Jul 23,2021 14:57

భువనేశ్వర్‌ : కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా ఉంటాయి. అందుకే జంతు ప్రేమికులు ఎవరైనా సరే.. పెంపుడు కుక్కల్ని పెంచుకోవడానికే ఇష్టపడతారు. అవి కూడా కుటుంబసభ్యుల్లాగే మెలుగుతాయి. అయితే ఓ వ్యక్తి కుక్కను కాకుండా.. పిల్లిని పెంచుకున్నాడు. ఇది కూడా కుక్కకు ఏమాత్రం తగ్గకుండా.. విశ్వాసాన్ని కనబరిచింది. ఇంట్లోకి పాముని ప్రవేశించకుండా నిలువరించి సాహోసోపేతమైన పని చేసి.. ఆ కుటుంబసభ్యుల ప్రాణాల్ని కాపాడింది. ఈ సంఘటన భువనేశ్వర్‌లో జరిగింది. సంపత్‌ కె పరిదా అనే వ్యక్తి సంవత్సరన్నర నుంచి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. వారి ఇంట్లోకి ఎటువైపు నుంచో వచ్చిన పాము ఇంట్లోకి ప్రవేశించడానికి చూస్తోంది. దీన్ని గమనించిన పిల్లి.. దాని ఎదురుగా నిల్చుంది. పామును ఇంట్లోకి ప్రవేశించకుండా.. దాదాపు అరగంటపాటు అడ్డుకుంది. ఈ సంఘటనను గమనించిన సంపత్‌, స్థానికులు స్కేక్‌ రెస్కూటీమ్‌కి సమాచారమందించారు. రెస్క్యూ టీమ్‌ వచ్చి ఆ పామును పట్టుకొని అడవిలోకి వదిలారు. ఈ సంఘటనపై సంపత్‌ మాట్లాడుతూ.. 'ఇది మా కుటుంబ సభ్యుడిలా మెలిగింది. మా ప్రాణాల్ని కాపాడింది' అని అన్నారు. పాముని... పిల్లి అడ్డుకునే దృశ్యాలను ఓ మీడియా సంస్థ ట్వీట్‌ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. 'పిల్లి.. కుక్కలా విశ్వాసం చూపింది' అని వ్యాఖ్యానించగా.. మరొక నెటిజన్‌ 'పిల్లి సింహంలా కనిపిస్తోంది' అని అన్నారు.