Apr 23,2021 06:59

   ప్రస్తుత ముసాయిదా సిలబస్‌ హిందూ ముస్లిం సమాజాలను వేర్వేరుగా అధ్యయనం చేయడం వెనుక ముఖ్యోద్దేశం ఈ రెండు ప్రధాన మతాల మధ్య విభజనను గట్టిపర్చడమే. మధ్య యుగాల భారత చరిత్రను హిందూ-ముస్లింల ఘర్షణ కాలమని, హైందవ సంస్కృతి పతనమైన కాలం చీకటి కాలమని, ముస్లింలు హిందువులపై దాడులు చేసిన కాలం, ముస్లింల పాలనా కాలమని ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న వాదనలన్నీ పూర్వపక్షమైనాయి. కానీ వాటి స్ఫూర్తినే ముసాయిదా సిలబస్‌ బోధిస్తున్నది. మధ్యయుగాల కాలంలో మత సామరస్య చరిత్రను పట్టించుకోలేదు. ఈ రెండు మతాలు ఒంటిరిగా కాక రెండూ ఎలా సహజీనం చేశాయో విద్యార్థులకు నేర్పాలి.
   గత కొంత కాలంగా భారతదేశ చరిత్రపై బి.జె.పి ప్రభుత్వం చేస్తున్న దాడిని మరింత తీవ్రతరం చేసింది. అధికారం లోకి వచ్చిన నాటి నుండి విద్యా, సాంస్కృతిక, సామాజిక మాధ్యమాలు, సినీ రంగాలకు చెందిన వివిధ సంస్థలను, రాజ్యాంగ బద్దమైన విలువలతో పని చేస్తున్న సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్న వ్యక్తులతో నింపి దురాక్రమణ చేస్తోంది. అది సాధ్యపడకపోతే ఆ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నది.


తప్పుడు పద్ధతిలో సిలబస్‌ రూపకల్పన
   ఈ క్రమాన్ని వేగవంతం చేసే విధంగా ఇటీవల యుజిసి అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులలో చరిత్ర విభాగానికి ఒక సిలబస్‌ను రూపొందించింది. దీనిని ఫిబ్రవరి 15న యుజిసి తన వెబ్‌సైట్‌లో పెట్టి ఫిబ్రవరి 28 లోగా అభిప్రాయాలను కోరింది. తగిన సమాచారం లేనందున, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎటువంటి నోటీసులు లేనందున ఈ డ్రాఫ్ట్‌ మార్చి మూడో వారానికి గాని ఎవరికీ తెలియక చర్చకు రాలేదు. అప్పటికే అభిప్రాయాలు చెప్పే గడువు పూర్తయింది. చరిత్ర పాఠ్యాంశాల రూపకల్పన ఒక కఠినమైన ప్రక్రియ. జవాబుదారీతనం, వాస్తవాల ఆధారిత విశ్వసనీయమైన రీడింగ్‌లు, రిఫరెన్స్‌లు, అన్నిటికంటే తదుపరి విద్యా సంవత్సరంలో వాటిని రివిజన్‌ చేయడం వంటి క్లిష్టమైన పద్ధతిని అనుసరించి రూపొందించేవారు. కానీ ప్రస్తుతం యుజిసి అటువంటి కసరత్తు చేయకుండా ఏకపక్షంగా ప్రచురించింది. ఢిల్లీ యూనివర్సిటీ గత దశాబ్ద కాలంలో చరిత్ర పాఠ్యాంశాలపై ఐదు వేరు వేరు కరిక్యులమ్‌ పద్ధతులను అనుసరించి సిలబస్‌ను రూపొందించింది. యుజిసి గతంలో సిలబస్‌కు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను మాత్రమే నిర్దేశించేది. ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు సైతం పాఠ్యాంశాల రూపకల్పనకు, సవరణకు అవకాశం వుండేది. కానీ ప్రస్తుతం యుజిసి మొత్తం పాఠ్యాంశాలను తనే రూపొందించింది. ఉన్నత విద్యను నియంత్రించే ఈ కేంద్రీకరణ విధానం అధ్యాపకుల స్వతంత్రతను దెబ్బతీస్తుంది.

