Oct 28,2022 23:40

దారాలమ్మ ఆలయంలో దొంగతనంపై ఆరా తీస్తున్న సిఐ రవికుమార్‌

ప్రజాశక్తి- సీలేరు
దారాలమ్మ ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా పెట్టామని జీకేవీది సిఐ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. ఆయన స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ దొంగతనంపై అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. దారాలమ్మ ఆలయంలో చోరి జరిగిన రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో పల్సర్‌ బైక్‌ను దారకొండలో దొంగలు అపహరించి సీలేరు చెక్‌పోస్టు రోడ్డు సమీప తుప్పల్లో పడేశారని తెలిపారు. తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాత నేరస్తులపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తులు గత నెలలో విశాఖ జైలు నుంచి విడుదలయ్యారని, వారు ఎక్కడ ఉంటున్నారు, వారి స్థితిగతులు ఏంటి అనే కోణంలో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. సీలేరులో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్‌లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. దారాలమ్మ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వ్యక్తులు అపరచిత వ్యక్తులపై నిఘా పెట్టి చోరీపై పూర్తిస్థాయి ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. దోపిడీలో గ్రామస్తులు ప్రమేయం ఉందా లేదా అనే కోణంలో కూడా విచారణ చేపడతామన్నారు. దోపిడీ దొంగలను అతి తొందరలోనే పట్టుకుంటామన్నారు.
దొంగలను త్వరగా పట్టుకోవాలి
దారాలమ్మ ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలను తొందర్లో పట్టుకోవాలని భారత ఆదివాసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గడుతురి రాంగోపాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ ఆలయానికి ప్రతిరోజు ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగ్గ వసతి సదుపాయాలు కల్పనలో దేవాలయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.