కాళ్ళకున్న చెప్పులు తీసి నెత్తినెట్టుకుని
నీ బాంచన్ దొరా!
అంటూ వంగి వంగి
నడిచిన రోజులు..
గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్ళకోసం
కోసులు దూరం కాలినడకనే చేరుకుంటే
దయతో ఎత్తిపోసిన కడివెడు నీళ్ళు
పక్షం రోజులు.. దాచుకుని తాగిన రోజులు.
దినమంతా పనిచేసి బుక్కెడు బువ్వతో
బిడ్డల ఆకలి తీర్చనీకి
దొరగారి గుమ్మం ముందు కాపుకాస్తుంటే
కుక్కకు విసిరినట్లు చెంగులో గింజలు
విసిరిన రోజులు....
జమిందారు ఇంట లగ్గమైతే
దొరసానమ్మ వెంట
మెట్టినింట ఊడిగం చేయనీకి
మా ఇంటి ఆడబిడ్డను ఉంపుడుగత్తెగా
పంపిన రోజులు..
మా అయ్య మాకూ ఓ పేరు పెట్టారని
మరిచిపోయి..
అరే.. ఒరేరు.. అంటుంటే అదే మా పేరుగా చేసుకుని
చిత్తం దొరవారు అంటూ తలవంచిన రోజులు..
గతించి పోయిన రోజుల చరిత్రను చెరిపేస్తూ
కొత్త చరిత్రను లిఖించుకునేనెందుకు
అభ్యుదయ భావాలను
అణువణువునా నింపుకుని
రేపటి తరం స్వేచ్ఛకోసం..
కుత్తుకలు తెగిపడుతున్నా..వెనకడుగు వేయక
చెదరని మనోధైర్యం నింపుకుని..
కన్నుల్లో ఆశల జ్యోతులను వెలిగించుకుని
ఆశగా ఎదురుచూస్తుంటే...
దళారీలు, పెత్తందారులు,
రాజకీయ నాయకులు, కుల అహంకారులు..
గోతులు తవ్వుతున్నారు..
నవ సమాజం కోసం వేసుకుంటున్న దారులు
ధ్వంసం చేస్తూ..గొంతు సవరించినవాడిని వల్లకాటికి పంపేస్తూ...
విష సంస్కృతికి చరమగీతం పాడేదెన్నడో.
- రాము కోలా
98490 01201