ఆధిపత్య శక్తులకు అనుకూలంగా చరిత్ర మార్పు
   సిలబస్‌లో చేసిన మార్పులను పరిశీలిస్తే స్థూలంగా మన దేశ చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్‌ దృక్పథానికి అనుగుణంగా మార్చడం, వేదాలను కీర్తించడం, మత గ్రంథాలను వాడుకోవడం, పౌరాణిక భావనలకు, మతం పాత్రలకు ప్రాధాన్యతనివ్వడం, ముస్లింల పాలన ప్రాముఖ్యతను, జాతీయ ఉద్యమ నాయకుల ప్రాధాన్యతను తగ్గించడం వంటివి గమనించవచ్చు. ముసాయిదా సిలబస్‌లో ముఖ్యమైన సమస్య ఏమిటంటే...అది చరిత్రను...పురాణాలు, ఇతిహాసాల స్థాయికి కుదించింది. శాస్త్రీయ ఆలోచనలు, మానవత్వాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, సంస్కరణ స్వభావాన్ని అభి వృద్ధి చేయాలని చెప్తున్న భారత రాజ్యాంగంలోని 51 ఎ(హెచ్‌) అధికరణానికి విరుద్ధంగా ఈ డ్రాఫ్ట్‌ సిలబస్‌ ఉంది. ప్రజలలో శాస్త్రీయ ఆలోచనలు అభివృద్ధి చేయాలని భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో పేర్కొన్నదానికి భిన్నంగా ఉంది.
   ఈ ముసాయిదా మొదటి పేపర్‌ ''ఐడియా ఆఫ్‌ భారత్‌''. ఇది చారిత్రక పూర్వ కాలాలను చారిత్రక ప్రారంభ కాలాలను వివరిస్తున్నది. ఇందులో 'భరత వర్ష' యొక్క ఉద్దేశాన్ని అర్ధం చేసుకోవడం...భారత సాహిత్యం యొక్క కీర్తిని...వేదం, వేదాంగాలు, ఉపనిషత్తులు, పురాణాలు, బౌద్ధ-జైన సాహిత్యం, స్మృతి, ఇతిహాసం, ధర్మ, ఫిలాసఫీ, వసుధైౖక కుటుంబం, భారత విద్యా వ్యవస్థను తెలుసుకోవడం వంటివి ఉన్నాయి. ఇవి మత సాహిత్యాన్ని కీర్తిస్తూ ప్రాచీన భారతం చాలా గొప్పదని వాస్తవాధార రహితంగా రుద్దడమే. పురాతన కాలంలో ఉన్న లౌకిక సాహిత్యమైన కౌటిల్యుని అర్థశాస్త్రం, కాళిదాసు పద్యాలు, ఆయుర్వేద వచనమైన చరక సంహితలను విస్మరించిందంటే...ఈ ముసాయిదా అసలు దురుద్దేశం ఏమిటో అర్ధమౌతుంది. పురాతన భారతీయ నాగరికత అంతా శాశ్వతమైనదని, అదే అంతిమమైనదని చెప్పడంలో సంఘపరివార్‌ లక్ష్యం జాతీయ అహంకారాన్ని, ఉన్మాదాన్ని ప్రేరేపించడం...తద్వారా ఆధిపత్య శక్తుల ఆస్తిగా చరిత్రను మార్చడమే.

                                                                హిట్లర్‌ మార్గం
   హిట్లర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే సోషలిజం ప్రభావాన్ని తగ్గించేందుకు పాఠశాలలు, విద్యా సంస్థలపై పట్టు సాధించి కేంద్రీకృత సిలబస్‌ను అమలు చేశాడు. సిలబస్‌లో యూదులు కన్నా జర్మన్లు గొప్పవారని చెప్పేందుకుగాను సైన్స్‌ను రేస్‌ సైన్స్‌గా వక్రీకరించాడు. ఆరోగ్య విద్య, శారీరక విద్య పాఠ్యాంశాలను యూదు వ్యతిరేకతతో రూపొందించాడు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో, అన్ని సంస్థలను 'నాజిఫికేషన్‌' గావించాడు. సరిగ్గా ఇదే వ్యూహాన్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది.
