Feb 28,2021 06:37

చర్చలకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం ముందుగా ఏర్పాటు చేయాలని 'కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ' (కెఎంఎస్‌సి) ప్రధాన కార్యదర్శి శర్వాన్‌ సింగ్‌ పాంథేర్‌ వ్యాఖ్యానించారు. జనవరి 26న జరిగిన కిసాన్‌ పరేడ్‌లో పాల్గొన్న సంఘాల్లో ఇదొకటి. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా-ఉగ్రహాన్‌) మాదిరిగానే పంజాబ్‌లో రైతులు, వ్యవసాయ కార్మికుల్లో ఈ సంఘానికి కూడా విస్తృత మద్దతు, ఆదరణ వుంది.


జనవరి 29న సింగూ నిరసన ప్రాంతం లోని కమ్యూనిటీ కిచెన్‌లో కెఎంఎస్‌సి వలంటీర్లు పని చేస్తున్నారు. ఈలోగా అల్లరి మూకలు పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలోకి చొరబడి వారిపై రాళ్ళు విసిరారు. పెద్దగా నినాదాలు చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన వర్గాలు ఈ దాడికి పాల్పడ్డాయని శర్వాన్‌ సింగ్‌ తెలిపారు. రైతులను రెచ్చగొట్టడానికి, ఈ ఆందోళనకు మతం రంగు పులమడానికి జరిగిన ప్రయత్నమని వ్యాఖ్యానించారు. ఈ దాడిలో అనేకమంది వలంటీర్లు గాయపడ్డారని తెలిపారు. ఆ అల్లరి మూక కమ్యూనిటీ కిచెన్‌లో పని చేస్తున్న ఒక మహిళపై దాడి చేయగానే 22 ఏళ్ళ యువకుడు ఆత్మరక్షణ కోసం చర్యలు తీసుకున్నాడని, పోలీసులు వెంటనే తీసుకెళ్ళిపోయారని తెలిపారు. అల్లరి మూక దాడి చేసినపుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చర్చలు జరగాలంటే ముందుగా సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వుందని శర్వాన్‌ సింగ్‌ 'ఫ్రంట్‌లైన్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ముఖ్య అంశాలు...
 

చట్టాల రద్దు, ఇతర డిమాండ్లపై చర్చించాలంటే చిన్న కమిటీ ఏర్పడాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తోంది!
అటువంటి కమిటీల వల్ల ప్రయోజనం వుంటుందని మేం అనుకోవడం లేదు. చర్చలకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం ముందుగా సృష్టించాలి. ముందుగా పరిస్థితులు సాధారణ స్థితికి రావాలి. అరెస్టయిన 120 మంది రైతులను విడుదల చేయాలి. ప్రభుత్వ ఆస్తుల విధ్వంస చట్టం, అంటువ్యాధుల నివారణ చట్టం, విపత్తు నిర్వహణా చట్టం కింద రైతు నేతలపై కేసులు దాఖలయ్యాయి. ఆందోళన జరుగుతున్న ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ను ఇంత సుదీర్ఘకాలం ఎందుకు నిషేధించారో ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబు ఇచ్చుకోవాల్సి వుంది. మాకు వ్యతిరేకంగా వారి ఆలోచనలు, ఐడియాలు ప్రచారం చేసుకోవాల్సి వచ్చినపుడు జనవరి 26 తర్వాత ఇంటర్‌నెట్‌ పని చేస్తోంది. మేం మా అభిప్రాయాలు వ్యక్తం చేయాలనుకున్నపుడు చేయలేకపోయాం. ఇంటర్‌నెట్‌పై నిషేధంతో విద్యార్థులు, మీడియా సిబ్బంది...ఇలా ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆందోళనలు, నిరసనలకు అనుకూలంగా ట్వీట్‌ చేయాలనుకున్నవారిపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. మా మోర్చాపై దాడి చేసే గూండాలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మా పోరాటానికి అంతర్జాతీయ ప్రముఖులు చాలామంది మద్దతిస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. ఇది తమ అంతర్గత విషయమంటూ ప్రభుత్వం చెప్పడం చూస్తుంటే తాము ఎదుర్కొంటున్న ఒక రకమైన ఒత్తిడిని దౌత్య పద్ధతిలో చెప్పడంగానే వుంది. మా డిమాండ్లు నెరవేరేవరకు ఈ పోరాటం సాగుతుంది. వ్యవసాయ రంగంలో విఫలమైన ప్రయోగాలను రైతులకు విక్రయించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటు సంస్థల ప్రాతినిధ్యం వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అయినట్లైతే...బిజెపి పాలిత రాష్ట్రాలైన బీహార్‌, మధ్యప్రదేశ్‌లో వర్తకులు క్వింటాల్‌ ధాన్యాన్ని కనీస మద్దతు ధర కన్నా రు.7-8 తక్కువకి ఎందుకు కొంటున్నారు. పంజాబ్‌లో మండీల్లో ఎందుకు అమ్ముకుంటున్నారు?
 

