Feb 26,2023 23:37

జోరుగా పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభ ప్రచారం

ప్రజాశక్తి - యంత్రాంగం
ఎంవిపికాలనీ:విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు సహా ఆర్‌కె.బీచ్‌లో కోరెడ్ల రమాప్రభ ప్రచారం విస్తృతంగా సాగింది. బీచ్‌ రోడ్డులోని వైఎంసిఎ నుంచి సబ్‌మెరైన్‌ వరకూ నిర్వహించిన ప్రచారంలో రమాప్రభ పాల్గొన్నారు. పిడిఎఫ్‌ తరుఫున పోటీచేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మనవి చేశారు. తాను రాజకీయపార్టీలకు అతీతంగా 250కు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. శాసన మండలిలో ఉత్తరాంధ్ర గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పిడిఎఫ్‌ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని ఓటర్లను గందరగోళ పరిచేందుకు ఇంకో రమాప్రభను పోటీలో పెట్టి ఓట్లు చీల్చడానికి పెద్దకుట్ర పన్నాయన్నారు. ఆ విషయాన్ని పట్టభద్ర ఓటర్లు గ్రహించి అధికార, ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార క్యాంపెయిన్‌లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, సీనియర్‌ నాయకులు జిఎస్‌.రాజేశ్వరరావు, వార్వా నాయకులు ఎం.శివనాగేశ్వరరావు, గిరిజన సంఘం నాయకులు సత్యన్నారాయణ, ఐద్వా జోన్‌ కార్యదర్శి కె.కుమారి, ప్రజానాట్య మండలి నాయకులు దండు నాగేశ్వరరావు, ఎం.చంటి, పి.వెంకటరావు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ విజయాన్ని కాంక్షిస్తూ రాంనగర్‌ ప్రాంతంలో సిఐటియు జగదాంబ జోన్‌ నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. కె.నరసింగరావు, ఎం.సూరీడు, ఎం.సుబ్బారావు, అప్పలరాజు, రామారావు పాల్గొన్నారు.
మాధవధార : పిడిఎఫ్‌ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని ఆదివారం తెన్నేటినగర్‌ ప్రాంతంలో వివిధ సంఘాల నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూన వెంకటరావు, పి.రామారావు, ఎస్‌ శ్రావణ్‌ కుమార్‌, బి.పాపారావు, ఎస్‌.హరిబాబు పాల్గొన్నారు.
భీమునిపట్నం : మండలంలోని తాళ్లవలసలో సిఐటియు నాయకులు ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఓటును వేసి కోరెడ్ల రమాప్రభను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరుతూ పట్టభద్రులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రవ్వ నరసింగరావు, ఎస్‌.అప్పలనాయుడు పాల్గొన్నారు
పెందుర్తి : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు మద్దతుగా ఎస్‌ఆర్‌.పురం, జూత్తాడ గ్రామాలో ప్రజా సంఘ నాయకులు ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ ప్రచారంలో సిఐటియు నాయకులు బి.జగన్‌, శంకరరావు, డి.వెంకటరమణ, మహిళ సంఘం నాయకులు బి.రమణి పాల్గొన్నారు.
సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నిస్తా
అనకాపల్లి : ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక, రైతు మహిళా ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనమండలిలో ప్రశ్నిస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ అన్నారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. సమస్యలపై ప్రశ్నించే గొంతు వినిపించాలంటే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉద్యోగ పట్టభద్రులను కోరారు. సమావేశంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.అజరు కుమార్‌, జిల్లా అధ్యక్షులు ఎం. నాగభూషణం, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, మళ్ల స్వామి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.
రైతుసంఘాల నేతల విస్తృత ప్రచారం
కె.కోటపాడు : ప్రజల సమస్యలపై ప్రశ్నించే వ్యక్తిని శాసనమండలికి పంపిద్దామని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి గండి నాయినిబాబు, ప్రజాసంఘాల మండల కన్వీనర్‌ ఎర్ర దేవుడు కోరారు. ఆదివారం మండలంలోని గాలివలస గ్రామంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పిడిఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ విస్తృతం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వనమ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ప్రచారం
చోడవరం:పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభకు ప్రధమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతూ ఎల్‌ఐసి ఐసియు, డివైఎఫ్‌ఐ, కెవిపిఎస్‌ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతం ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎల్‌ఐసి నాయకులు లవరాజు, అప్పారావు, శ్రీను, కల్యాణ్‌, గణేష్‌ డివైఎఫ్‌ఐ నాయకులు నాయుడు, గణేష్‌, కెవిపిఎస్‌ నాయకులు చందర్రావు పాల్గొన్నారు.
పాడేరు : ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభకు తమ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్‌ శెట్టి నాగరాజు తెలిపారు. ఆదివారం పాడేరు కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. రమాప్రభను ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఇప్పటికే శాసనమండలిలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, పిఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సమస్యలు పరిష్కారం కావాలంటే పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల కృషి ఎంతో ఉందని తెలిపారు. మనం చేస్తున్న ఉద్యమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ మన సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తున్న పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రస్తుతం వైసీపీ, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్నాయన్నారు. పని ఒత్తిడి పెంచుతూ కనీస వేతనాలు అమలు చేయలేదని తెలిపారు. కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో జిసిసి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, గిరిజన గురుకులాలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌, ఐటిడిఏ, టూరిజం ఇతర ప్రభుత్వ శాఖల్లో వందలాది మంది కార్మికులు ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు కే.లక్ష్మణరావు, మహేష్‌ పాత్రుడు, నాగరాజు, వీరన్న పడాల్‌, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
డుంబ్రిగూడ:ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని పట్టభద్రులకు కరపత్రాలను పంచారు. ప్రజా సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించే పిడిఎఫ్‌ అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.