

డయ్యర్ నేతృత్వంలో నాటి బ్రిటీష్ సైన్యం జరిపిన దురాగతానికి సాక్షీభూతం జలియన్ వాలాబాగ్ దురంతం. అలాంటి చారిత్రక విషాద చిహ్నాలను వినోదాత్మకంగా మలచడం మోడీకే చెల్లింది. ఈ ఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల క్రితం సెలబ్రేట్ చేసుకున్న ఘనతా ఆయనకే దక్కుతుంది. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గొనని ఈ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వాదులు భవిష్యత్తరాలకు ఆ స్ఫూర్తిని లేకుండా చేసే కుట్రకు పూనుకున్నారు. అందులో భాగమే సెంట్రల్ విస్టా నిర్మాణం గానీ, ఇప్పుడు జలియన్ వాలాబాగ్ పునరుద్ధరణగానీ. ఇదంతా చరిత్రను చెరిపేయడానికి నిస్సిగ్గుగా మోడీ నాయకత్వం సారథ్యం వహించింది. ఇప్పుడు సర్వత్రా దీనిమీద నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం..

పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో జలియన్‌వాలాబాగ్‌ను పునరుద్ధరించిన తీరు చరిత్రను తొలగించేలా కనిపిస్తున్నదనే ఆందోళనలు చరిత్రకారుల నుంచి వ్యక్తమవుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల జలియన్‌వాలాబాగ్‌ను పునర్నిర్మించింది. దీనికి సంబంధించిన స్మారక చిహ్నాన్ని ఇటీవలే ప్రధాని మోడీ ఆవిష్కరించారు. నాడు (1919, ఏప్రిల్ 13) అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్ వద్ద గుమిగూడిన భారతీయులపై బ్రిటీషు సైన్యం కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. 102 ఏళ్ల క్రితం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ నేతృత్వంలో జరిగిన కాల్పుల్లో వెయ్యిమందికి పైగా మరణించారు.

'ఆనాటి మతతత్వవాదుల రాజకీయాలలో జాతీయతావాదం లేదని, వలసపాలనను వ్యతిరేకిస్తూ లేదా స్వాతంత్య్రం కాంక్షిస్తూ సాగిన ఉద్యమంలో వారి పాత్ర లేదని ఆర్‌ఎస్‌ఎస్-బిజెపీ నాయకుల అంతరాత్మలకు స్పష్టంగా తెలుసు. ఈ వాస్తవ చారిత్రక జాతీయ ఉద్యమం వారికి మింగుడుపడనిది. దీన్ని ఎలా పరిగణించాలో వారికి తెలియదు. దాన్ని వారు విస్మరించలేరు. కించపరచి మాట్లాడేవారు మోసపూరితంగా జాతీయవాద వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. కొంతమంది జాతీయవాద నేతలను తమ రాజకీయ లేదా భావజాల భాగస్వాములుగా ప్రకటించుకుంటూ జాతీయ ఉద్యమంతో నకిలీ సంబంధం నెలకొల్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు!' అన్న ప్రఖ్యాత చరిత్రకారుడు బిపన్ చంద్ర అన్న మాటలే నేడు జలియన్‌వాలాబాగ్ పునరుద్ధరణలో ప్రతిఫలిస్తున్నాయి. ఇదే ఇప్పుడు అక్కడ బిజెపి చేస్తున్న మోసపూరిత చర్య.

