ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం 24న నిర్వహించే 'చలో విజయవాడ' జయప్రదం కోసం మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం బైక్ ర్యాలీ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా యూనియన్ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్లయినా తన మాటను నెరవేర్చలేదన్నారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం ఏవీ మున్సిపల్ కార్మికులకు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో జీవనం కష్టమైందని, అర్ధాకలితోనే కార్మికులు పనులు చేయాల్సి వస్తోందని చెప్పారు. కోవిడ్ కాలంలోనూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పని చేసిన తమకు చప్పట్లు కొట్టడం మినహా సదుపాయాలేమీ కల్పించలేదని, చప్పట్లు కడుపు నింపవనే విషయాన్ని సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆశలవారీగా ఉధృత ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. చలో విజయవాడలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీలీ పల్లయ్య, పి.ఏసు, వీరకుమార్, నవీన్, శ్రీను, నరసింహారావు పాల్గొన్నారు.










