Apr 09,2023 00:02

చొప్పల్లి గ్రామంలో జరిగిన సభలో పాల్గొన్న మహిళలు

ప్రజాశక్తి- విఆర్‌.పురం
మండలం రామవరం పంచాయతీ పరిధి చొప్పల్లి గ్రామాన్ని 41.15 మొదటి కాంటూరులో చేర్చాలని సిపిఎం, టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. గ్రామంలో శనివారం జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, రామవరం సర్పంచ్‌ కారం బుచ్చమ్మ, ఉప సర్పంచ్‌ భాగ్యలక్ష్మి, టిడిపి నాయకులు ప్రకాష్‌రావు మాట్లాడుతూ ఆర్‌ అండ్‌ ఆర్‌ సర్వే చేసి తమ గ్రామానికి న్యాయం చేయాలని కోరారు. గత సంవత్సరం వచ్చిన బ్యాక్‌ వాటర్‌ వలన చొప్పల్లి గ్రామం మునిగితే గ్రామ ప్రజలు తీవ్రంగా ఆస్తి నష్టపోయారని తెలిపారు. గ్రామస్తులు రిజర్వ్‌ పారెస్ట్‌ పరిధిలో వున్న అడవిలో సుమారు 3నెలలు తలదాచుకోవడం జరిగిందని చెప్పారు. మండల అధికారులకు చొప్పల్లి గ్రామం ముంపు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకుని రామవరం, ఏవి గూడెం గ్రామాలతో పాటు చొప్పల్లి గ్రామాన్ని మొదటి ప్రాధాన్యతలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు వడ్లాది రమేష్‌, కారం సుందరయ్య, పుంజ నాగిరెడ్డి, టిడిపి నాయకులు, చొప్పల్లి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.