Nov 19,2023 00:07

ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: అనాది కాలం నుంచి అక్షర లిఖితమైన గ్రంథాలు మన సంస్కృతిని, చరిత్రను తెలియజేసేలా ఉన్నాయని చైతన్య సాహితి సమితి అధ్యక్షులు నాగిరెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ కేంద్రంలో శనివారం 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకొని 'సాహిత్య సదస్సు' నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సమితి అధ్యక్షులు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనానికి ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. విశిష్ట అతిధి జి.సలీం మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు గురించి, ఉచిత సేవలను గురించి విద్యార్థులకు వివరించారు. పిసిఆర్‌ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రమేష్‌ మాట్లాడుతూ చరిత్రలో జరిగిన పోరాటాలన్నీ విజ్ఞాన సముపార్జన చేసిన పుస్తకాల ద్వారానే మొదలైయ్యాయన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు, రచయితల సంఘం మాజీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ చదువు మనుషులను జ్ఞానవంతులుగా మారుస్తుందన్నారు. గ్రంథాలయ అధికారులు లలిత, మధుబాబు, గుణశేఖర్‌, బిలాల్‌, రాజ్‌కుమార్‌, పూర్ణిమ, తులసికుమార్‌, దేవిబాల, సరస్వతి పాల్గొన్నారు.