Feb 11,2022 12:51



కోల్‌కతా : బిజెపిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదునైన విమర్శలు చేశారు. నిజమైన హిందూయిజం మర్చిపోయాలా చేసి... చరిత్రను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో గురువారం మాట్లాడిన దీదీ.. 'బిజెపి ప్రతీది నాశనం చేస్తున్నది, చరిత్రను మార్చేస్తున్నది. మహిళలు, దళితులు, ఆదివాసీయులను చిత్ర హింసలకు గురి చేస్తున్నది. వాస్తవ హిందూయిజం మర్చిపోతున్నాం. ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన (ప్రధాని మోడీ) సాధువుగా మారి... వచనాలు వల్లిస్తున్నారు. తొలి అమర్‌ జవాన్‌ జ్యోతిని తొలగించి.. నేతాజీ హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ హోలోగ్రామ్‌ కూడా లేదు. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే వారికి చిహ్నాలు గుర్తుకు వస్తాయి' అని మోడీ సర్కార్‌పై మండిపడ్డారు. రైతు ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. అన్నదాతలు చాలా కాలంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ... వారికిప్పటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) దక్కలేదని విమర్శించారు.
జాతీయ పౌర నమోదు పట్టిక (ఎన్‌ఆర్‌సి), పెట్టుబడుల ఉప సంహరణపై మాట్లాడిన మమతా.. 'దేశాన్ని అమ్మేస్తే.. ప్రజలు ఎలా బతుకుతారు' అని ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌సి తీసుకువచ్చి.. ప్రజల హక్కులను కాలరాసిందని, కానీ తాము ప్రజల హక్కులను రక్షిస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి తెరవడంపై స్పందిస్తూ.. కోవిడ్‌ పరిస్థితిపై సమీక్ష చేపట్టిన తర్వాత... వీటిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కోవిడ్‌ వేరియంట్లు బెంగాల్‌ను తాకనట్లయితే... అప్పుడు పాఠశాలలను తిరిగి తెరవడంపై ఆలోచిస్తామని అన్నారు.