May 20,2023 19:32

కార్యక్రమంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

ప్రజాశక్తి - ఆదోని
95 ఏళ్ల ఆదోని ఎస్‌బిఐ చరిత్రలో రూ.65 కోట్ల రుణాలిచ్చి ఆదోని ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచి చీఫ్‌ మేనేజర్‌ అబ్దుల్‌ రావూఫ్‌ చరిత్ర సృష్టించారని ఎస్‌బిఐ కర్నూలు ఎజిఎం శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం పట్టణంలోని మెయిన్‌ బ్రాంచిలో వ్యాపార వేత్తలు, బిల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడారు. ఇకపై స్టేట్‌ బ్యాంక్‌ కస్టమర్లకు అవస్థలు ఉండవని, గంటల తరబడి నిరీక్షించకుండా ఉండేందుకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం చీఫ్‌ మేనేజర్‌ అబ్దుల్‌ రావూఫ్‌ మాట్లాడారు. కస్టమర్లతో స్నేహభావంగా మెలగాలని, అమర్యాదగా, నిర్లక్ష్యంగా మాట్లాడకూడదనే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కస్టమర్లతోనే సంస్థ నడుస్తోందని, అలాంటి కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా హౌసింగ్‌ లోన్‌, మరే ఇతర లోన్లకు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగకుండా అతి త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారులకు కరెంటు అకౌంట్‌ తెరిచేందుకు 9వ కౌంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. అకౌంట్‌ తెరవాలనుకునే వారు రూ.5 వేలు నగదు, ఆధార్‌, పాస్‌ పోర్ట్‌, పాన్‌ కార్డ్‌ ట్రేడ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని తెలిపారు. ట్రేడ్‌ లైసెన్స్‌ లేని వారికి మున్సిపాలిటీలో లైసెన్స్‌ సదుపాయం ఉందని, ఇందుకు కూడా తమ సహకారం ఉంటుందని చెప్పారు. ఎఒ నేతాజీ, అసిస్టెంట్‌ మేనేజర్‌ మహబూబ్‌ బాష, ఎస్‌బిఐ సిబ్బంది, పట్టణంలోని బిల్డర్స్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.