జలియన్‌వాలాబాగ్ పునర్నిర్మాణంలో భాగంగా, ఇరుకైన లేన్ గోడలు (దీనిద్వారా జనరల్ డయ్యర్ నేతృత్వంలోని సైనికులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు) శిల్పాలతో చెక్కి ఉన్నాయి. ఇప్పుడు బాగ్‌లోకి ప్రవేశించే, నిష్క్రమించే ప్రదేశాలు కూడా మార్పునకు గురయ్యాయి. ముఖ్యంగా, ప్రధాన నిర్మాణం చుట్టూ లోటస్‌పాండ్‌ను నిర్మించడం గమనార్హం. అయితే, పంజాబ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో జలియన్‌వాలాబాగ్ పునర్నిర్మాణం ప్రాముఖ్యతను సంతరించుకుంది. షాహిదీ ఖు (అమరవీరుల బావి) ఇప్పుడు ఒక గాజు కవచంతో కప్పబడి ఉంది.
మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు ఇలా..
జలియన్‌వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ మే 1, 1951న స్థాపించబడింది. దీనిని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో ఏప్రిల్ 13, 1961న ప్రారంభించారు. అప్పటి నుండి, జలియన్‌వాలాబాగ్ అనేక మరమ్మతులకు గురైంది. కానీ దాని అసలు రూపం ఎన్నడూ దెబ్బతినలేదు. జలియన్‌వాలాబాగ్ మారణకాండ నూరేళ్లు పూర్తిచేసుకున్నప్పుడు (2019లో) కేంద్ర ప్రభుత్వం దాని పునరుద్ధరణకు రూ. 20 కోట్ల అంచనా వ్యయం ప్రకటించింది.
ఏదేమైనా, జలియన్‌వాలాబాగ్ యొక్క ప్రారంభ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి, ప్రజలు దాని పునర్నిర్మాణం, ముఖ్యంగా మారిన ప్రవేశం.. నిష్క్రమణ, లోటస్ పాండ్, 28 నిమిషాల సౌండ్ అండ్ లైట్ షో గురించి చర్చించుకుంటున్నారు. అమరవీరుల వారసులు, చరిత్రకారులు, ప్రతిపక్ష నాయకులు, రచయితలు, స్థానికులు, పంజాబీ ప్రవాసులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలంతా స్మారక చిహ్నాన్ని తొలగించడంపై సోషల్ మీడియాల్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అమరవీరులకు అవమానం
రాజకీయ నాయకులు, చరిత్రకారులు జలియన్‌వాలా బాగ్ పునరుద్ధరణను తీవ్రంగా ఖండిస్తున్నారు. అమరవీరుల వారసులు స్మారక చిహ్నం, దాని నిజమైన చారిత్రక నిర్దేశానికి అనుగుణంగా పునరుద్ధరించే వరకూ అమరవీరుల జ్ఞాపకార్థం భవిష్యత్తులో జరిగే 'జాతీయ / రాష్ట్ర స్థాయి' కార్యక్రమాలు ఏవైనా తాము బహిష్కరిస్తామని ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఇతర ట్రస్ట్ సభ్యులూ తమని పునరుద్ధరణ ప్రాజెక్టులో పాల్గొనకుండా చేయడమే లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇందులో భాగస్వామ్యమై ఉంటే ఇంత దారుణాలు జరిగేవి కావని అంటున్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం అందించే ఇతర సౌకర్యాల కోసం తాము చేసిన డిమాండ్లనూ అమరీందర్ సింగ్ విస్మరించారని వారు విమర్శిస్తున్నారు.

'జలియన్‌వాలాబాగ్‌కి వెళ్లే సందు గోడలపై శిల్పాలతో పూర్తిగా మార్చేశారు. ఓవర్‌హెడ్ ఇనుప గ్రిల్స్‌తో కప్పేసి, దాని ఆత్మను దెబ్బతీశారు. కల్నల్ డయ్యర్ సైనికులు ప్రజలను ఎలా నిరోధించారనే క్రూరత్వాన్ని ప్రతిబింబించేది' అని అమరవీరుల వారసులు చెప్తున్నారు. జలియన్‌వాలాబాగ్ దురంతంలో నాడు ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల వారుసులమైన తాము ఈ మార్పులకు నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు.
రెండేళ్ల పునర్నిర్మాణం తరువాత, అమృత్‌సర్‌లోని చారిత్రాత్మక జలియన్‌వాలాబాగ్ దేశభక్తిని ప్రేరేపించే రూపురేఖలను సంతరించుకుంటోందని మోడీ ప్రభుత్వం ఘనంగా చెప్తోంది. కానీ వాస్తవంగా ఈ ప్రాజెక్ట్ అన్ని వర్గాల నుండి, ప్రత్యేకించి అమరవీరుల కుటుంబాల నుండి నిరసన వ్యక్తమవుతోంది. వారు తమ పూర్వీకుల చరిత్రను అందమైన లైట్లు, కుడ్యచిత్రాలతో చెరిపేసే ప్రయత్నమని దీన్ని నిరసిస్తున్నారు.

జలియన్‌వాలాబాగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, జలియన్‌వాలాబాగ్ వద్ద అమరులైన లాలా వాసూ మాల్ మనవడు సునీల్‌కపూర్ మాట్లాడుతూ 'స్మారక చిహ్నంతో కేంద్ర ప్రభుత్వం ఏమి చేసినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం!' అని చెప్పారు. 'జలియన్‌వాలాబాగ్ ప్రవేశద్వారం ఇప్పుడు ఒక వివాహ మందిరంలా ఉంది. అందమైన లైట్లు, పరిసరాలన్నీ మీకు షాపింగ్‌మాల్‌ని గుర్తు చేస్తాయి. ఇది మన స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వాన్ని వర్ణించదు. పునర్నిర్మించిన ఈ స్మారకానికి వ్యతిరేకంగా అన్ని జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను బహిష్కరించాలని మేము నిర్ణయించుకున్నాం' అని సునీల్‌కపూర్ చెప్పారు.
రైతాంగ పోరాటాలు.. నాడూ నేడూ

