చాలెంజ్ చేసి మరీ దళిత వధూవరులను నడి రోడ్ల మీద కుక్కల్ని చంపినట్టు చంపుతుంటే ఈ సమాజం చోద్యం చూస్తూ కూర్చుంటుంది. ప్రణరు హత్య సమయంలో వచ్చిన తీవ్ర స్పందన కూడా ఇప్పుడు సమాజం నుండి రాలేదంటే ఆధిపత్య కులాల మోసం అర్ధం అవ్వడంలేదా? వాళ్ళు దళితుల పట్ల చేసే ఏ నేరం గురించయినా సమాజం తీవ్రంగా స్పందిస్తే ఆ నేరాలను ఆపెయ్యడం కాకుండా...అవే నేరాలను తరుచుగా చేసి సదరు సమాజానికి అలవాటు చెయ్యడం వారి అమానుషత్వానికి నిదర్శనం.
ఆడం స్మిత్ హత్య ఒక్క రోజులో జరిగింది కాదు. ఆడం హత్య ఒక్కటే కాదు, మొన్నటి ప్రణరు, నిన్నటి కేరళ అనీష్... కులమదంతో వాళ్ళను హత్య చేసిన మామలు ముందస్తుగానే హత్య చేయబోతున్నట్టు స్పష్టంగా చెప్పారు. హతులు ముందుగానే పోలీసులను రక్షణ కోసం ఆశ్రయించారు. ప్రణరు హత్యకు ముందు పలు సార్లు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాడు. ''నీ తాళి మూడు నెలలకన్నా ఎక్కువ నీ మెడలో ఉండదు'' అని నా భార్యను బెదిరించారు నా అత్తమామలు అంటూ పాలక్కాడ్ అనీష్ పోలీస్ స్టేషన్లో మొర పెట్టుకున్నాడు. ఇవి కేవలం ఉదాహరణలే. ఇలాంటి కేసులు వందల్లో వున్నాయి.
'హత్య చేయబోతున్నాం' అని వాళ్ళు ప్రకటించినా, మమ్మల్ని చంపేస్తాం అంటున్నారని బాధితులు పోలీస్ స్టేషన్లో మొర పెట్టుకున్నా కూడా...ఈ హత్యల్ని నివారించలేకపోవడం దళితుల ప్రాణాలు విలువ లేనివని...ఈ సమాజం మనసా వాచా కర్మణా నమ్ముతుందనడానికి నిదర్శనం. అయితే కులాంతర వివాహాలు ఈ దేశంలో లేవని కాదు. సవర్ణ/ బీసీ కులాల యువతీ యువకులు పై వర్గాలలో కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో వాళ్ళ కుటుంబాల నుండి మొదట్లో చూచాయగా అభ్యంతరం వ్యక్తమయినా అది కొద్ది రోజుల్లోనే సమసిపోవడం జరుగుతుంది కానీ నేర రూపం దాల్చడం మాత్రం అరుదు. అంటే, కులాంతర వివాహం దళితేతర కులాల మధ్య ఎంతో కొంత మేరకు అనుమతించబడుతుందనే చెప్పాలి (దళితులతో కూడా కులాంతర వివాహాలు జరిగిన ఉదాహరణలు వున్నాయి కదా అని అడగడం కేవలం టోకెన్ వాదమే. అలా చేసుకున్న వాళ్ళు పడే కష్టం మిగతా వర్ణాల మధ్య కులాంతర వివాహం చేసుకున్న వారికంటే వేలరెట్లు అధికం అని గుర్తించాలి. కేవలం హత్యనే వాళ్లు తప్పించుకున్నారు కానీ, అందుకు సమానమైన అవమానాన్ని/ వెలినీ కుటుంబాల నుండి వాళ్ళు నిత్యం అనుభవిస్తున్నారు). ఇక్కడ సమస్య కులాంతర వివాహం కాదు, దళితులతో కులాంతర వివాహమే ఈ సమాజానికి అభ్యంతరం. దళిత యువకులు దళితేతర యువతులతో ప్రేమా, పెళ్ళి ద్వారా సంపర్కం చెయ్యడం అనేదే సమస్య. కుటుంబ పరువును కుటుంబ స్త్రీల జననాంగాల పవిత్రత చుట్టూ అల్లుకునే సమాజ విలువల నేపథ్యంలో, మానవ జైవిక అవసరమైన లైంగికతను బీజం - క్షేత్రం స్థాయికి కుదించుకున్న సంఘంలో దళిత బీజం దళితేతర క్షేత్రంలో పడటమే అభ్యంతరకరమైన పరిణామం అయ్యింది. దానికి పరిష్కారం మనుధర్మశాస్త్రమే. సవర్ణ స్త్రీ క్షేత్రంలో బీజం విడిచే దళితుడిని హతం చెయ్యాలి.
