Sep 12,2023 20:52

కేసు వివరాలు తెలియజేస్తున్న ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌

కడప అర్బన్‌ : కడప టూ టౌన్‌ పరిధిలో బంగారు ఆభరణాల దుకాణంలో భారీ చోరీ కేసులో పోలీసులు ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. మంగళవారం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాలులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 40 లక్షల 70 వేల విలువైన 808 గ్రాముల బంగారం, స్కూటర్‌ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక పోలీస్‌ బందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో ఐదు పాత బంగారు కడ్డీలు, 34 బంగారు ఉంగరాలు, బంగారు గొలుసు ఉన్నాయని తెలిపారు. బంగారు దుకాణాల అసోసియేషన్‌ వారికి గతంలో సి.సి కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అవగాహన కల్పించామని చెప్పారు. ప్రస్తుత చోరీ కేసు చేధనలో సి.సి కెమెరాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. దొంగలను అరెస్టు చేసి భారీగా బం గారాన్ని రికవరీ చేసిన కడప డిఎస్‌పి ఎం.డి షరీఫ్‌ ఆధ్వర్యంలో కడప టూ టౌన్‌ సిఐ సయ్యద్‌ హాషం, ఎస్‌ఐలు యు.వై జయరాములు, ఎం.ఎన్‌ సంజీవ రాయు డు, ఎఎస్‌ఐ పి.భాస్కర్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు సుధాకర్‌, రాము, కానిస్టేబుళ్లు రమేష్‌, తులసీరామ్‌, టిప్పు సుల్తాన్‌ ను అభినందించారు. నగదు రివార్డులు అందజేశారు.