స్వాతంత్య్రోద్యమంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగ ఉద్యమం దేశవ్యాపితంగా ఊపందుకున్నది. భూస్వామ్య వ్యవస్థ రద్దు, దున్నేవారికి భూమి, వెట్టిచాకిరీ రద్దు, కౌలుదారుల హక్కులు, పంటలకు గిట్టుబాటు ధర, భూమి శిస్తు వగైరా సమస్యలు తీసుకుని పోరాటాలు నిర్వహించారు.
నేడు దేశంలో పది నెలలకు పైగా జరుగుతున్న రైతాంగ పోరాటం స్ఫూర్తివంతంగా చరిత్రలో నిలిచిపోతుంది. మోడీ ప్రభుత్వ కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మూడు నల్లచట్టాలను రద్దుచేయాలని సాగుతున్న పోరాటం. కరోనా కాలంలోనూ రోజు రోజుకూ నిర్బంధాలను, అణచివేతను ఎదుర్కొంటూ మరింత ఉధృతంగా ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతోంది. రైతులంతా ఒక్కతాటిపైకొచ్చి చేస్తున్న పోరాటమిది. ఈ నెల 27వ తేదీన జరగబోయే దేశవ్యాప్త బంద్ దీనికి కొనసాగింపే.
జాతీయ నేతల వారసులమని చెప్పుకోవాలని చూశారు : బిపన్ చంద్ర

