ప్రజాశక్తి - మండవల్లి
చట్ట ప్రకారం గ్రామ సభలను నిర్వహించి గ్రామాభివృద్ధికి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఆచరణ రూపం తీసుకురావాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్.భాస్కరరావు కోరారు. అక్టోబర్ మూడో తేదీ నుంచి నిర్వహించే గ్రామ సభలను పంచాయతీరాజ్ చట్టం సూచించిన రీతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎంపిడిఒ టికె.వెంకటరమణ, తహశీల్దార్ కె.రాజకుమార్లకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పట్టుకొమ్మలైన గ్రామసభల్లో అన్ని శాఖల అధికారులతో పాటు వార్డు మెంబర్లు, వాలంటీర్లు పూర్తిస్థాయిలో పాల్గొనడం లేదన్నారు. అధికారులు హాజరుకాని గ్రామ సభల వల్ల ప్రయోజనం ఏంటని ప్రజలు గ్రామసభలో పాల్గొనేందుకు ఇష్టపడడం లేదన్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో ఒకేసారి ఒకేరోజు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామసభల నిర్వహణ మొత్తాన్ని ఆడియో వీడియో తీసి ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా గ్రామసభ జరుగుతున్న విధానం తెలుస్తుందన్నారు. ఆ విధంగా ఎక్కడా కూడా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేలా ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల బాధ్యులు అప్పారావు, ప్రధాన కార్యదర్శి బండి రంగారావు, పొన్నూరు రామచంద్రరావు, కె.సూర్యరావు పాల్గొన్నారు.










