ప్రజాశక్తి ఆనందపురం: చిరు ధాన్యాలు అభివృద్ధి - చోడి పంటలో యాజమాన్య పద్ధతులపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం మండల కాంప్లెక్స్‌లోని వెలుగు సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పథక సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆశా దేవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చోడి పంటలో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను అనుసరించి అధిక దిగుబడిని సాధించేందుకు ఆర్‌బికె స్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. ఎద పద్ధతిలో కాకుండా ఉడుపు పద్ధతిలో పండిస్తే ఎక్కువగా పిలకలు తొడిగి అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. చోడి పంటలో క్షేత్ర ప్రదర్శన చేస్తున్న 15 మంది రైతులకు ఆత్మ పథకం ద్వారా ఉపకరణాలు అందించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు బి.విజరుప్రసాద్, వ్యవసాయ అధికారులు సిహెచ్.సంధ్య రత్న ప్రభ, ఎంవి.సింహాచలం, పి.శ్రీకాంత్, బి.శశికళ, స్థానిక రైతులు పాల్గొన్నారు.