19వ, 20వ శతాబ్ధాల గొప్ప సామాజిక-రాజకీయ సంస్కర్తలు తమ పూర్వీకులని, లేదా వారి వారసులమని తమని తాము చిత్రీకరించుకోవాలనీ ప్రయత్నిస్తున్నారు. అలా వారు అంచెలంచెలుగా గాంధీజీ, భగత్‌సింగ్, చంద్రశేఖర్ అజాద్ తదితర జాతీయ విప్లవకారులు, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, సర్దార్ పటేల్, స్వామీ వివేకానంద, బంకిం ఛటర్జీ బిపిన్ పాల్, అరవింద ఘోష్ తదితరుల వారసులుగా, అనుయాయులుగా చెప్పుకోవడానికీ ప్రయత్నించారు. కానీ వారు విఫలమయ్యారు. ఇంతకుముందే చెప్పినట్లు, జాతీయోద్యమ నాయకులు దాదాభాయి నౌరోజీ నుంచి గాంధీజీ వరకు అనేక విషయాల్లో పరస్పరం విభేదించుకున్నారు. సామాజిక-ఆర్థిక కార్యక్రమాలు, విధానాల మీదో లేదా వలసవాదంపై ఎలా పోరాడాలి లేక అహింస పాత్ర ఏమిటి.. సాయుధ పోరాటమా, రాజ్యాంగబద్ధ పద్ధతులే అనుసరణీయమా? వంటి అంశాల మీదో వారి మధ్య భిన్నాభిప్రాయాలు ఉండేవి. అయినప్పటికీ వలసవాదం, మతతత్వం, కులతత్వాల వ్యతిరేక పోరాటం వారందరి ఉమ్మడి లక్ష్యంగా ఉండేది. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, లౌకికవాదం, స్వతంత్ర ఆర్థిక అభివృద్ధి, బీదల అనుకూలత అంశాలపై వారందరి నడుమ మౌలికంగా ఏకాభిప్రాయం వ్యక్తమయ్యేది. ఈ విలువల విషయంలో వారెప్పుడూ రాజీపడలేదు. పరమత ప్రజల మీద విద్వేషం రగిల్చినంత కాలం, వలసపాలనను వ్యతిరేకించినంత కాలం.. ఆఖరుకు సరళ మతతత్వవాదులను సైతం తమతో కలుపుకుపోయారు. ఎప్పుడైతే మతాల మధ్య చిచ్చుపెట్టారో అప్పుడు అంటే 1937 తర్వాత మతతత్వవాదులను జాతీయోద్యమ పదవుల నుంచి బహిష్కరించారు.
నిజమైన జాతీయ నాయకులను తమ స్వంతం చేసుకునే పనిలో విఫలం కావడంతో.. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపీలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద, అధికారిక మీడియా మీద, ఎన్‌సీఈఆర్‌టీ మీద, పాఠ్యపుస్తకాల మీద తమ అధికారాన్ని వినియోగిస్తూ సావర్కర్, హేడ్గేవార్ వంటి వారిని గొప్ప జాతీయతావాద నాయకులుగా చెలామణి చేయాలని యత్నిస్తోంది.
మూడు ప్రధాన లోపాలు..
ట్రస్ట్ డెవలప్‌మెంట్‌లలో తమని భాగస్వామ్యం చేయలేదనీ సునీల్‌కపూర్ పేర్కొన్నారు. ఒకవేళ భాగస్వామ్యం చేసి ఉంటే, ఈ మార్పులపై తప్పక నిరసన తెలిపేవారమని ఆయన చెప్పారు. పునర్నిర్మాణంలో మూడు ప్రధాన లోపాలను ఆయన ఎత్తి చూపారు.
1. జలియన్‌వాలాబాగ్‌కి వెళ్లే సందు పూర్తిగా గోడలపై శిల్పాలతో మార్చేశారు. ఓవర్‌హెడ్ ఇనుప గ్రిల్స్‌తో కప్పేసి, దాని ఆత్మను దెబ్బతీశారు. ఇది కల్నల్ యొక్క క్రూరత్వానికి ప్రతిబింబించేది. డయ్యర్ సైనికులు అడ్డుకుని, వేలాదిమంది ప్రజల్ని దారుణంగా హతమార్చారు.
2. 'షహీదీ ఖూ' (అమరవీరుల బావి) ని వారు ట్యాంపర్ చేశారు. బావిని గాజుతో బంధించారు. అమరవీరుల ఛాయాచిత్రాలనూ వారు తీసివేశారు. ఇంతకన్నా అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. ఇది చారిత్రక వాస్తవం. ఇతరులతో పరిశీలిస్తే.. పంజాబీలు స్వాతంత్య్ర పోరాటంలో తమ జీవితాలను త్యాగం చేశారు. ఈ ప్రభుత్వం ఆ చరిత్రను శాశ్వతంగా తుడిచిపెట్టాలని చూస్తోంది.
జలియన్‌వాలాబాగ్ మారణకాండలో తన ముత్తాత లాలా వాసూమాల్ ఎలా అమరుడయ్యాడో, ఆ భయానకతను సునీల్‌కపూర్ గుర్తుచేసుకున్నారు. ఒక శతాబ్దం తరువాత కూడా తమ కుటుంబ ఆచారం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందన్నారు. తమ కుటుంబంలో ఏ వధువూ సాంప్రదాయక ఎర్రటి కంకణాలను ధరించడం లేదన్నారు. ఇది భారత స్వాతంత్య్ర పోరాట గమనాన్ని మార్చిన మారణకాండతో తమ అనుబంధాన్ని సూచిస్తోందని ఆయన అన్నారు.
3. జలియన్‌వాలా బాగ్ సమీపంలో ఉన్న దుకాణదారుల బృందమూ నిర్మాణ స్థలం ప్రజల కోసం మూసివేయడంతో ఈ మార్పులకు తొలి బాధితులయ్యారు. 'మారిన సందును చూసి మేము ఆశ్చర్యపోయాం. ఇది హోటల్ ప్రవేశమా లేక వినోద ఉద్యానవనమా అన్నట్లు కనిపిస్తోంది' అని ఒక దుకాణదారుడు చమత్కరించాడు. 'ఇదంతా చారిత్రాత్మక గతం యొక్క ఆ అనుభూతిని ప్రతిబింబించడం లేదు. ఇదంతా వినోదాత్మకంగా ఉంది. ఇది తప్పు, చాలా పొరపాటు' అని మరొకరు చెప్పారు.
సౌండ్ అండ్ లైట్..
పునరుద్ధరించిన జలియన్‌వాలాబాగ్ స్మారక ప్రాంగణాన్ని ప్రధానమంత్రి మోడీ గత ఏడాది ఆగస్టు 28న జాతికి అంకితం చేశారు. ఉపయోగంలో లేని భవనాలతోపాటు అవసరాలకు తగినట్లు వాడని వాటిని తిరిగి వాడుకునేలా సానుకూల పునర్వినియోగ విధానంలో నాలుగు మ్యూజియం గ్యాలరీలను సృష్టించారు. ఆ కాలంలో పంజాబ్‌లో చోటుచేసుకున్న ఉదంతాల చారిత్రక ప్రాధాన్యాన్ని ఈ గ్యాలరీలు చాటిచెబుతాయి. ఇందుకోసం దృశ్య-శ్రవణ సమ్మేళన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రొజెక్షన్ మ్యాపింగ్, 3డి రెప్రంజెంటేషన్, శిల్ప-చిత్రరూపాలతో ఏర్పాట్లు చేశారు. అలాగే 1919, ఏప్రిల్ 13 నాటి సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపడం కోసం 'సౌండ్ అండ్ లైట్' ప్రదర్శన కూడా ఉంది.
అవే చట్టాలు.. అవే విధానాలు..
మన దేశం బ్రిటిష్ పాలకుల పెత్తనం కింద ఉన్నప్పుడు ఆ పాలకులు జారీ చేసిన రౌలత్ చట్టం ఈ 'ఉపా' వంటిదే. జాతీయ స్వాతంత్య్రం కోసం గొంతెత్తకుండా ప్రజలను అణచేయడానికి నాటి బ్రిటిష్‌వాడు ఆ రౌలత్ చట్టం తెచ్చారు. దానిని, ఆ పాలకులను ప్రజలు పోరాడి, ఓడించారు. ఇప్పుడు మన పాలకులు దేశ స్వాతంత్య్రానికి చేటు తెచ్చే విధానాలను అనుసరిస్తున్నారు. ఆ విధానాలను ప్రశ్నిస్తున్నవారి మీద 'ఉపా' చట్టం ప్రయోగిస్తున్నారు. 'దేశ ద్రోహులు' 'అర్బన్ నక్సల్స్' అంటూ ముద్ర వేస్తున్నారు. ఆనాడు రౌలత్ చట్టానికి, దానిని తెచ్చిన పాలకులకు ఏ గతి పట్టిందో.. వాళ్లెలా దేశాన్ని వదిలి తోకముడుచుకు పారిపోయారో.. రానున్న రోజుల్లో ఈ 'ఉపా' చట్టానికి, ఈ పాలకులకు, వారు అనుసరిస్తున్న విధానాలకు అదే గతి పట్టక తప్పదు.
భావావేశపు విస్పోటన
భారతదేశంలో జలియన్‌వాలా బాగ్ దురంతానికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్‌లో జరుగుతున్న స్వాతంత్య్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా 'సహాయ నిరాకరణోద్యమం' ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్‌సింగ్ విప్లవకారుడిగా మారడానికీ ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన 'సర్' బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశారు. మొత్తంమ్మీద ఈ సంఘటన స్వాతంత్య్రోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి, వేగవంతం చేసిందని చెప్పవచ్చు.
1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్‌ను కింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరసిస్తూ తీర్మానాలు చేశారు. 'ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య!' అని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ తన పదవికి రాజీనామా చేశాడు.
అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో రాశారు - ''పట్టణం అంతా నా దయ మీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గానీ దయతలచి వదిలేశాను' - ఈ మాటలు అన్న వ్యక్తి ఎవరో కాదు స్వయంగా డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు.

