ప్రజాశక్తి-పాడేరు :అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసుపత్రిలలో పని చేస్తున్న శానిటేషన్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని కాంట్రాక్ట్ నారాయణ రావుతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ తో శనివారం పాడేరు ఆసుపత్రి ఎదురుగా సమ్మె చేస్తున్న ఆవరణలో సుమారు 8 అంశాల పైన చర్చలు జరిగాయి. జీతాలు పెంపు, పాడేరు, అరకులో ఒక విధానం, ముంచంగిపుట్టు, చింతపల్లిలో మరొక విధానంలో జీతభత్యాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని కార్మికులు, సిఐటియు నేతలు తెలిపారు. పిఎఫ్ డబ్బులు సక్రమంగా జమ కాలేదని రెండు డిమాండ్లతో జరిగిన చర్చలు ఆగిపోయాయని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు.
రెండవ రోజు సమ్మె జరుగుతుందని చిన్నయ్య పడాల్ అన్నారు. చింతపల్లి, ముంచంగి ఫుట్, అరకు, పాడేరు, ఆస్పత్రుల కార్మికులు తమ సమస్యల పరిష్కారంపై కాంట్రాక్టు నుంచి ఎటువంటి స్పందన కానరాకపోవడంతో కార్మికులంతా సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు పాడేరు డివిజన్లోని నాలుగు ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల లో పనిచేస్తున్న సుమారు 56 మంది శానిటేషన్ కార్మికులు నేడు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టనున్నారు. ఆస్పత్రుల శానిటేషన్ కార్మికుల వేతన సమస్యల పరిష్కారం పై వైద్య విధాన పరిషత్ అధికారులు శ్రద్ధ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనేకసార్లు కార్మికుల వేతన సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా అధికారులకు విన్నవించామని అయినా స్పందన కరువైందన్నారు. జీవో ప్రకారం ప్రతి కార్మికుడికి నెలకు 16 వేల రూపాయలు వేతనం చెల్లించాలని కానీ కొన్ని ఆసుపత్రుల్లో కార్మికులకు 10,700 మరికొన్ని ఆసుపత్రుల్లో 9,500 చొప్పున చెల్లిస్తున్నారని తెలిపారు. పిఎఫ్ ఈఎస్‌ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. నేటి నుంచి కార్మికులు చేపడుతున్న సమ్మెతోనైనా అధికారులు స్పందించి వారి వేతన సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ముఖ్యంగా కార్మికులకు కాంట్రాక్టు విధానం చేయాలని, వైద్య విధాన పరిషత్ ద్వారా జీతాలు చెల్లించాలని. ప్రతి ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించి కార్మికులపై పని భారం పని ఒత్తిడి తొలగించాలని డిమాండ్ చేశారు, 2019 నుంచి కార్మికుల జీతాలు పెంచలేదని, ఈ నాలుగేళ్లలో అన్ని నిత్యవసర ధరలు రెట్టింపు అయ్యాయని దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి కార్మికుడికి నెలకు 16000 జీతం చెల్లించాలని ప్రతినెల సక్రమంగా వేతనాలు చెల్లించాలని కార్మికులకు పీఎఫ్ ఈఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సుందరరావు, కార్మికులు ముత్యాలమ్మ, రఘు, రామారావు, సుబ్బలక్ష్మి, ఘటి, సింహాచలం, శివ, నగేష్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
అరకులోయరూరల్: అరకు ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అరకు ఏరియా ఆసుపత్రి పారిశుధ్య కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శనివారం రెండో రోజు కొనసాగింది. కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌బి పోతురాజు, సిపిఎం మండల కార్యదర్శి కె.రామారావు మద్దతు తెలిపారు. ఈ సంధర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్‌బి పోతురాజు మాట్లాడుతూ, ఆసుపత్రి పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ: 26000 చెల్లించాలని డిమాండ్ చేశారు. అల్లూరి జిల్లాóలో సరిపడ సిబ్బందిని పూర్తి స్ధాయిలో నియమించాలన్నారు. కాంట్రాక్టు విధానం రద్దు చేసి, వైద్య విధాన పరషత్ ద్వారా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పిఎప్, ఇఎస్‌ఐ సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. జీతంతో కూడిన సెలవులు మంజూరు చేసి, యూనిఫాం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేషియల్ యాఫ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై గతంలో ఐటిడిఎ పిఓ, జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు వినతి పత్రం అందజేసినా స్పందించ లేదని, దీంతో విధులను బహిష్కరించి కార్మికులు సమ్మె చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పారిశుద్ధ కార్మిక సంఘం నాయకులు మోహన్, ద్రౌపతి, కృప, సూర్య, బాలన్న, తదితరులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన దీక్షలకు గిరిజన సంఘం జిల్లా కోశాధికారి కె.నర్సయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు చెల్లించి, కాంట్రాక్టు విధానం రద్దు చేయాలన్నారు. జీతంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, యూనిఫాం, సేప్టి పరికరాలు అందించాలన్నారు. పేషియల్ యాఫ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై వెంటనే వైద్య శాఖాధికారులు తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాధ్, గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షుడు జీ.నారాయణ, కె,కొండయ్య పాల్గొన్నారు.