ముసాయిదా సిలబస్‌లో వక్రీకరణలు
   డ్రాఫ్ట్‌ సిలబస్‌ మూడవ పేపరు (ఫ్రం ఎర్లియస్ట్‌ టైమ్స్‌ టు 550 సిఇ) లో సింధు - సరస్వతి నాగరికత లక్షణాలు దాని కొనసాగింపు, పతనం, మనుగడ ఉన్నాయి. సింధు - సరస్వతి నాగరికతకు వేదకాలం నాటి నాగరికతకు ఉన్న సంబంధం గురించి ఇది చర్చిస్తుంది. అయితే సరస్వతీ నది అనేది ఋగ్వేదంలో చెప్పబడింది తప్ప నిజంగా ఉందా అనేది గత శతాబ్ద కాలంగా చర్చనీయాంశంగా ఉంది. ఈ కల్పిత సరస్వతీ నది ఉందని నిరూపించడానికి కేంద్రం కొన్ని అధ్యయన ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసింది.
   అయినా అవేవీ సరస్వతీ నది ఉనికిని శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయాయి. సంఘపరివార్‌ వాదననే ముసాయిదా సిలబస్‌లో యుజిసి పొందుపర్చింది. భారతదేశం యొక్క అత్యంత ఘనమైన హరప్పా నాగరికతను సింధు నదీ లోయ నాగరికత అని కూడా పిలుస్తారు. సంఘపరివార్‌కు ఇబ్బంది కలిగించే విషయమేమిటంటే భారత్‌ గర్వంగా చెప్పుకొనే హరప్పా నాగరికత విస్తరించిన సింధునదిలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌లో ప్రవహిస్తుండడం. ఈ కారణం వల్ల అది చరిత్ర వక్రీకరణకు పూనుకుంటున్నది. పశ్చిమాన సింధూనది నుంచి తూర్పున గంగానది వరకూ సరస్వతి నాగరికత వ్యాపించిందన్న ఒక కల్పిత గాధను హరప్పా నాగరికతకు పోటీగా వండుతున్నారు. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికి విరుద్ధంగా హరప్పన్‌ కాలం నుంచి హిందూ కాలాల వరకూ సరస్వతి నాగరికత కొనసాగింపు ప్రతీకగా చెబుతున్నారు. చరిత్రలో ఇంత వరకూ సరస్వతి నాగరికత అన్నదే లేదు.
   ఏడవ పేపరు లోని ఒక భాగంలో బాబరుతో పాటు ముస్లింల రాజ్య విస్తరణ లేదా ఆక్రమణలను దండయాత్రలుగా పేర్కొన్నది. ఇంత వరకూ చరిత్రలో ఈ విధంగా బోధించలేదు. అదే సందర్భంలో 12వ పేపర్‌లో ఈస్టిండియా కంపెనీది దండయాత్ర కాక ప్రాదేశిక విస్తరణగా పేర్కొన్నది.
   సొసైటీ అండ్‌ ఎకానమీ విభాగంలో హిందూ ముస్లిం సమాజాల గూర్చి రెండు వేర్వేరు విభాగాలున్నాయి. కుల, వృత్తి సమూహాలు, జీవన శైలి, విద్య, ఆచారాలు, సంప్రదాయాల గురించి అధ్యయనం చేయాలని ఉంది. అయితే దీని ముఖ్యమైన ఉద్దేశం మధ్య యుగాలలో హిందూ-ముస్లిం సమాజాలను వేర్వేరుగా చేసి చూపడమే.
   ప్రస్తుత ముసాయిదా సిలబస్‌ వాటిని వేర్వేరుగా అధ్యయనం చేయడం వెనుక ముఖ్యోద్దేశం ఈ రెండు ప్రధాన మతాల మధ్య విభజనను గట్టిపర్చడమే. మధ్య యుగాల భారత చరిత్రను హిందూ-ముస్లింల ఘర్షణ కాలమని, హైందవ సంస్కృతి పతనమైన కాలం చీకటి కాలమని, ముస్లింలు హిందువులపై దాడులు చేసిన కాలం, ముస్లింల పాలనా కాలమని ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న వాదనలన్నీ పూర్వపక్షమైనాయి. కానీ వాటి స్ఫూర్తినే ముసాయిదా సిలబస్‌ బోధిస్తున్నది. మధ్యయుగాల కాలంలో మత సామరస్య చరిత్రను పట్టించుకోలేదు. ఈ రెండు మతాలు ఒంటిరిగా కాక రెండూ ఎలా సహజీనం చేశాయో విద్యార్థులకు నేర్పాలి.
