ప్రజాశక్తి - గోనెగండ్ల
విద్యార్థులు చరిత్రను తెలుసుకోవడం ద్వారానే సమాజాభివృద్ధికి తోడ్పడగలుగుతారని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి బడే సాహెబ్ తెలిపారు. గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద మోడల్ స్కూల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో భాగంగా ఆదివారం రెండోరోజు 'భారత స్వాతంత్రోద్యమ చరిత్ర - విద్యార్థుల పాత్ర' అనే అంశంపై బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్, జెవివి జిల్లా కార్యదర్శి కె.బడేసాహెబ్ బోధించారు. అనంతరం 'గతితార్కిక భౌతిక వాదం' అనే అంశంపై ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి, ప్రస్తుత ప్రజాశక్తి జనరల్ మేనేజర్ నరసింహ బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వందల ఏళ్ల సుసంపన్నమైన చరిత్ర గలిగిన భారతదేశంలో విద్యార్థుల పాత్ర కూడా కీలకమైందని తెలిపారు. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర అని, గత కాలపు అనుభవాలను పంచుతూ నవ నిర్మాణం వైపు అడుగులు వేయిస్తుందని చెప్పారు. ఛాందసవాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రతిదీ ప్రశ్నతో మొదలుపెట్టి సమాజానికి ఒక సమాధానంగా మారాలన్నారు. 'చదువు - పోరాడు' అనే నినాదాన్ని భుజస్కంధాలపై వేసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం, సిలబస్ వరకే పరిమితం కాకుండా, సమాజంలో జరుగుతున్న రుగ్మతలపై కూడా సంపూర్ణ పరిజ్ఞానాన్ని సాధించాలని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి దేశ దిశా దశ నిర్దేశకులని, బాగా చదువుతూనే చదువుకు ఏర్పడే ఆటంకాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సూచించారు. అందుకు చరిత్ర అధ్యయనం అనేది ప్రధానమైందని తెలిపారు. రెండో రోజు క్లాసులకు ప్రిన్సిపల్‌గా శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్‌గా రవి క్లాసులు నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, మండల కార్యదర్శి వీరన్న, నాయకులు ఖాజా పాల్గొన్నారు.