ప్రజాపోరాటాలు ఎప్పటికైనా విజయం సాధించి తీరతాయి.. జలియన్‌వాలాబాగ్ నెత్తుటి త్యాగాలు వృథాకావు.. కానివ్వం.. ఆ భగత్‌సింగ్ వారసత్వాన్ని అందిపుచ్చుకునే అనేక మంది యువకులు నేడు పోరాటాల్లో పాల్గొంటున్నారు. అనేకమంది భగత్‌సింగ్‌లు ఉద్భవిస్తారు. పోరాటాలు మరింతమంది నాయకుల్ని తయారుచేస్తుంది.. మున్ముందు జరిగే మహోద్యమాలు ప్రజావినాశకర విధానాలు అవలంభించే పాలకులకు చరమాంకం పాడి తీరతాయి..


ఇది స్మారక చిహ్నాల కార్పొరేటీకరణ : చరిత్రకారులు


ఈ చర్య స్మారక చిహ్నాలనూ కార్పొరేటీకరించడమని ప్రముఖ చరిత్రకారుడు ఎస్.ఇర్ఫాన్ హబీబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ విలువలను కోల్పోయి, ఆధునిక నిర్మాణాలుగా మిగులుతాయని అంటూ.. స్మారక చిహ్నాలను కాలానుగుణంగా మార్పులు చేయకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. అమృత్‌సర్‌లో 1919లో మారణకాండ జరిగిన ప్రదేశమైన జలియన్‌వాలాబాగ్ పునరుద్ధరించబడిందని విన్నాననీ, అది వినాశనం.. అంటే ఆ ఘటన చివరి ఆనవాళ్లు కూడా లేకుండా సమర్థవంతంగా తొలగించబడ్డాయని మరో చరిత్రకారుడు, గ్లోబల్ ఇంపీరియల్ హిస్టరీ ప్రొఫెసర్ కిమ్ ఎ. వాగర్ మండిపడ్డారు.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొననివారే అపఖ్యాతి పాల్జేయగలరు : సీతారాం ఏచూరి