మీరు ఆందోళన జరుపుతున్న ప్రాంతానికి వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. మీడియా సిబ్బంది కూడా నేరుగా మీ దగ్గరకు రాలేకపోతున్నారు.
ఈ దేశ అన్నదాతలకు ఇది బహిరంగ జైలుగా వుంది. చివరకు అంతర్జాతీయ సరిహద్దుల్లో కూడా ఈ తరహా బారికేడ్లు లేవు. అల్లరి మూకలు మాపై పెట్రోల్‌ బాంబులు విసిరారు. ఈనాటి వరకు వారి పాత్రపై ఎలాంటి దర్యాప్తు లేదు. అనేకమంది వారిని గుర్తించారు, కానీ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. మా ఫిర్యాదులో మేం వారి పేర్లు కూడా పేర్కొన్నాం. కానీ ఫలితం లేదు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయినందుకు జర్నలిస్టు మన్‌దీప్‌ పునియాను పోలీసులు తీసుకెళ్ళారు.
 

అయితే, జనవరి 29న జరిగింది మొత్తంగా ఏకపక్ష దాడి అంటారా మీరు?
మాపై దాడి చేయడానికి వారు త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించారు. పోలీసుల శిబిరాలను కూడా ఉపయోగించారు. దీనిపై ప్రధాని ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? ఇది జాతీయ పతాకాన్ని అవమానించడం కాదా? అల్లరి మూకలు మహిళా శిబిరంపై దాడి చేశాయి. అక్కడ వున్న వాషింగ్‌మెషీన్‌ వంటి పరికరాలను ధ్వంసం చేశారు. పోలీసులు మాపై బాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. అల్లరి మూకలపై కాదు.
 

ప్రభుత్వం చెప్పినట్లుగా దాడులకు పాల్పడింది స్థానికులేనా?
కాదు, వారు కానే కాదు. దాడి చేసినవారు కిరాయి దుండగుల్లా కనిపిస్తున్నారు. వారిలో కొంతమంది పోలీసు యూనిఫారంలో కనిపించారు. జనవరి 26 నాటి సంఘటనలను వారు ఒక సాకుగా చెబుతున్నారు. బారికేడ్ల వల్ల మీడియా, స్థానికులతో సహా ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు మాకు మద్దతిస్తున్నారు, సాయపడుతున్నారు. హర్యానా ప్రజల తోడ్పాటు లేకపోతే మేం ఇంతకాలం ఇక్కడ వుండలేకపోయేవాళ్ళం. అల్లరి మూకలు ఆ ప్రాంతంలోకి రాకుండా నివారించడానికి ప్రస్తుతమున్న బారికేడ్లు ఉపయోగపడడం లేదు. ఈ కొత్త బారికేడ్లతో పోలీసులు మమ్మల్ని వేధిస్తున్నారు. పారిశుధ్యం కొత్త సవాలుగా మారింది. పారిశుధ్య కార్మికులు రాకపోకలపై, మురుగునీటి కాల్వలపై ఆంక్షలున్న కారణంగా వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి వుంది. టాయిలెట్లు పొంగిపొర్లుతున్నాయి.
 

'సంయుక్త కిసాన్‌ మోర్చా'లో మీ సంస్థ భాగం కాదని ఒక అభిప్రాయం వుంది!?
మేమందరం కలిసే వున్నాం. ఇది ఒక విభిన్నమైన వేదిక మాత్రమే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌పై మేం పూర్తి ఐక్యతతో వున్నాం. ఈ నెల 6వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన 'చక్కా జామ్‌' కార్యక్రమంలో కూడా మేం భాగస్వాములమే. ఇది కేవలం పంజాబ్‌, హర్యానా సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా వున్న రైతాంగం...వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విషయమై ఒక్క తాటిపై వున్నారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకే మా ఈ పోరాటం.
                                                                  * శర్వాన్‌ సింగ్‌ పాంథేర్‌