ఇంత వరకూ 13-14 శతాబ్దానికి మూడు పేపర్లు ఉండేవి. కానీ డ్రాఫ్ట్‌ సిలబస్‌ దీన్ని ఒక పేపర్‌కు పరిమితం చేసింది. మొఘలుల పాలన ప్రాధాన్యతను తగ్గించింది. వాస్తవాల వక్రీకరణకు పూనుకొన్నది.
   కొత్త ముసాయిదా సిలబస్‌లో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్‌, అంబేద్కర్‌ వంటి జాతీయోద్యమ నాయకులపై తక్కువ శ్రద్ధ కనబర్చింది. ఇందుకు ముఖ్యమైన కారణం వీరు జాతీయోద్యమ, ఆధునిక రాజ్యాంగ విలువల ప్రతినిధులు కావడమే. జాతీయోద్యమంలో ఎటువంటి పాత్రా లేని, రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావమే దీనికి కారణం. ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలో పెరిగిన మతతత్వ ప్రమాదానికి సిలబస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వర్తమాన సమస్యల పరిష్కారానికి చరిత్రను సాధనంగా ఉపయోగించాలన్న ఆధునిక భావనకు ఇది భిన్నంగా ఉంది. 1857-1950 మధ్య కాలంలో దళిత, అభ్యుదయ, ఆధునిక, రాజకీయ ఆలోచనా స్రవంతుల గురించి సిలబస్‌లో లేవు.
   ప్రాచీన భారత దేశ చరిత్రకు సంబంధించి ఆర్‌.ఎస్‌.శర్మ, మధ్యయుగ భారత దేశ చరిత్రకు సంబంధించి ఇర్ఫాన్‌ హబీబ్‌ రచనలను యుజిసి రిఫరెన్స్‌ పుస్తకాల జాబితా నుంచి తొలగించింది. 1857కు ముందు బెంగాల్‌ సన్యాసుల తిరుగుబాటు, ఒడిశాలో పైకా తిరుగుబాటు, తమిళనాడులో పాలిగార్‌ తిరుగుబాటును సిలబస్‌ నుంచి తొలగించింది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన చారిత్రిక ఘట్టం 1905 విభజన. దానిపై ప్రజల ప్రతిఘటన గురించి సిలబస్‌లో ప్రస్తావనే లేదు.
   ఈ వక్రీకరణలు చరిత్రకే పరిమితం కాదు. ఇటీవల సంఘ పరివార్‌కు చెందిన జె.ఎస్‌. రాజ్‌, శంకర్‌ శరణ్‌, భారతీయ శిక్షా మండల్‌, శిక్షా సంస్కృత న్యాస్‌లు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ను కలిసి జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా పాఠశాల స్థాయి నుండి అన్ని స్థాయిల్లో సిలబస్‌ను మార్పు చేయాలని కోరాయి. గతాన్ని మార్చలేం. కొన్ని భాగాలను సవరించడం లేదా తొలగించడం అంటే గతాన్ని నాశనం చేయడం. దాని నుండి నేర్చుకునే అవకాశాన్ని భవిష్యత్‌ తరాలకు లేకుండా చేయడమే. ఆలోచించని, ప్రశ్నించని ఒక కొత్త వ్యవస్థలోకి విద్యార్థులు, యువతను తీసుకుపోవడమే దీని ఉద్దేశ్యం. మన దేశ చరిత్ర, లౌకిక సాంప్రదాయాలు, జాతీయ ఉద్యమ వారసత్వం, రాజ్యాంగ స్ఫూర్తిపై జరుగుతున్న దాడుల నుండి సిలబస్‌ను కాపాడుకోవాలి.
 

/ వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి /
కె.శేషగిరి

కె.శేషగిరి