చారిత్రాత్మక స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొననివారు మాత్రమే ఇలా అపఖ్యాతి పాల్జేయగలరు. అమరవీరుల ప్రాణ త్యాగాలను మోడీ సర్కార్ ఎద్దేవా చేస్తుంది. ఆ లైట్లు, సౌండ్లు విషాదాన్ని వినోదాత్మకంగా చేశాయి. ఇలా వాళ్లే చేయగలరు.
ప్రాణత్యాగాలను అర్థంచేసుకోలేరు : రాహుల్

నేను అమరవీరుల వారసుడినే. అమర వీరులను అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. ప్రాణ త్యాగమంటే అర్థం తెలియనివారే జలియన్‌వాలాబాగ్ ఘటనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను అవమానించగలరు. స్వాతంత్య్రం కోసం పోరాటం చేయనివారు వారి ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకోలేరు.
స్ఫూర్తిని తగ్గించడమే : గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్ ఎంపీ)

నన్ను సాంప్రదాయ వాది అని పిలిచినా ఫరవాలేదు. కానీ ఇటువంటి గౌరవప్రదమైన చిహ్నాలకు డిస్కోలైట్లను అమర్చడానికి నేను వ్యతిరేకం. ఇటువంటి చర్యలు జలియన్‌వాలాబాగ్ చరిత్రను, పోరాట స్ఫూర్తిని తగ్గించి, వినోదాత్మకంగా కనిపించేలా చేస్తాయి.
చిహ్నాలకు, చరిత్రకు నష్టం : ప్రియాంక చతుర్వేది (శివసేన ఎంపీ)

పోరాటం, ప్రాణత్యాగం, విషాద ఘటనలకు స్పూర్తిగా నిలిచిన చిహ్నాలను అందంగా, ఆడంబరంగా, వినోదాత్మకంగా మార్చడం సరికాదు. అక్కడ జరిగిన ఘటన యథార్థం. నష్టం అపారం, విషాదం మరిచిపోలేనిది. అక్కడి పరిసరాలు ఆ త్యాగధనుల బాధను గుర్తుకు తెస్తాయి. వాటిని ఆధునీకరణ పేరుతో ఇలా మార్చడం జ్ఞాపక చిహ్నాలకు, చరిత్రకు నష్టం.
అసలప్పుడు ఏం జరిగింది..?

ఏప్రిల్ ఆరో తేదీ అనంతరం పంజాబ్‌లో జరిగిన ఓ సంఘటన చరిత్ర గమనాన్నే మార్చేసింది. ఏప్రిల్ 13న అమృత్‌సర్‌లో దారుణమైన నిర్భందకాండ జలియన్‌వాలాబాగ్ ఊచకోతగా పేరుగాంచింది.
గాంధీ నాయకత్వంలో నూతన వెల్లువకు పంజాబ్ ప్రధాన కేంద్రమైంది. ఉద్యమాన్ని అణచివేయడం కోసం గవర్నర్ డయ్యర్ దారుణమైన నిర్బంధకాండను ప్రయోగించారు. ప్రముఖ నాయకులైన డాక్టర్ సత్పాల్‌ను, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూను రాష్ట్రం నుంచి బహిష్కరించారు. హర్తాళ్ ద్వారా, బ్రహ్మాండమైన ప్రదర్శనల ద్వారా ప్రజలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.
ఈ ఘటనలు జరుగుతుండగానే గాంధీ అరెస్టు వార్త పంజాబ్‌కు చేరింది. శాంతియుతంగానే సాగిన సమరశీల ప్రదర్శన సహజంగానే గాంధీ అరెస్టుకు నిరసన తెలిపే ప్రదర్శన అయ్యింది. దీంతో ప్రదర్శకులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు హింసకు దిగారని, కొందరు యూరోపియన్లను హత్య చేశారనీ నిందారోపణ చేస్తూ ప్రభుత్వం అమృత్‌సర్ నగరాన్ని సైన్యానికి అప్పగించింది.
డయ్యర్ అధికారాన్ని స్వీకరించడంతో నిర్బంధకాండ మరింత తీవ్రమైంది. ప్రజలను విచక్షణా రహితంగా అరెస్టు చేశారు. సభలు, ప్రదర్శనలు నిషేధించారు. ఇన్ని చేసినా ప్రజలను అణచి ఉంచడం డయ్యర్ శక్యం కాలేదు. 'వారికి బుద్ధి చెప్పాలి' అని నిర్ణయించుకున్నాడు. దీంతో ఏప్రిల్ 13న సాయంత్రం నాలుగున్నర గంటలకు జలియన్‌వాలాబాగ్‌లో జరగనున్న బహిరంగసభను తన దాడికి లక్ష్యంగా డయ్యర్ ఎంచుకున్నాడు. డయ్యర్ చెప్పిన దానిని బట్టి ఆరువేల మంది ప్రజలు ఆ సభకు హాజరయ్యారు. అయితే ఆ సభకు పదివేల మంది హాజరైనట్లు ఇతరులు పేర్కొన్నారు. డయ్యర్ సభను చట్టవిరుద్ధం అని చెప్పడానికిగానీ, ప్రజలు చెదిరిపోవాలని కోరటానికి పూనుకోకుండా సభాస్థలికి చేరుకోడానికి అన్ని సౌకర్యాలూ కల్పించాడు. సభ జరిగే మైదానం ప్రజలతో కిటకిటలాడుతున్న సమయంలో కాల్పులు జరిపించాడు. ఈ ఘటనలో అనేక మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కొంత కాలానికి ఈ ఘటనకు దారితీసిన విషయాన్ని బ్రిటిష్ అధికారులే అంగీకరించారు. మొదట మృతుల సంఖ్య 280 అని అధికార అంచనా. కాగా ఐదు వందలకు చేరినట్లు తర్వాత ప్రకటించారు. అయితే మృతుల సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుందని అనధికారిక అంచనా.

