Nov 10,2022 23:31

ఎపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం
ప్రజాశక్తి - బుట్టాయగూడెం

           గిరిజన చట్టాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే గిరిజనుల అభివృద్ధి సాధ్యమని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో మాతృభాష విద్యావాలంటీర్లకు రెండో రోజు శిక్షణ తరగతుల్లో 'గిరిజన చట్టాలు - ఆవశ్యకత' అంశంపై సీతారాం మాట్లాడారు. ఐదు, ఆరు షెడ్యూల్డ్‌ ప్రాంతాన్ని భారత రాజ్యాంగం గిరిజనులకు కేటాయించిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా 1917, 1959 సంవత్సరాల్లో భూ బదలాయింపు చట్టాలు ఉన్నాయన్నారు. 1970లో 1/70 చట్టం తీసుకొచ్చిందని ఈ చట్టం ఆధారంగా 1970 తర్వాత భూముల కొనుగోలు, అమ్మకాలు ఆపాలనేదే చట్టం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 1993లో గిరిజనులకు కుల ధృవీకరణపత్రం జారీకి చట్టం చేస్తూ కొన్ని కమిటీలను నియమించిం దన్నారు. సహజ వనరులు, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయల కల్పన, గిరిజన సంస్కృతి న్యాయ వ్యవస్థలపై కమిటీలు పని చేయాలని చట్టం స్పష్టంగా చెబుతుందన్నారు. ఎస్‌టి అత్యాచార నిరోధకచట్టం గిరిజనులను కులం, లింగ వివక్షతో దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకునేలా చట్టం రూపొందించారని వివరించారు. అనాదిగా వెట్టిచాకిరీ, దోపిడీ, అన్యాయాలకు బలైన గిరిజనుల అభివృద్ధికి స్వాతంత్య్రం అనంతరం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం దేశావ్యాప్తంగా గిరిజన హక్కులపై దాడులు చేస్తుందని విమర్శించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని అమలు చేయకుండా నీతి అయోగ్‌ను ప్రవేశ పెట్టడం బిజెపి దుర్మార్గపు చర్య అని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజనుల చట్టాలను సవరిస్తూ గిరిజన హక్కులను కాలరాస్తున్నారన్నారు.
గిరిజన హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ శిక్షణా తరగతులకు మాతృభాషా విద్యా వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కుంజా నవీన్‌, కార్యదర్శి కురసం పృధ్విరాజు ప్రిన్సిపల్‌గా వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరావు, మాతృ భాషా విద్యా వాలంటీర్లు సరియం రామసీత, సరియం భవాని, మొడియం స్వాతి, మడకం సీతామహాలక్ష్మీ, కరక వెంకటలక్ష్మి, ధర్ముల రాధా, పాయం దుర్గా ప్రియాంక, కూరంశెట్టి లక్ష్మీప్రసన్న, కురసం గీతాంజలి, సోదే సుమలత, మేఘన పాల్గొన్నారు.