పై కులాల అమ్మాయిలను పెళ్ళి చేసుకున్న/ ప్రేమించిన దళిత యువకులను హత్య చెయ్యడం ఇవాళ కొత్తగా చూడటం లేదు కదా సమాజం? కూతుళ్ళను పెళ్ళి చేసుకున్న/ ప్రేమించిన దళితుల్ని చంపెయ్యడం హంతక కులాలకు అన్నిటికన్నా సులువైన, రివాజైన పని అని అందరూ చూస్తూనే వున్నారు కదా? అలాంటప్పుడు నాకు నా భార్య/భర్త కుటుంబం నుండి ప్రాణ భయం వుందని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన దళిత పిల్లలకు రక్షణ ఇవ్వడం, బెదిరించిన ఆ హంతక కులాల తండ్రులను, బంధువులనూ మూసెయ్యడం అనే చిన్న కదలిక వలన ప్రాణాలు కాపాడవచ్చు కదా?
స్త్రీల పట్ల కౄరమైన నేరాలు చేసిన వారిని శిక్షించడానికి 'నిర్భయ - దిశ' చట్టాలు చేసినట్టే కులాంతర వివాహాలు చేసుకున్న దళితుల పట్ల నేరం చేసే వారిని శిక్షించడానికి 'ప్రణరు' చట్టం రావాలి.
1. కులాంతర వివాహం చేసుకున్న దళిత పిల్లలు తమకు ప్రాణ భయం వుందని ఫిర్యాదు చేసిన వెంటనే అతని భార్య/ భర్త కుటుంబ సభ్యులను అరెస్ట్ చెయ్యాలి.
2. కులాంతర వివాహానికి అడ్డు పడే, బెదిరించే తల్లిదండ్రుల ప్రవర్తన/ కదలికల మీద నిఘా పెట్టాలి.
3. కులాంతర వివాహాలు చేసుకున్న తమ పిల్లల్ని అభ్యంతర పరిచే ఆధిపత్య కులాల తల్లిదండ్రులు ఆ పిల్లల ఇంటికి వెళ్ళడాన్ని కనీసం ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం నిషేధించాలి.
4. కులాంతర వివాహం చేసుకున్న పిల్లల్ని 'నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను' అని చేసే బెదిరింపులకు విరుగుడుగా వీళ్ళకు కూడా మిగతా పిల్లలతోపాటు సమాన ఆస్తిహక్కు విధిగా కలిగించాలి.
5. కులహత్యలకు తెగబడిన వాళ్ళకు బెయిల్ ఇవ్వడం నిషేధించాలి. ఏ కారణం మీద కూడా అరెస్ట్ అయిన తరవాత విచారణ సమయంలో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉండకూడదు. కేసు విచారణ పూర్తయి, శిక్ష పడితే అటు నుండి అటే కారాగారానికి వెళ్ళాలి.
6. తమకు ఆధిపత్య కులాల అత్తమామల నుండి ప్రాణ భయం ఉందని ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళ హత్యల్ని నివారించలేకపోయిన పోలీస్ స్టేషన్ అధికారుల మీద చర్య తీసుకోవాలి.
ఇవి ప్రధానంగా 'ప్రణరు చట్టం'లో వుండాల్సిన విషయాలు.
ఒక పక్క బెదిరిస్తూ, మరోపక్క పోలీసులు తూతూ మంత్రం కౌన్సెలింగ్ చేస్తూ ఇంకా ఎంతమంది దళిత వధూవరుల ప్రాణాలు తోడేస్తారు? చాలెంజ్ చేసి మరీ నడి రోడ్ల మీద కుక్కల్ని చంపినట్టు చంపుతుంటే ఈ సమాజం చోద్యం చూస్తూ కూర్చుంటుంది. ప్రణరు హత్య సమయంలో వచ్చిన తీవ్ర స్పందన కూడా ఇప్పుడు సమాజం నుండి రాలేదంటే ఆధిపత్య కులాల మోసం అర్ధం అవ్వడంలేదా? వాళ్ళు దళితుల పట్ల చేసే ఏ నేరం గురించయినా సమాజం తీవ్రంగా స్పందిస్తే ఆ నేరాలను ఆపెయ్యడం కాకుండా...అవే నేరాలను తరుచుగా చేసి సదరు సమాజానికి అలవాటు చెయ్యడం వారి అమానుషత్వానికి నిదర్శనం. ప్రణరు హత్యానంతరం అవే రకమైన హత్యలు వరసగా చెయ్యడం ద్వారా సమాజపు ఎమోషన్లని డైల్యూట్ చెయ్యగలిగారు. 'మరో 'పరువు హత్య' అని సాదా హెడ్‌లైన్లతో కథను ముగించారు. కాబట్టి ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని డిమాండ్ చెయ్యకుండా దళితులు ఈ పబ్లిక్ ఎమోషన్ మీద ఆధారపడటం వల్ల అణుమాత్రం ప్రయోజనం వుండదు. తలలు నరకడానికి అనుమతి మను ధర్మం ఇస్తే ఆ నరికే చేతులకు బేడీలు వేసే చట్టం తప్పకుండా అవసరం. చట్ట రక్షణ - దుష్ట శిక్షణ... ఇదే దళితుల నినాదం కావాలి.
(వ్యాసకర్త సెల్ : 77801 44722)
ఇండస్ మార్టిన్