జలియన్‌వాలాబాగ్ చాలా తక్కువ వైశాల్యం గల స్థలం. లోపలికి ప్రవేశించాలన్నా, బయటకు తిరిగి వెళ్లాలన్నా చిన్నద్వారం ఒకటి మాత్రమే ఉంది. లాఠీల ప్రయోగంగానీ, పోలీసు కాల్పులుగానీ జరిగినట్లయితే వాటిని చవిచూడటమే తప్ప వేరే మార్గంలేదు. అలాంటి స్థలంలోకి ప్రజలను ఎందుకు రానిచ్చారు? వారిపై కాల్పులెందుకు జరిపారు? కాల్పులు జరపకుండా వారిని అక్కడి నుంచి చెదిరిపోయేట్లు చెయ్యడం సాధ్యంకాదా? అని ఆ తర్వాత ఒక విచారణ సందర్భంగా డయ్యర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం అతని నిజరూపాన్ని బట్టబయలు చేసింది. ఆ విధంగా కాల్పులు జరిపినందువల్ల, శాంతి భద్రతల సంరక్షకుడిగా తన ప్రతిష్ట నిలబడిందని అతడు చెప్పాడు. కేవలం అమృత్‌సర్ ప్రజలనేగాక, మొత్తంగా పంజాబ్ ప్రజలందరినీ భయకంపితులను చేయాలనేది తన ఉద్దేశం అని చెప్పడానికి అతను వెనుకాడలేదు.
ఇది కేవలం జనరల్ డయ్యర్ ఒక్కడి విధానం మాత్రమేకాదు. అతనికి భారత ప్రభుత్వం నుంచి, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పూర్తిమద్దతు ఉంది. ఇంగ్లండులోనూ, భారత్‌లోనూ అనధికారులైన ఆంగ్లేయులు కొందరు డయ్యర్‌ను తమ సంరక్షకుడిగా కొనియాడారు. అయితే ఇంగ్లండులో సైతం ప్రజాతంత్ర వాదులు, అనేకమంది ఇతరులు ఈ ఊచకోతను నిరశించారు. అలాంటి వారందరినీ చల్లబర్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించి, ఆ ఊచకోతలపై విచారణ తతంగం నిర్వహించింది. ఆ కమిటీ నివేదిక డయ్యర్‌కు అనుకూలంగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకున్నారు.
అయినప్పటికీ, ఆ కమిటీలో అత్యధిక సభ్యులు యూరోపియన్లు. జనరల్ డయ్యర్ చర్యలను పూర్తిగా ఆమోదించలేకపోయారు. ప్రజలకు ముందు హెచ్చరిక చేయకుండానే కాల్పులు జరపడానికి ఉత్తర్వు జారీ చేశారు. కాల్పులు ఎక్కువసేపు కొనసాగాయని కూడా వారు అంగీకరించారు. ఆ కమిటీలో కొద్దిమంది భారతీయులు, మెజారిటీ సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయం అసమగ్రంగా ఉందని ఎత్తి చూపారు. డయ్యర్ చర్య 'అమానుషమైనది, బ్రిటిష్ వాడికి తగనిపని' అని పేర్కొన్నారు.
అధికారక విచారణ ఒకవైపు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ నియమించిన కమిటీ అనధికార విచారణ సాగించింది. గాంధీ, మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, ఫజ్లుల్ హక్, అబ్బాస్ త్యాబ్జీ ఆ విచారణ సంఘంలో సభ్యులు. ఆ తర్వాత మోతీలాల్ నెహ్రూ 1919లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు ఆయన స్థానంలో ఎం.ఆర్ జయకర్ ఆ కమిటీలో సభ్యులయ్యారు. దాదాపు వెయ్యిమంది సాక్ష్యాలను ఈ కమిటీ నమోదు చేసుకుంది. ఓ డయ్యర్ పాలన కింద జరిగిన అమానుష చర్య మనసున్నవాడికి ఎవరికైనా దిగ్భ్రాంతిని కలుగజేస్తుందని కమిటీ తన నివేదికలో పేర్కొంది.
కమిటీ విచారణ అనంతరం కొన్ని నిర్ధారణలు చేసింది. పంజాబ్‌లో డయ్యర్ కవ్వింపు చర్యలు ప్రజల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. గాంధీని అరెస్టు చెయ్యడం, సత్వాల్‌ను, కిచ్లూను రాష్ట్రం నుంచి బహిష్కరించడం జరగకపోయినట్లయితే ప్రజలు హింసాత్మక చర్యలకు దిగేవారు కాదు. ఆవేశంలో ఉన్న ప్రజలను అణచివేయడం కోసం మార్షల్ లా ప్రవేశపెట్టారు. ఆ చర్య ఏ విధంగానూ సమర్ధనీయం కాదు. దాదాపు 12 వందల మందిని చంపడం, ప్రజానీకంపై కక్షసాధింపు చర్యలకు దిగడం ఏవిధంగా చూసినా దారుణమే. ఆధునిక బ్రిటిష్ పాలన చరిత్రలోనే ఇంతటి క్రూరత్వంతో కూడిన ఊచకోత మరొకటి లేదు.
ఒక్క జలియన్‌వాలాబాగ్ కాల్పులే కాదు. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతిచర్యా పాలకుల పాశవికతకు స్పష్టమైన నిదర్శనంగానే సాగింది. నిజానికి, అధికార పూర్వకంగా సైనిక శాసనాన్ని ప్రవేశపెట్టింది ఆ ఘటన తర్వాతే. ప్రత్యేకంగా ఒక రోడ్డు మీదుగా వెళ్లే సందర్భంలో ప్రజలు పాకుతూ పోవాలని ఉత్తర్వు జారీ చేశారు. ఎవరైనా నేరస్థులని అధికారులు అనుకుంటే, వారిని లాఠీలతో, కొరడాలతో కొట్టడం సర్వసాధారణమైంది. ఈ పనికి అనేక స్థలాలను ప్రత్యేకించారు. 51 మందికి మరణశిక్షలు, 46 మందికి యావజ్జీవ శిక్షలతో సహా మొత్తం 289 మందికి శిక్షలు విధించారు.

