాస్థాయి నేతల వరకూ అందరిదీ అధికారమే పరమావధి తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడేవన్నీ వట్టి బూటకమేనని మరోసారి స్పష్టమైంది.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్










