Aug 11,2023 19:08

కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
ప్రజాశక్తి - భీమవరం
చర్మకార వృత్తిదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదని, చర్మకారుల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. శుక్రవారం భీమవరంలో కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబుతో కలిసి చర్మకార వృత్తిదారుల దుకాణాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు పూర్తవుతున్నా దళిత చర్మకారులు నేటికీ వివక్షకు గురవుతున్నారన్నారు. రోడ్డు పక్కన ఎండలో, వర్షంలో చెల్లెలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెప్పులు కొట్టుకునే వృత్తి చేసుకుంటున్నా చర్మకారులను అధికారులు గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. భీమవరం పట్టణంలో వృత్తి చేసుకుంటున్న సుమారు 60 మంది చర్మకారుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కనీసం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులకు దళిత చర్మకారులు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారులతో ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి భీమవరం మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ దళితులను చిన్నచూపు చూస్తూ వారిని బయటికి వెళ్లిపొమ్మని, అపరిశుభ్రమైన ప్రాంతాన్ని దళితులతో శుభ్రం పర్చి ఘోరంగా అవమానించారని గుర్తు చేశారు. నేటికీ మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణపై ఎస్‌సి, ఎస్‌టి కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. దళితులను అవమానించినా ఇంతవరకు కలెక్టర్‌, ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వారి వృత్తిని మార్పు చేసుకోవడానికి, అధునాతన పనిముట్లను కొనుగోలు చేసుకోవడానికి ప్రతి వృత్తిదారుడికీ కనీసం రూ.లక్ష రుణ సదుపాయం తక్షణం కల్పించాలని డిమాండ్‌ చేశారు.
స్టడీ సర్కిల్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్మ కారుల భూములే కావాలా
లిట్‌ కాప్‌ ఆధ్వర్యంలో చర్మకారులు వృత్తి చేసుకోవడానికి పట్టణంలో సుమారు 60 సెంట్ల భూమి ఉందని మాల్యాద్రి తెలిపారు. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి ఆ భూమి చర్మకారుల ఆధీనంలోనే ఉందన్నారు. జిల్లా విభజనలో భాగంగా స్టడీ సర్కిల్‌ పేరుతో భవనాలను నిర్మించడం కోసం ఆ చర్మకారుల భూములను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నించడం తగదన్నారు. భీమవరంలో వేరేచోట స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. చర్మకారుల భూముల్లో తక్షణం వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి ట్రెయినింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి చిన్న చిన్న షాపులను నిర్మించి చర్మకారులందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చర్మకారులు ఉపయోగించే భూములను వాళ్లకే ఇచ్చేలా శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషనురాజు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. వారి వెంట చర్మకార వృత్తిదారుల సంఘం నాయకులు కె.బాలస్వామి, రాజు, లక్ష్మయ్య పాల్గొన్నారు.