ప్రజా వెల్లువను మొగ్గలోనే తుంచేయాలన్న తలంపుతో ఈ చర్యలన్నీ తీసుకున్నప్పటికీ ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. నిరసన, ప్రతీకార భావాలు ప్రజానీకంలో విస్తృతంగాను, లోతుగాను అలముకున్నాయి. ఈ భావాలకు రూపకల్పన చేయడం ద్వారా గాంధీ మొదటిసారి అఖిలభారత రాజకీయాలలో ప్రవేశించారు. ప్రసిద్ధిగాంచిన ఇతర నాయకులు అనుసరించిన దానికి భిన్నమైన పద్ధతులను అనుసరించారు. జలియన్‌వాలాబాగ్ ఊచకోతను తన పోరాటానికి ఒక సమస్యగా చేపట్టారు. మితవాదులు, వారి కంటే కూడా బ్రిటిష్ వారికి మరింత విధేయులుగా ఉండే కేంద్ర శాసనసభ సభ్యులు, ప్రభుత్వం నియమించిన జలియన్‌వాలాబాగ్ విచారణ కమిటీలో సభ్యులుగా ఉన్న భారతీయులతో సహా యావన్మంది ప్రజల నుంచి నిరసన రేకెత్తించిన సమస్య అది. ఈ సమస్యలపై అసాధారణమైన రీతిలో ప్రజానీకాన్ని సమీకరించిన ఆ ఉద్యమంలో గాంధీ అగ్రభాగాన నిలిచారు.
(ఇఎంఎస్ రచించిన భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర నుంచి)
శాంతిశ్రీ
83338 18985